close
Choose your channels

మండలి’ రద్దు చేస్తే.. ఈ మంత్రుల సంగతేంటి జగన్..!?

Friday, January 24, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మండలి’ రద్దు చేస్తే.. ఈ మంత్రుల సంగతేంటి జగన్..!?

శాసన మండలి రద్దు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే సోమవారం లేదా మంగళవారం ‘మండలి’ రద్దయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. శాసనసభ బిల్లులు ఆమోదించడం.. పదే పదే మండలిలో ఆ బిల్లులు పాస్ అవ్వకపోవడంతో చేసేదేమీ లేక ఏకంగా మండలినే రద్దు చేయాలని జగన్ నిర్ణయించారు. అయితే ఈ రద్దుకు మాత్రం లెక్కలేనన్ని కారణాలను వైసీపీ మంత్రులు, వైఎస్ జగన్ చెబుతున్నారు. ఒక వేళ ఇదే జరిగితే ఆ ఇద్దరు మంత్రుల పరిస్థితేంటి..? అనేది మాత్రం ప్రశ్నర్థకంగా మారింది.

2019 ఎన్నికల్లో కనివినీ ఎరుగని మెజార్టీ సీట్లు సంపాదించుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 151 సీట్లు వస్తాయని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. ఇన్ని సీట్లు రావడమే షాకింగ్ అయితే.. కనివినీ ఎరుగని రీతిలో కేబినెట్‌ను జగన్ కూర్చారు. ఇదివరకెన్నడూ ఈ రేంజ్‌లో కేబినెట్‌ ఉన్న దాఖలాల్లేవ్. మొదట్నుంచీ వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తానని చెబుతూ వస్తున్న జగన్.. ఆ మాటలు అక్షరాలా కేబినెట్ కూర్పులో నిరూపించుకున్నారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా తనకు.. తన తండ్రి నమ్మినబంటుగా ఉంటూ వస్తున్నవారికి కూడా వైఎస్ జగన్ ప్రాధన్యత ఇవ్వడమే కాకుండా మంత్రి పదవులు కట్టబెట్టారు. వారిలో జగన్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ఒకరు కాగా.. మరొకరు వైఎస్‌కు అత్యంత సన్నిహితుడు పిల్లి సుభాష్ చంద్రబోస్.

మోపిదేవి పరిస్థితేంటి!?
జగన్ ఎదుర్కొంటున్న అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన మోపిదేవి వెంకటరమణ.. దాదాపు ఏడాదిన్నర పాటు జైలులో గడిపిన విషయం తెలిసిందే. అనంతరం జగన్‌తో పాటు బయటికొచ్చిన తర్వాత ఆయన వైసీపీలో చేరి 2014లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. అంతేకాదు.. 2019లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దీంతో వైఎస్ హయాం నుంచి ఈ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్న మోపిదేవికి.. జగన్ మంత్రి పదవి కట్టబెట్టారు. అనంతరం ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే.. ఇప్పుడు శాసన మండలి రద్దు చేస్తే మోపిదేవి పరిస్థితేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

‘పిల్లి’ సంగతేంటో..!?
పిల్లి సుభాష్ చంద్రబోస్ అంటే వైఎస్‌కు అత్యంత ఆప్తుడు అనే పేరుంది.. ఆయన మరణాంతరం కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి జగన్ బాటలో నడిచిన వ్యక్తుల్లో ఈయన కూడా ఉన్నారు. అయితే.. 2004, 2009 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ హయాంలో విజయడంఖా మోగించిన ఆయన.. 2014, 2019 ఎన్నికల్లో మాత్రం రాణించలేకపోయారు. మరీ ముఖ్యంగా 2019 ఎన్నికల్లో మళ్లీ 2014 ఎన్నికల రిజల్ట్ రిపీట్ అవుతాయోమోనని భావించిన వైఎస్ జగన్.. రామచంద్రపురం నుంచి కాకుండా మండపేట నియోజకవర్గం నుంచి పిల్లిని పోటీ చేయించారు. అయితే రామచంద్రాపురంలో వైసీపీ అభ్యర్థి విజయడంఖా మోగించగా.. మండపేటలో మాత్రం మళ్లీ టీడీపీ అభ్యర్థే గెలిచారు. దీంతో పిల్లికి మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అని భావించిన వైఎస్ జగన్.. సీనియర్ నేతగా పైగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవిని కట్టబెట్టారు.

మండలి రద్దయితే..!
అయితే ఇంతవరకూ అంతా ఓకే గానీ.. జగన్ అనుకున్నట్టుగానే ‘మండలి’ని రద్దు చేస్తే వీరిద్దరి పరిస్థేతేంటనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఇప్పటికే నిపుణులు, మంత్రులతో నిశితంగా చర్చించిన తర్వాతే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అవసరమైతే వీరిద్దరికీ నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని భావిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఎవరికి నష్టం!
ఇదిలా ఉంటే.. నిజంగానే మండలి రద్దు చేస్తే మాత్రం టీడీపీకి భారీ నష్టం వాటిల్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే.. మొత్తం 58 మంది ఎమ్మెల్సీల్లో్ టీడీపీకి చెందిన వారు 28 మంది ఉండగా.. వైసీపీ ఎమ్మెల్సీలు 09 మంది మాత్రమే ఉన్నారు. టీడీపీకి ప్రస్తుతం ఎమ్మెల్యేల కంటే ఎమ్మెల్సీల గట్టి బలం.. ఎందుకంటే శాసనసభలో సంఖ్య తక్కవుంది గనుక మండలిలో అయినా సత్తా చాటొచ్చు. ఇదే రద్దు జరిగితే మాత్రం టీడీపీకి ఎదురుదెబ్బే.. మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌కు ఎలాంటి పదవి లేకుండా పోతుంది.!

వాళ్లకిచ్చిన మాట సంగతేంటి జగన్!
వాస్తవానికి మండలి రద్దు అనేది టీడీపీకి ఎంత నష్టం వాటిల్లుతుందో.. అంతే రీతిలో జగన్‌కు కూడా నష్టమే.. ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో టికెట్లు ఇవ్వని చాలా మంది నేతలకు ఎమ్మెల్సీ రూపంలో న్యాయం చేస్తానని మాటిచ్చారు. ఇలా మాటిచ్చిన జాబితాలో చాలా మందే ఉన్నారు. ఇప్పుడు మండలినే రద్దు చేస్తే.. వారందరి పరిస్థితి ఏంటనేది కూడా జగన్ ముందున్న పెద్ద చిక్కు. వారికి వేరే రూపంలో న్యాయం చేయడానికి కూడా లేదు.. ఎందుకంటే నామినేటెడ్ పోస్టుల కోసం చాలా మందే క్యూలో ఉన్నారు. ఇలాంటి క్రమంలో జగన్ నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ చేస్తున్న ఈ చర్యతో ‘పెద్దల్లో వణుకు’ పుడుతోంది.!. మొత్తానికి చూస్తే ఏపీ చరిత్రలో ‘సోమవారం’ కీలకం కాబోతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.