నాగబాబు వల్ల గెలవలే.. మేం భయపడాలా..!?

  • IndiaGlitz, [Saturday,May 25 2019]

‘మా’ ఎన్నికల్లో నరేశ్ ప్యానెల్ విజయానికి మెగా ఫ్యామిలీ కారణమని.. వాళ్ల సపోర్ట్‌తోనే గెలుపొందారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మెగా కుటుంబం ఎవరికి అండగా వారే ఈజీగా గెలిచేస్తారని అంటుంటారు. ఈ ఎన్నికల్లో నరేశ్ వర్సెస్ శివాజీ ఫ్యానెల్‌కు మధ్య గట్టి పోటీ ఉండగా.. నరేశ్‌కు మెగా సపోర్టు రావడంతో గెలిచారని అందరూ అనుకున్నారు. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియదు.. సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున పుకార్లు వైరల్ అవుతున్నాయి. దీంతో ఎట్టకేలకు రాజశేఖర్ దంపతులు మీడియా ముందుకొచ్చి ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు.

ఒక్క శాతం ఉండొచ్చు అంతే..!

నాగబాబే కారణమంటూ వస్తున్న వార్తలన్నీ తప్పు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) అనేది ఓ చిన్న కుటుంబం. అందులో 500-600 ఓట్లు ఉంటాయి. ‘మా’ ఫ్యామిలీ అంద‌రం ఒకటే. నాగ‌బాబుగారు ఇంటింటికీ వెళ్లి ఓట్లేయ‌మ‌ని చెప్పలేదు. ఆయన ఓట్లేయించారా! కాదు క‌దా.. మేం క‌ష్టప‌డ్డాం. మేం అందరం క్యాంపెయిన్ చేసుకున్నాం. నేను, రాజ‌శేఖ‌ర్‌, నా కూతుర్లు ఇద్దరూ ప్రతి మా మెంబ‌ర్‌కి ఫోన్ చేసి ఓటేయమని అడిగాం. మెంబర్స్ కూడా మేం మంచి చేస్తాం.. చేయ‌గ‌లం అని వాళ్లు న‌మ్మారు కాబ‌ట్టి మాకు న‌మ్మకంతో ఓటేశారు. దీనికి నాగబాబుగారు లాంటోళ్లు కూడా స‌పోర్ట్ చేశారు. నాగ‌బాబులాంటి వాళ్లు వీళ్లలో జెన్యూనిటీ ఉందని ఆలోచించారు. వాళ్లకే స‌పోర్ట్ చేద్దామ‌నుకున్నారు.. అంతే. దాని వ‌ల్ల 1 శాతం మాకు క‌లిసొచ్చి ఉండొచ్చు కానీ.. కేవ‌లం నాగ‌బాబుగారు చెప్పార‌నే ఎవ‌రూ మాకు ఓటేయ‌లేదు. నాగ‌బాబుగారి స‌పోర్ట్ వ‌ల్లనే గెలిచామ‌నేదంతా కూడా సోష‌ల్ మీడియా క్రియేష‌న్ అని జీవిత చెప్పుకొచ్చారు.

ఎవరు ఎవర్ని పోషిస్తున్నారు..?

నాకు అర్థం కానీ విష‌య‌మేమంటే.. అసలు ఎవరు? ఎవ‌రిని పోషిస్తున్నారు? ఎవ‌రి గురించి ఎవ‌రు భ‌య‌ప‌డాలి? మేం ఏం చేయాల‌నేది దాన్ని మీరు (సోష‌ల్ మీడియా) చెప్పడానికి మీరెవ‌రు? అని విమర్శకులను జీవిత ప్రశ్నించారు.

మేం ఎవరికీ వ్యతిరేకం కాదు..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాగబాబుకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం మేం చేయలేదు. భీమవరంలో పవన్- నరసాపురంలో నాగబాబుకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించినట్టు వస్తున్న వార్తలు కరెక్టు కాదు. వైసీపీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ప్రచారం చేశాము. ఏపీలో వైసీపీ సాధించడంపై చాలా సంతోషంగా ఉంది. పది, పదిహేనేళ్ల పాటు జగన్ సీఎంగా ఉంటారు.. ఆయనలో ఆ కసి కనిపిస్తోంది అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.