అల్లుడితో `వెంకీమామ‌` చిందులు

  • IndiaGlitz, [Saturday,October 05 2019]

విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ 'వెంకీమామ‌'. నిజ‌జీవితంలో మేన‌మామ‌, మేన‌ల్లుడు అయిన వెంకీ, చైతూ... ఈ సినిమా కోసం తెర‌పైనా అవే పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. కె.య‌స్‌.ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో వెంకీకి జోడీగా పాయ‌ల్ రాజ్‌పుత్‌, చైతూకి జంట‌గా రాశీఖ‌న్నా సంద‌డి చేయ‌నున్నారు.

చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్త‌య్యింద‌ని స‌మాచారం. కేవ‌లం ఒక పాట మాత్ర‌మే చిత్రీక‌రించాల్సి ఉంద‌ని... దాన్ని రేప‌టి నుండి (అక్టోబ‌ర్ 6) రామోజీ ఫిల్మ్ సిటీలో పిక్చ‌రైజ్ చేయ‌నున్నార‌ని తెలిసింది. ఈ పాట‌లో మామాఅల్లుళ్ళు వెంకీ, చైతూతో పాటు పాయ‌ల్ రాజ్ పుత్‌, రాశీఖ‌న్నా కూడా పాల్గొంటార‌ని... వెంకీ, చైతూ వేసే చిందులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని ఇన్‌సైడ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్‌.

రైస్ మిల్ ఓన‌ర్‌గా వెంక‌టేశ్‌, ఆర్మీ ఆఫీస‌ర్‌గా చైతూ, స్కూల్ టీచ‌ర్‌గా పాయ‌ల్ రాజ్‌పుత్‌, ఫిల్మ్ మేక‌ర్ గా రాశీఖ‌న్నా న‌టిస్తున్న 'వెంకీమామ‌'కి యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న 'వెంకీమామ‌' విడుద‌ల తేదిపై మ‌రికొద్ది రోజుల్లో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంది.