కాబోయే ముఖ్యమంత్రికి ఉండవల్లి సలహాలు.. జగన్‌ పాటిస్తారా!?

  • IndiaGlitz, [Monday,May 27 2019]

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మరో రెండ్రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి.. రాజకీయ ఉద్ధండుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పలు సలహాలు, సూచనలు చేశారు. సోమవారం రాజమండ్రిలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి.. ఏపీ రాజకీయ పరిణామాలు, చంద్రబాబు-పవన్‌ పార్టీల ఓటమితో పాటు పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడారు. సీఎంగా ప్రమాణం చేయబోతున్న జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. అవినీతిరహిత పాలన అందిస్తామని జగన్‌ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని ఉండవల్లి చెప్పారు. విప్లవాత్మక మార్పులకు జగన్‌ వ్యాఖ్యలు నాంది పలుకుతున్నట్లు తనకు అనిపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.

జగన్‌కు సలహాలు..!

ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక మాఫియాను మొదట అరికట్టాలని వైఎస్ జగన్‌కు ఉండవల్లి సలహా ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక అక్రమాలు ఆపాలి. చంద్రబాబు ప్రభుత్వానికి ఇసుక వల్లే చెడ్డపేరు వచ్చింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో సీనియర్ ఇంజనీర్లతో సంప్రదింపులు చేయాలి. జూలైలో వచ్చే వరద నుంచి ప్రాజెక్టును ను కాపాడండి. ప్రభుత్వసలహాదారుగా అజయ్‌కల్లాం నియామకం హర్షణీయమన్నారు. చంద్రబాబుపై నెగెటివ్‌ ఓటుతో జగన్‌ అధికారంలోకి రాలేదని.. ప్రజలకు ఏదో చేస్తాడన్న నమ్మకంతో జగన్‌కు ఓటేశారన్నారు. జగన్‌ 50శాతం ఓట్లతో గెలవడం గొప్ప విషయమని ఉండవల్లి హర్షం వ్యక్తం చేశారు. పోలవరం విషయంలో సీనియర్‌ ఇంజినీర్లతో సంప్రదింపులు జరపాలని జగన్‌కు ఆయన సూచించారు. జులైలో వచ్చే వరద నుంచి ప్రాజెక్టును కాపాడాలన్నారు.

మనసులోని మాట చెప్పారు!

మనసులో ఉన్న మాట బయటకు చెప్పే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్వబావం జగన్‌లో కన్పించింది. ప్రధాని మోదీని కలిసి బయటకు వచ్చిన వెంటనే జగన్ మనస్సులో మాట బయపెట్టారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. సరైన పద్ధతిలో ప్రతిపక్ష పాత్ర పోషించాలి. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే. మోదీ, కేసీఆర్‌తో సామరస్యంగా ఉంటూ ఏపీకి రావాల్సినవి కేంద్రం నుంచి సాధించాలి. జనసేన వల్ల టీడీపీ పోడిపోయిందనడం సమంజసం కాదు అని ఉండవల్లి తేల్చిచెప్పారు.

నేను విబేధిస్తున్నా.. నాకిష్టం లేదు!

మన అవసరం లేదు కాబట్టి కేంద్రాన్ని అనేకసార్లు కలిసి హోదా తెచ్చుకోవాలన్న వైఎస్ జగన్ మాటలతో విబేధిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వానికి కావాలంటే ఏపీలో ఒక పోర్ట్ ఇవ్వడంలో తప్పులేదు. వైఎస్ కలల ప్రాజెక్ట్ ‘వాన్‌పిక్’ పై జగన్ దృష్టి పెట్టాలి. జగన్ జైలుకు వెళ్లడానికి కారణమైన ‘వాన్‌పిక్’ ప్రాంతంలో వైసీపీ పూర్తి విజయం సాదించింది. మోదీ అధికారంలోకి రావడం నాకు ఇష్టం లేదు. ఓటమిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. వైసీపీలోకి వెళ్లాలన్న ఆసక్తి నాకు లేదు అని ఉండవల్లి స్పష్టం చేశారు.

బోర్డులో పెట్టాలి..!
ప్రభుత్వ కార్యాలయాలు ముందు ఉద్యోగుల జీతాలు నోటీస్ బోర్డులో పెట్టాలి. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చినప్పుడు.. కృష్ణా డెల్టాలో ఎన్ని సీట్లు నెగ్గారో టీడీపీ చెప్పాలి. టీడీపీ వాళ్లు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని ప్రతిపక్ష పాత్ర అయినా సరైన పద్దతిలో పోసించండి. కేంద్రానికి అవసరం ఉంటేనే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తారా..? చట్టం ప్రకారం కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని ఉండవల్లి చెప్పుకొచ్చారు. ఉండవల్లిని వైఎస్ జగన్ చాలా గౌరవిస్తారు. వైఎస్ హయాంలో ఉండవల్లి ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. అయితే కాబోయే ముఖ్యమంత్రి జగన్‌.. ఉండవల్లి ఇచ్చిన సూచనలను ఏ మాత్రం పాటిస్తారో వేచి చూడాల్సిందే మరి.