Download App

Venkatapuram Review

పదేళ్ళ క్రితం వచ్చిన శేఖర్‌ కమ్ముల 'హ్యాపీడేస్‌' చిత్రంలో టైసన్‌గా ప్రేక్షకులను నవ్వించిన రాహుల్‌ తర్వాత అడపా దడపా కొన్ని సినిమాలు చేసినా అనుకున్నంత సక్సెస్‌ కాలేదు. అయితే ఈసారి స్టయిల్‌ మార్చి కాస్తా యాక్షన్‌ స్టయిల్లో సినిమా చేద్దామనుకున్నాడో ఏమో కానీ, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'వెంకటాపురం' సినిమాను స్టార్ట్‌ చేశాడు. సినిమా కోసం ఏకంగా సిక్స్‌ ప్యాక్‌ కూడా చేయడం విశేషం. వెంకటాపురం టీజర్‌, ట్రైలర్‌కు చాలా మంచి స్పందన రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి వెంకటాపురంతో రాహుల్‌కు హిట్‌ వచ్చిందా? ప్రేక్షకులను వెంకటాపురం ఆకట్టుకుందా? అని తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం..

కథ:

వైజాగ్‌ భీమిలి బీచ్‌లో ఓ కాలేజ్‌ అమ్మాయి శవం ఉండటంతో బీచ్‌కు వచ్చే జనాలు పోలీసులకు సమాచారం ఇస్తారు. వెంకటాపురం ఎస్సై(అజయ్‌ఘోష్‌) కేస్‌ టేకప్‌ చేసి విచారణ ప్రారంభిస్తాడు. చనిపోయింది ఛైత్ర(మహిమా మక్వాన్‌) అని పోలీసులకు తెలుస్తుంది. పోలీసులు ఛైత్ర తండ్రి(కాశీ విశ్వనాథ్‌)కు సమాచారం చేరవేస్తారు. హత్య ఎవరు చేశారనే కోణంలో దర్యాప్తు ప్రారంభిస్తారు ఛైత్ర నివసించే అపార్ట్‌మెంట్‌ పెంట్‌హౌస్‌లో ఉండే ఆనంద్‌(రాహుల్‌), ఛైత్రను హత్య చేశాడని పోలీసులు భావిస్తారు. అజయ్‌ఘోష్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళగా అక్కడ ఉన్న ఆనంద్‌, పోలీసులపై హత్యాయత్నం చేశాడని కేసు పెట్టి జైలుకు పంపిస్తారు. జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆనంద్‌ వెంకటాపురం ఎస్సై సహా స్టేషన్‌లోని పోలీసులందరినీ చంపేస్తాడు. దాంతో పోలీసు అధికారులు అసలు వెంకటాపురంలో ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తే షాకింగ్‌ నిజాలు తెలుస్తాయి. ఇంతకు ఆ నిజాలేంటి? అసలు ఆనంద్‌ పోలీసులను ఎందుకు చంపుతాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్లస్‌ పాయింట్స్‌:

- సెకండాఫ్‌
- స్క్రీన్‌ప్లే
- ట్విస్టులు
- సంగీతం
- సినిమాటోగ్ర‌ఫీ

మైనస్‌ పాయింట్స్‌:

- ఫస్టాఫ్‌
- నటీనటుల పనితీరు

విశ్లేషణ:

