close
Choose your channels

Wife of Ram Review

Review by IndiaGlitz [ Friday, July 20, 2018 • తెలుగు ]
Wife of Ram Review
Banner:
Manchu Entertainments
Cast:
Lakshmi Manchu, Samrat Reddy, Priyadarshi, Srikanth Iyengar, Aadarsh Balakrishna
Direction:
Vijay Yelakanti
Production:
T.G.Vishwa Prasad, Lakshmi Manchu
Music:
Raghu Dixit

ఏ విష‌యానికైనా తొలి అడుగు ముఖ్యం. అంద‌రూ మాట్లాడ‌వ‌చ్చు. కానీ ఆచ‌రించే వారు కీల‌కం. ల‌క్ష్మీ మంచు ఇప్పుడు ఆచ‌ర‌ణ‌ల దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఓ అమ్మాయిగా, అమ్మాయికి అమ్మ‌గా ఆమెను స‌మాజంలోని ప‌లు ప‌రిస్థితులు క‌ల‌వ‌ర‌పెట్టిన‌ట్టున్నాయి. విజ‌య్ యల‌కంటి క‌థ చెప్ప‌గానే క‌నెక్ట్ అయి సినిమాను నిర్మించారు. స్త్రీ గురించి ఆలోచించి తీసిన సినిమాకు `వైఫ్ ఆఫ్ రామ్‌` అని పేరు పెట్టారు. ఇంత‌కీ మ‌హిళ‌ల కోసం ఏ కోణంలో ఆమె ఈ సినిమా చేశారు?  వైఫ్ ఆఫ్ రామ్‌గా ఆమె చేసిన సినిమా ఎలా ఉంది? ఒక‌సారి చూసేద్దాం..

క‌థ‌:

రామ్ (సామ్రాట్‌) మిడిల్ క్లాస్ భ‌ర్త‌. అత‌ని భార్య దీక్ష (లక్ష్మీ మంచు) ఎన్జీవోలో ప‌నిచేస్తుంది. ఆమె ఫ్రెండ్ స్నేహ చ‌నిపోవ‌డంతో కాస్త మాన‌సికంగా ఆందోళ‌న‌ప‌డుతుంటుంది. ఆరోనెల గ‌ర్భ‌వ‌తికి అది మంచిది కాద‌ని గ్ర‌హించిన భ‌ర్త రిసార్ట్ కి తీసుకెళ్తాడు. అక్క‌డ సూసైడ్ పాయింట్ నుంచి ఇద్ద‌రూ కింద‌ప‌డ‌తారు. వారిని ఓ క్యాబ్ డ్రైవ‌ర్ ఆసుప‌త్రికి తీసుకెళ్తాడు. భ‌ర్త‌ని, క‌డుపులో బిడ్డ‌నూ పోగొట్టుకుంటుంది దీక్ష‌. అయితే ప్ర‌మాద‌వ‌శాత్తూ తాము ప‌డ‌లేద‌నీ, త‌న భ‌ర్త‌ని ఎవ‌రో చంపార‌నీ అంటుంది దీక్ష‌. పోలీస్ స‌త్యం (శ్రీకాంత్ అయ్యంగార్‌) ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోడు. అత‌ను క‌రెప్ట‌డ్‌. అయితే ఆ శాఖ‌లో కొత్త‌గా జాయిన్ అయిన చారి (ప్రియ‌ద‌ర్శి) ప‌ట్టించుకుంటాడు. దీక్ష‌కు ఆలోచ‌న‌ల‌ను పంచుతుంటాడు. మ‌న అనారోగ్యానికి మ‌న‌మే వైద్యం చేసుకోవాల‌నే కాన్సెప్ట్ ని న‌మ్మిన దీక్ష సొంతంగా త‌న భ‌ర్త‌ను చంపిన వారికోసం అన్వేష‌ణ మొద‌లుపెడుతుంది. ఈ క్ర‌మంలో ఆమెకు రాఖీ (ఆద‌ర్శ్‌) పేరు క‌నిపిస్తుంది. అత‌న్ని బ్యాంకాక్ నుంచి ఇండియాకు ర‌ప్పిస్తుంది. ఇంత‌కీ ఆద‌ర్శ్ ఆమె భ‌ర్త రామ్‌ని ఎందుకు చంపాల‌నుకున్నాడు?   వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఉన్న అనుబంధం ఎలాంటిది?  దీక్ష చెప్పిన‌ట్టు రామ్‌ది హత్యా?  ఆత్య హ‌త్యా? మ‌రేదైనానా?  ఇంత‌కీ దీక్ష మంచిదేనా?  త‌న సమ‌స్య‌ల్లో ప‌డి స్నేహ‌ను పూర్తిగా మ‌ర్చిపోగ‌లిగిందా?  వంటివ‌న్నీ సినిమాలో స‌స్పెన్స్ అంశాలు.

ప్ల‌స్ పాయింట్స్:

క‌డుపులో బిడ్డ‌ను, క‌ట్టుకున్న భ‌ర్త‌ను పోగొట్టుకున్న మ‌హిళ ప‌డే ఆవేద‌న వ‌ర్ణ‌నాతీతం. ఆ దృశ్యాల్లో చ‌క్క‌గా న‌టించారు ల‌క్ష్మీ మంచు. అప్ప‌ర్ మిడిల్ క్లాస్ మ‌హిళ‌గా ఆమె వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా బావున్నాయి. శ్రీకాంత్ అయ్యంగార్ క‌రెప్ట‌డ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా చ‌క్క‌గా న‌టించారు. ప్రియ‌ద‌ర్శి ఇందులో కొత్త త‌ర‌హా పాత్ర‌లో చేశారు. ద‌ర్శ‌కుడు కొత్త‌వాడైనా అనుభ‌వం ఉన్న‌ట్టు తెర‌కెక్కించారు. క‌రెంట్ టాపిక్ గురించి చ‌క్క‌టి మ‌లుపుల‌తో చెప్పారు. స్టార్టింగ్‌, ఎండింగ్ సీన్లు, ప్రీ క్లైమాక్స్ బావున్నాయి.

మైన‌స్ పాయింట్లు:

ఇలాంటి క‌థ‌లు మ‌న‌కు కొత్త కాదు. పోలీసుల‌ను త‌ప్పుదారి ప‌ట్టించ‌డం, ఒక కార‌ణం ముసుగులో మ‌రో కార‌ణం కోసం ప్ర‌య‌త్నించ‌డం వంటివి మ‌న‌కు ఇంత‌కు ముందు వ‌చ్చిన సినిమాలే. కావ్యాస్ డైరీ, క‌హానీ వంటి సినిమాల‌ను గుర్తు చేసిందీ సినిమా. సామ్రాట్‌కు పెద్ద గా చెప్పుకోద‌గ్గ పాత్ర కాదు. ఓ అమ్మాయిని రేప్ చేయ‌డం, అందులోనుంచి అంత సులువుగా త‌ప్పించుకోవ‌డం అనేది వాస్త‌వానికి దూరంగా అనిపిస్తుంది. నెరేష‌న్ కూడా స్లోగా సాగుతుంది

విశ్లేష‌ణ‌:

ఆడ పిల్ల‌ల‌పై అఘాయిత్యాలు నానాటికీ పెరుగుతున్న ప‌రిస్థితుల‌ను చూస్తూనే ఉన్నాం. అవి చేసేది కూడా ఒక‌రికి కొడుకు, మ‌రొక‌రికి తండ్రి, ఇంకొకరికి త‌మ్ముడు, మ‌రొక‌రికి భ‌ర్త‌.. ఏదో ఒక సంబంధంతో స‌మాజంలో తిరుగుతున్న‌వారే. అలాంటివారిని మ‌న స్వార్థం కోసం కాపాడుకుంటూ పోతే అడ్డూ అదుపూ ఉండ‌దు. అలాంటి ఆలోచ‌న‌ల‌ను వేళ్ల‌తో స‌హా పెక‌లించాలంటే.. త‌ప్పు చేస్తే క‌ట్టుకున్న ఆలి కూడా క్ష‌మించ‌దు అనే భ‌యం అవ‌త‌లి వ్య‌క్తికి ఉండాలి. త‌న స్వార్థం కోసం కాపాడుకుంటార‌నే చుల‌క‌న భావం ఉండ‌కూడ‌దు. ఈ చిత్రంలో దీక్ష చేసిన ప‌ని అదే. వాంఛ తీర్చుకోవ‌డానికి త‌న‌పై దాడిచేసిన బాబాయ్‌ని, తెలిసిన అమ్మాయి అనే ధ్యాస కూడా లేకుండా అఘాయిత్యానికి పాల్ప‌డిన భ‌ర్త‌ను కూడా శిక్షించింది దీక్ష‌. ఈ త‌ర‌హా సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో కాసింత లోటుపాట్లు ఉండ‌వ‌చ్చు. ఇలాంటి సినిమాల‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగులు లేక‌పోవ‌డంతో జ‌నాక‌ర్ష‌ణ కూడా త‌క్కువే కావ‌చ్చు. అయినా స‌మాజానికి ఏదో చెప్పాల‌ని చేసిన ప్ర‌య‌త్నం మెచ్చుకోద‌గ్గ‌దే. ఇలాంటి సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తే త‌ప్ప‌కుండా స‌మాజంలోని స‌మ‌స్య‌ల‌కు అద్దం ప‌ట్టే సినిమాలు ఇంకా వ‌స్తాయి. కానీ ఈ సినిమా యువ‌త‌ను ఎంత వ‌ర‌కు మెప్పిస్తుందో చూడాలి.

బాట‌మ్ లైన్‌: ల‌క్ష్మీ మంచు 'దీక్ష‌'గా చేసిన ప్ర‌య‌త్నం

Rating: 2.5 / 5.0

Showcase your talent to millions!!

Write about topics that interest you - anything from movies to cricket, gadgets to startups.
SUBMIT ARTICLE