close
Choose your channels

Chandrababu Naidu:'జాబు' ముసుగులో బాబు చేతివాటం.. స్కిల్డ్‌గా అవినీతి, స్కాం వెలుగుచూసిందిలా..?

Sunday, September 10, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రూ.241 కోట్లను చంద్రబాబు కాజేశారన్నది సీఐడీ ఆరోపణ. యువతకు ఎలాంటి ట్రైనింగ్ కార్యక్రమాలు ఇవ్వకుండా చంద్రబాబు ఈ నిధులను కొట్టేశారని సీఐడీ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుతో పాటు అప్పటి ఏపీ విద్యా శాఖ, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన కుమారుడు రవితేజను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అసలేంటీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం:

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ స్కాంకు కేవలం 2 నెలల్లోనే రూపకల్పన చేశారు. సీమెన్స్ అనే కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టి.. యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ఊదరగొట్టారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు రూ.3,356 కోట్లని, ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం అని, మిగతా 90 శాతం ఖర్చును కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద సీమెన్స్‌ భరిస్తుందని చెప్పారు. స్కిల్‌డెవల్‌మెంట్‌ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వానికి నోట్‌ పెట్టించారు. ఈ క్రమంలో సెక్రటరీ , ఆ పై స్థాయి అన్నింటినీ ఓవర్‌రూల్‌ చేస్తూ కేబినెట్లోకి ఈనోట్‌ను తీసుకొచ్చారు. మంత్రి మండలి సమావేశాల్లో దానికి ఓకే చెప్పడం, తర్వాత జీవో విడుదల కావడం... అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి. నిజానికి ఇలా కేబినెట్‌కు నోట్‌ పెట్టడం నియమాలకు, నిబంధలనకు పూర్తిగా విరుద్ధం.

ఆర్ధిక శాఖ వద్దన్నా చంద్రబాబు జోక్యం :

అంతేకాదు.. ఒప్పందానికి, ప్రభుత్వం విడుదల చేసిన జీవోకు ఎలాంటి పొంతన లేదు. సీమెన్స్ నుంచి ఎలాంటి మొత్తం విడుదల కాకముందే ఏపీ ప్రభుత్వం ఐదు విడతల్లో డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లను విడుదల చేసింది. ఈ నిధుల విడుదలకు ఆర్ధిక శాఖ అధికారులు కొర్రీలు పెట్టగా.. స్వయంగా చంద్రబాబు జోక్యం చేసుకుని ఎలాంటి అడ్డంకులు లేకుండా చేశారు. ఇలా విడుదల సొమ్ము 70కి పైగా షెల్ కంపెనీల చేతులు మారి తిరిగి చంద్రబాబు వద్దకే వచ్చింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం వెలుగుచూసిన తక్షణం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నోట్ ఫైల్స్ మాయమయ్యాయి.

జీఎస్టీ అధికారులకు అనుమానం .. వెలుగులోకి స్కాం:

స్కిల్‌ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన పీవీఎస్‌పీ/స్కిల్లర్‌, డిజైన్‌టెక్‌ కంపెనీలు సర్వీస్‌ ట్యాక్స్‌ కట్టకుండా సెన్‌వాట్‌ కోసం క్లెయిమ్‌ చేశాయి. అయితే ఒకేసారి ఇన్ని కోట్ల రూపాయల మేర క్లెయిం చేయడంతో జీఎస్టీ అధికారులకు ఎక్కడో తేడా కొట్టింది. వెంటనే ఆ కంపెనీల లావాదేవీలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే డబ్బులు హవాలా మార్గంలో తరలించినట్టు తేలింది. 2017లోనే మొత్తం వ్యవహారం బయటపడింది. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో వుండటంతో కుంభకోణంపై ఎలాంటి స్పందన లేదు.

టీడీపీ అక్రమాలపై ఫోకస్ పెట్టిన జగన్ :

2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాల గుట్టు విప్పే పని చేపట్టారు. అమరావతి భూ కుంభకోణం, అసైన్డ్ ల్యాండ్స్ వ్యవహారం, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై జగన్ సీరియస్‌గా దృష్టి సారించారు. సుదీర్ఘ విచారణ జరిపి, పక్కా ఆధారాలు సేకరించిన ఏపీ సీఐడీ అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వున్న టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసారు. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీసులను సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు చంద్రబాబుకు అందజేశారు. ఆయనపై 120(బి),166,167, 418, 420, 465, 468, 201,109, రెడ్ విత్ 34 , ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. ఈ కేసులో ఇప్పటికే సీఐడీ, ఈడీ విచారణ జరిపి ఎనిమిది మందిని అరెస్ట్ చేసారు. దీంతోబాటు డిజైన్ టెక్ సంస్థకి చెందిన రూ.31 కోట్లు ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎటాచ్ చేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.