close
Choose your channels

ఫలితాల తర్వాత టీడీపీలో చీలికలు.. నారా వర్సెస్ నందమూరి!?

Tuesday, May 21, 2019 • తెలుగు Comments

అవును.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ చీలికలు తప్పవని.. నారా వర్సెస్ నందమూరిగా పరిస్థితులు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఓ నేత జోస్యం చెప్పారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాధవ్ వ్యాఖ్యలతో టీడీపీలో అసలేం జరుగుతోంది..? అంటూ ఆరా తీస్తున్నారు. రాజకీయ నేత ఎలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు గుప్పిస్తుంటారు పాలిటిక్స్‌లో ఇవన్నీ సహజమే. అయితే ఏకంగా టీడీపీలో చీలికలు.. నారా వర్సెస్ నందమూరి కుటుంబాలు అని పెద్ద పెద్ద మాటలు మాధవ్ మాట్లాడటంతో.. ఏమో గుర్రం ఎగురవచ్చు అన్నట్లుగా విబేధాలు రావొచ్చంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

నారా వర్సెస్ నందమూరి!

మాధవ్ పేల్చిన ఈ కొత్త బాంబుతో.. అవునా.. నిజమేనా..? అని సొంత పార్టీ నేతలు సైతం చర్చించుకుంటున్నారు. టీడీపీ.. నారా పార్టీ, నందమూరి పార్టీగా విడిపోతుందని ఆయన చిలకజోస్యం చెప్పారు. నిజమైన టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు చేయబోతున్నారని.. ఒక వర్గం నారా వారి కోసం.. మరో వర్గం ఎన్టీఆర్‌ కుటుంబానికి అండగా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయాలలో చంద్రబాబు లాంటి దగాకోరు ఎవరూ లేరని మాధవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మండిపడ్డారు. 

బెడిసికొట్టింది!

ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ చంద్రబాబుకు ధన్యవాదాలు తెలపాలని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి మాధవ్ చెప్పుకొచ్చారు. కాగా ఇప్పటికే పలు జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు చేసిన సర్వేలల్లో వైసీపీ మంచి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేలిన విషయం తెలిసిందే. కాగా.. బీజేపీ- వైసీపీ మధ్య స్నేహం ఉందంటూ బాబు చేసిన ప్రచారంతో వైసీపీ లాభపడిందని మాధవ్ అన్నారు. జనసేన ఓట్లు చీలికతో గెలుస్తామని చంద్రబాబు భావించారని.. ఆ వ్యూహం కూడా బెడిసి కొట్టిందని.. చివరికి ప్రజాశాంతి పార్టీతో కూడా కలిసి చంద్రబాబు కుట్రలు చేశారని బీజేపీ ఎమ్మెల్సీ మండిపడ్డారు.

ఇంట గెలవకపోయినా..!

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. ఏపీలో తప్ప అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ జరిగింది. మేం ఇంట(ఏపీలో) గెలవకపోయినా రచ్చ గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తాం. ఇక మళ్లీ మీరే రావాలని చంద్రబాబును బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించడం.. అదంతా ఆయన వ్యక్తిగతమని ఆ మాటలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మాధవ్ స్పష్టం చేశారు.

సైకిల్‌కు పంచరైంది!

ఏపీలో సైకిల్‌కు పంచరయ్యిందని మాధవ్ సెటైర్లు వేశారు. టైర్లలో గాలి లేకపోయినా.. ఏదో ఉన్నట్లుగా పైకి మాత్రం హైప్ క్రియేట్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఇతర రాష్ట్రాల పర్యటన, ఢిల్లీ పర్యటన ఉద్దేశించి మాట్లాడిన మాధవ్.. ఏపీలో స్థానం ఉండదనే.. ఉనికి కోసం చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లో నేతల చుట్టూ తిరుగుతూ జాతీయ రాజకీయాల్లో ఉండాలనే ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకవేళ లగడపాటి చెప్పిన సర్వే నిజమైతే.. బాబు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్లు అంగీకరిస్తారా? అంటూ ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. 

ఒకప్పుడు పెద్ద ఎత్తున పుకార్లు..

టీడీపీలో చీలికలు వస్తాయన్న మాటలు ఎప్పట్నుంచో వినపడుతున్నవే. అంతేకాదు ఒకానొక సందర్భంలో పురందేశ్వరి-జూనియర్ ఎన్టీఆర్ కలిసి టీడీపీని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు సైతం వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై ఇంతవరకూ అటు పురందేశ్వరి గానీ.. జూనియర్ కానీ స్పందించలేదు. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాడనే తాను అనుకుంటున్నానని ఒకవేళ వస్తే మాత్రం తాను సలహాదారుగా ఉంటానని చెప్పిన సంగతి తెలిసిందే. సో.. అప్పుడెప్పుడో హడావుడి అయిన ఈ చీలిక వ్యాఖ్యలను మాధవ్ తన మాటలతో మరోసారి గుర్తు చేశారు. మాధవ్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz