చిరు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటాం.. ‘సైరా’ రిలీజ్‌ను ఆపేస్తాం’

  • IndiaGlitz, [Monday,September 23 2019]

‘సైరా’ సినిమాపై రాజుకున్న వివాదానికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు కనిపించట్లేదు. సైరా నర్సింహారెడ్డి కథ వాడుకున్నందుకు గాను ఇచ్చిన మాట ప్రకారం తమకు డబ్బులు చెల్లించాలని వారసులు.. ఇచ్చే ప్రసక్తే లేదని చిరు కుటుంబీకులు ఇలా అస్తమాను ఈ వ్యవహారం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారం కోర్టులు, కేసులు దాకా వెళ్లింది. అయితే తాజాగా.. మరోసారి సైరా వారసులు మీడియా ముందుకొచ్చారు. తమకు న్యాయం జరక్కపోతే మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. చిరు, రామ్ చరణ్ తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ నుంచి విలువైన సమాచారం తీసుకొని, తమ ఆస్తులు, స్థలాలు వాడుకొని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్రతో వ్యాపారం చేస్తున్న చరణ్ తమను మోసం చేశారని ఆరోపిస్తున్నారు.

ఇచ్చిన మాట తప్పారు!

సోమవారం సాయంత్రం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు, దక్షిణాది ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి సేవా సమితి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సైరా నరసింహారెడ్డి పేరుతో చిత్రీకరించిన సినిమా కోసం తమ నుంచి సమాచారం తీసుకొని రామ్ చరణ్ ఇప్పుడు మొఖం చాటేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ తమకు ఇచ్చిన మాట తప్పారని.. న్యాయం కోసం పోరాటం చేస్తే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పుకొచ్చారు.

కోర్టుకెళ్తాం..  సినిమా ఆపేస్తాం!

తమకు న్యాయం జరిగే వరకూ సైరా నరసింహారెడ్డి సినిమాను విడుదల చేయొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ‘సైరా’ చిత్రంపై దాఖలు చేసిన పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డ్ మెంబర్స్, చిత్ర హీరో చిరంజీవి, ప్రొడ్యూసర్ రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్, డైరెక్టర్ సురేందర్ రెడ్డిని బాధ్యులుగా చేర్చినట్లు ఉయ్యాలవాడ వారసులు తెలిపారు. అయితే ఈ వ్యవహారం ఇంకా ఎంతవరకు వెళ్తుందో.. సైరా వారసులు ఎన్ని రోజులు పోరాటాలు చేస్తారో..? మెగా ఫ్యామిలీ ఇంకెన్నాళ్లు నోరు మెదుపకుండా ఉంటుందో వేచి చూడాలి మరి. మొత్తానికి చూస్తే ఇలాగే నాన్చుకుంటూ పోతే అసలుకు ఎసరే వచ్చే అవకాశాలు మాత్రం మెండుగానే కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.