close
Choose your channels

ఏపీలో ఇంత జరుగుతుంటే మౌనమేల జగన్, పవన్!?

Sunday, February 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో ఇంత జరుగుతుంటే మౌనమేల జగన్, పవన్!?

ఎన్నికలు దగ్గరపడుతుంటంతో అప్పుడెప్పుడో ఏపీకి వచ్చి మట్టి, నీళ్లు ఇచ్చి వెళ్లిన ప్రధాని మోదీ ఫిబ్రవరి 10న ఏపీకి రాబోతున్నారు. అయితే మోదీ రాకను అడ్డుకోవాలని.. అవసరమైతే ఆ సభకు జనాలను తరలించకుండా ఆపేందుకు టీడీపీ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయి..? అనేది సభ జరిగితే తెలుస్తుంది. ఇవన్నీ అటుంచితే మోదీ రాకను ఒక్క టీడీపీ నేతలు, కార్యకర్తలే కాదు.. ఏపీ ప్రజలు సైతం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మోదీ ఏపీ రావొద్దు.. గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లతో హోరెత్తిస్తున్నారు. మోదీ సభకు కౌంటర్‌‌గా సోమవారం నాడు సీఎం చంద్రబాబు ఢిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్ష చేయబోతున్నారు. అయితే దీనికి ఎంత సొమ్ము ఖర్చుపెడుతున్నారు..? ఆ సొమ్ము ఎవరిది..? అసలు ఈ దీక్ష అవసరమా..? ఇన్ని రోజులు లేని ఈ ఉలికిపాటు ఇప్పుడెందుకు..? అనే విషయాలు ఇక్కడ అప్రస్తుతం.

టీడీపీతో పాటు ప్రజా సంఘాలు, ప్రజలు పూర్తి స్థాయిలో మోదీ రాకను వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మోదీ రాకను నిరసిస్తూ తెలుగు తమ్ముళ్లు ప్రజలతో కలిసి ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారు. ఏపీలో ఇంత జరుగుతున్నా వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇద్దరూ ఈ వ్యవహారంపై మాట్లాడకపోవడం గమనార్హం. అయితే ఆ ఇద్దరూ మోదీ విషయంలో ఎందుకు నోరు విప్పట్లోదే ఆ పెరుమాళ్లకే ఎరుక.

ఆఖరి నిమిషంలో జగన్ తప్పటడుగులు!?

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే.. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా హోదా తెస్తామంటూ గత నాలుగన్నరేళ్లుగా గట్టిగా పట్టుబట్టారు. చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకున్నా సరే జగన్ మాత్రం ఒప్పుకోకుండా గల్లీ మొదలుకుని ఢిల్లీ వరకు పలుమార్లు ధర్నాలు, నిరసనలు చేపట్టారు. అంతా ఓకే అందరూ హోదాపై జగన్ ఒకే స్టాండ్ ఉన్నారని... అందుకే అదెక్కడ జగన్‌‌కు ప్లస్ అవుతుందేమోనని ఒక్కసారిగా చంద్రబాబు యూటర్న్ తీసుకుని హోదా నినాదమెత్తారు. ఇది ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా జగమెరిగిన సత్యం. అయితే మోదీ ఏపీకి వస్తున్న తరుణంలో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం.. కనీసం నిరసనలు చేపట్టండి.. మోదీ రాకను వ్యతిరేకించండని ఒక్క పిలుపుకూడా జగన్ ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో ఇన్ని రోజులుగా జగన్ పడ్డ శ్రమ అంతా.. ఆఖరి నిమిషంలో ఆయన వేసిన ఈ తప్పటడుగులతో వృథా అయిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు మోదీ-జగన్ కుమ్మక్కయ్యారనే ఆరోపణకు తాజా పరిస్థితి అద్దం పట్టినట్లుగా అనిపిస్తోందని టీడీపీ నేతలు, పలు ప్రజాసంఘాలు కన్నెర్రజేస్తున్నాయి.

పవన్ ఎందుకిలా చేశారో..!?

పవన్ కూడా తన కోస్తా, రాయలసీమ పర్యటనల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ‘ప్రత్యేక హోదా ఇస్తానని తిరుమల వెంకన్న సాక్షిగా చెప్పిన మీరు.. పాచిపోయిన లడ్డూలు’ ఇస్తారా అంటూ అప్పట్లో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు కూడా. ఆ తర్వాత కూడా ఆయన పార్టీ నేతలు పలు డిబేట్లలో టీడీపీ తీరును ఎండగడుతూ వచ్చారు. మరీ ముఖ్యంగా హోదా తానే తెస్తానని.. తనను సీఎం సీటుపై కూర్చోబెడితేనే సాధ్యమవుతుందని ఈ మధ్య పవన్ చెప్పుకుంటున్నారు. అయితే ఇన్ని రోజులు ఇంత చేసిన పవన్.. మోదీ తాజా పర్యటనపై తన స్టాండ్ చెప్పకుండా సైలెంట్‌‌గా ఉండటం గమనార్హం. దీంతో ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు సైతం ఒకింత అసంతృప్తికి లోనయ్యారని తెలుస్తోంది.

ఇన్ని రోజులు పవన్, జగన్ ఇద్దరూ చంద్రబాబు, మోదీ ఇద్దరూ కలిసి ఏపీని మోసం చేశారని ఆరోపించి ఆఖరి నిమిషంలో ఇలా చేయడంతో ఏపీ ప్రజలకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రధాని హోదా ఉన్న వ్యక్తి అనే కాదు.. ఎవ్వరైనా సరే ఒక్క ఏపీలోనే కాదు ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా వెళ్లే హక్కు రాజ్యాంగం అందరికీ ఇచ్చిందని ఇందులో స్టాండ్ చెప్పడమేంటి..? మరీ విడ్డూరంగా అని ఆ ఇద్దరూ భావిస్తున్నారేమో. పోనీ మోదీ సభ తర్వాత అయినా స్పందిస్తారేమో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.