బాబాయి-అబ్బాయి హోస్టులుగా రియాలిటీ షో...

  • IndiaGlitz, [Sunday,November 15 2020]

హీరోలంతా బుల్లితెర బాట పడుతున్న విషయం తెలిసిందే. అంతా హోస్టులుగా బుల్లితెరపై విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఓ షోకి హోస్ట్‌గా అదరగొట్టేయగా.. హీరో రానా కూడా హోస్ట్‌గా రాణించాడు. అలాగే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్‌బాస్ సీజన్ 1తో హోస్ట్ అంటే ఇలా ఉండాలనిపించేలా హోస్ట్ చేశాడు. నేచురల్ స్టార్‌గా బుల్లితెరపై అదరగొట్టాడు. కాగా.. నాగార్జున రెండు సీజన్లుగా బిగ్‌బాస్‌లో దుమ్ము దులుపుతున్నారు.

తాజాగా ఒక రియాలిటీ షోలో అలరించేందుకు బాబాయ్‌-అబ్బాయి సిద్ధమవుతున్నారు. ఆ బాబాయి, అబ్బాయి ఎవరో కాదు.. విక్టరీ వెంకటేశ్‌, అబ్బాయ్‌ రానా దగ్గుబాటి. వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించే సరికి అభిమానులు కూడా ఆ సినిమా అప్‌డేట్ కోసం బాగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనికంటే ముందు బుల్లితెరకు సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చేసింది. వీరి కాంబినేషన్‌లో ఓ రియాలిటీ షో చేయడానికి ప్రముఖ టీవీ ఛానెల్‌ ప్లాన్‌ చేసిందని టాక్. ఈ రియాలిటీ షో గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా.. రీసెంట్‌గా రానా స్టార్ట్‌ చేసిన యూ ట్యూబ్‌ ఛానెల్‌‌లోనూ వెంకీ, రానా కలిసి ప్రేక్షకులను అలరించనున్నట్టు తెలుస్తోంది. వెంకీ కాంబోలో వచ్చిన మల్టీస్టారర్స్ అన్నీ మంచి విజయం సాధించాయి. ఇప్పుడు రానాతో కలిసి చేయబోయే షో కూడా మంచి సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే హోస్ట్‌గా రానాకు మంచి పేరుంది. వెంకీకి మాత్రం ఇదే తొలిసారి. మరి వెంకీ ఎలా రాణిస్తారో చూడాలి. మొత్తానికి ఇద్దరు స్టార్స్ అది కూడా బాబాయి-అబ్బాయిలు కలిసి హోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.