'వెంకటాపురం' సినిమా సస్పెన్స్‌థ్రిల్లర్‌ అనే కాన్సెప్ట్‌ ప్రారంభమైన సీన్‌ నుండే ప్రేక్షకుడికి అవగతమైపోతుంది. వైజాగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాను సమాజంలో జరిగిన కొన్ని నిజ ఘటనలు అధారంగా చేసుకుని తెరకెక్కించారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ అనగానే ముఖ్యంగా స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కీలక పాత్రలు పోషిస్తాయి. దర్శకుడు స్క్రీన్‌ప్లే రాసుకున్న తీరు చూస్తే ప్రేక్షకుడికి సినిమాలో ఏదో ఉందని చెప్పేలానే కనపడుతుంది కానీ సినిమా ప్రథమార్థం అయ్యే వరకు సాగదీతగా కనపడుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే కేంద్రీకృతమైంది. ఫస్టాఫ్‌ చూసిన ప్రేక్షకుడికి సినిమాలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడనే విషయం కాస్తా అయోమయంగా కనపడుతుంది. ఇక దర్శకుడు వేణు మడికంటి సెకండాఫ్‌లో సీన్స్‌లోని సీక్రెట్‌ను రివీల్‌ చేసుకుంటూ వచ్చిన విధానం బావుంది. సాయి ప్రకాష్‌ సినిమాటోగ్రఫీ పెద్ద ఎఫెక్టివ్‌గా లేదు. ఇక అచ్చు సంగీతంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. ట్యూన్స్ విష‌యానికి వ‌స్తే. ఎగిరే ఎగిరే...అనే పాట, ఏ మాయ.. అనే సాంగ్స్‌ వినడానికి బావున్నాయి. ఎడిటింగ్‌ బావుంది. రాహుల్‌ హ్యాపీడేస్‌ తర్వాత పెద్ద సక్సెస్‌ లేదు. ఈ సినిమాపై పెద్ద ఆశలే పెట్టుకున్నాడు. అయితే నటన పరంగా రాహుల్ బాగానే చేశాడు. రాహుల్ గ‌త చిత్రాల‌తో పోల్చితే రాహుల్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, కొత్త‌గా ఉంటాయి. సినిమాలో కొత్త లుక్‌ కోసం రాహుల్‌సిక్స్‌ ప్యాక్‌ చేయడం బాగా ఉంది. హీరోయిన్‌ ఛైత్ర సంగతి సరేసరి, చిన్న పిల్లలాగా కనపడింది. లుక్‌ పరంగా ఎక్కడా ఆట్టుకోలేదు. చాలా సీన్స్‌ లాజిక్స్‌ లేకుండా కనపడతాయి. హీరోయిన్‌ ఫ్రెండ్స్‌ కాలేజ్‌లో సిగరెట్‌ సీక్రెట్‌గా తాగాలనుకుంటారు అది ఒకే కానీ., సిగరెట్‌ తాగడానికే రోజంతా క్లాసులు ఎగ్గొట్టి సిగరెట్స్‌ తాగుతున్నట్లు చూపించడమేంటో తెలియదు. సీక్రెట్‌గా సిగరెట్స్‌ తాగాలంటే హీరోయిన్‌, ఆమె ఫ్రెండ్స్‌ డేంజర్‌ ఏరియాకు వెళ్ళడమెందుకో అనిపిస్తుంది. ఇప్పుడు సిగరెట్స్‌ను అమ్మాయిలు కూడా బహిరంగంగానే ఊదేస్తున్నారు మరి. అలాగే ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ను హీరో క్లైమాక్స్‌లో నర్స్‌ చూస్తుండగా నరికేస్తాడు. హీరోను ఎన్‌కౌంటర్‌ చేస్తానని వచ్చిన స్పెషల్‌ ఆఫీసర్‌ అజయ్‌, ముగ్గురు విలన్స్‌ను ఎన్‌కౌంటర్‌ చేయడంతోనే సినిమాను ముగించేస్తారు. అంటే పైస్థాయి అధికారులకు విషయం అర్థం కాదా..లేక అర్థం చేసుకోలేరా అనిపిస్తుంది. అజయ్‌ ఘోష్‌ పాత్ర పరంగా తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. కాశీవిశ్వనాథ్‌ పాత్రకు వేరేవరో డబ్బింగ్‌ చెప్పారు. ఆ వాయిస్‌ బాగాలేదు. సినిమాను చుట్టేశారా అనిపించింది.

బోటమ్‌ లైన్‌: వెంకటాపురం.. డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో మెప్పించే  థ్రిల్లర్

Venkatapuram English Version Review‌

Rating : 2.8 / 5.0