close
Choose your channels

ఒంటేరును టీఆర్ఎస్‌లో‌ చేర్చునేది ఇందుకేనా!

Friday, January 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఒంటేరును టీఆర్ఎస్‌లో‌ చేర్చునేది ఇందుకేనా!

గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్‌‌ను బలంగా ‘ఢీ’కొనే వ్యక్తి.. సీఎం అభ్యర్థి అయినా సరే జంకకుండా పోటీ చేసే ఒకే ఒక్కడు ఒంటేరు ప్రతాప్‌‌రెడ్డి. సంవత్సరం, రెండు సంవత్సరాలు కాదు.. ఏకంగా పదేళ్లపాటు గులాబీ బాస్‌‌తో పోరాడుతూనే ఉన్నారు. అయితే సడన్‌‌గా ఏమైందో ఏమోగానీ టీఆర్ఎస్‌‌లో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇలా పార్టీ మారుతున్నట్లు తెలుసుకున్న ఒంటేరు అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు, కుటుంబీకులు సైతం విస్మయానికి గురయ్యారని సమాచారం. అయితే శత్రువు గూటికే ఒంటేరు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు..? అసలు ఆయన్ను పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచన ఎవరికొచ్చింది..? ఒంటేరుకు భయపడే పార్టీలో చేర్చుకుంటున్నారా..? ఈ మొత్తం ఎపిసోడ్‌‌లో తెరవెనుక ఉండి కీలక పాత్ర పోషించిందెవరు..? అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం.

భయపడ్డారా..? అడ్డు ఉండదని భావించారా..?
కేసీఆర్ జాతీయస్థాయిలో చక్రం తిప్పాలని ‘ఫెడరల్ ఫ్రంట్’ పేరుతో ఢిల్లీకే పరిమితమవుతారని.. ఇక రాష్ట్రాన్ని కేటీఆర్, హరీశ్‌‌ రావే చూస్కుంటారని టాక్ నడుస్తోంది. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాలంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా పోటీచేయాల్సి ఉంది. ఎలాగో కేసీఆర్ ఎంపీగా గెలుస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు.. అయితే ఇక మిగిలిందల్లా గజ్వేల్ నియోజకవర్గం. ఉపఎన్నికలు వస్తే ఒంటేరుకు పోటీగా బరిలోకి దిగేదెవరు..? 2014, 2018 ముందస్తు ఎన్నికల్లో సీఎం అభ్యర్థి అయిన కేసీఆర్‌కే ముచ్చెమటలు పట్టించిన నేత ఒంటేరు. అలాంటిది ఆ నియోజకవర్గంలో కేసీఆర్ కాకుండా ఎవరు నిలబడ్డా ఒంటేరుదే గెలవడం తథ్యమని.. ఇదే జరిగితే ఒంటేరు చరిత్ర సృష్టించినట్లేనని గులాబీ అధిష్టానానికి కాసింత భయం పట్టుకుందట. సీఎం నియోజకవర్గంలోనే గెలవలేకోయారన్న అపకీర్తి మనకెందుకు..? అదేదో ఆయన్నే మన పార్టీలోకి లాగేస్తే పోలా అని కొందరు గజ్వేల్‌‌లోని కీలకనేతలు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్‌‌కు సలహా ఇచ్చారని టాక్. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా ఒంటేరుతో స్థానిక నేతలు చర్చలు జరపడం.. కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడించడం.. నామినేటెడ్ పదవి హామీ ఇవ్వడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయట.

ఆర్థిక సమస్యలే కారణమా..!?
కేసీఆర్‌‌పై గెలవాలని 2014, 2018 ఎన్నికల్లో ఒంటేరు కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో 19వేలకు పైగా కేసీఆర్‌కు మెజార్టీ రావడం, 2018 ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 58వేలకు పైచిలుకు మెజార్టీ రావడంతో అసలేం చేయాలో ఆయనకు దిక్కుతోచలేదు. పైగా ఇకపై కూడా పరిస్థితులు అనుకూలించేలా లేవని ‘డబ్బులకు డబ్బులు పోయే.. నమ్ముకున్న కేడర్‌‌కు కష్టాలొచ్చే’ ఇలా అయితే కష్టమేనని భావించిన ఒంటేరు.. కేసీఆర్ రైట్ హ్యాండ్‌‌ అయిన ఓ నేతతో చర్చించి తన మనసులోని మాటను చెప్పినట్లుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యే ఆయన కుమార్తెల వివాహానికి గాను భారీగానే ఖర్చుపెట్టారని.. ఇలా వరుసగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో టీఆర్ఎస్‌‌లో చేరికకు కారణమయ్యాయని తెలుస్తోంది.

టీఆర్ఎస్ ఇచ్చిన హామీ ఇదే..
రెండు సార్లు ఎన్నికల్లో పోటీచేసి అట్టర్‌ప్లాప్ అయినప్పటికీ ఒంటేరు ఏమాత్రం అధైర్యపడకుండా.. ఎన్ని ఇబ్బందలకు గురిచేసినా ఆఖరికి జైలుకు పంపినా ఎన్నడూ ఆయన కుంగిపోయిన సందర్భాల్లేవ్. రోజురోజుకు పాపులారిటీ.. ప్రజల్లో మంచిపేరు సంపాదించుకుంటూ కీలక నేతగానే ఎదిగారు. నిత్యం కేడర్‌తో టచ్‌లో ఉంటూ వస్తున్నారు. ఇటువంటి సమయంలో టీఆర్ఎస్‌లో చేరితే ఆయనకు ఏ పదవి ఇస్తారనే దానిపై కూడా చర్చ జరిగింది. గజ్వేల్‌ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో పాటు.. ఒంటేరు కుమారుడికి సైతం పార్టీలో గుర్తింపు ఇవ్వాలని కేసీఆర్, కేటీఆర్‌‌ను ఆయన గట్టిగా అడిగినట్లు తెలుస్తోంది. కచ్చితంగా ఒంటేరుకు నామినేటెడ్ పదవి.. ఆయన కుమారుడికి పార్టీలో గుర్తింపు ఇస్తామని కేసీఆర్ స్పష్టమైన ఇచ్చినట్లు సమాచారం. అందుకే ఒంటేరు కాంగ్రెస్‌‌కు టాటా చెప్పేసి కారెక్కుతున్నారని తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు కేసీఆర్ సమక్షంలోనే ఒంటేరు కండువా కండువా కప్పుకోనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.