సీమ రెడ్లంతా టీడీపీకి టాటా చెప్పబోతున్నారా.. వాట్ నెక్ట్స్‌!?

  • IndiaGlitz, [Wednesday,June 19 2019]

రాయలసీమలోని టీడీపీకి చెందిన రెడ్లంతా పార్టీకి టాటా చెప్పేసేందుకు సిద్ధమవుతున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే అటు బీజేపీలోకి కొందరు.. ఇటు వైసీపీలోకి కొందరు రాజకీయ ఉద్ధండులు, ప్రముఖులు జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారా..? అతి త్వరలోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ ఆ రెడ్లు ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నారు..? వాళ్లకొచ్చిన కష్టం ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

రాయలసీమ అంటేనే రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది. రెడ్లు ఎక్కువగా ఉండే పార్టీల్లో మొదటి స్థానంలో వైసీపీ.. రెండవ స్థానంలో టీడీపీ ఉంది. అయితే ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీకి చెందిన రెడ్లు ఆనందంలో మునిగి తేలుతుండగా.. టీడీపీకి చెందిన రెడ్లు ఏం చేద్ధాం..? వాట్ నెక్స్ట్..? అంటూ ఆందోళనలో ఉన్నారు. మరీ ముఖ్యంగా రాయలసీమలోని మొత్తం 52 నఅసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి 20 మంది రెడ్లు పోటీచేయగా.. ఒక్కటంటే ఒక్క స్థానం నుంచి కూడా గెలవకపోవడం గమనార్హం. అంతేకాదు.. మొత్తం 8 పార్లమెంట్ స్థానాల నుంచి టీడీపీకి సంబంధించిన రెడ్లు పోటీ చేయగా.. అది కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసుకుంది.

ఈ ఎన్నికల ఫలితాల అనంతరం కొందరు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధపడగా.. మరికొందరు నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఎప్పుడెప్పుడు సీఎం వైఎస్ జగన్ డోర్లు తెరుస్తారా..? అని టీడీపీ తమ్ముళ్లు వేయి కళ్లతో వేచి చూస్తున్నారట. ముఖ్యంగా కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన టీడీపీ రెడ్లు.. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో టచ్‌లోకి వెళ్తున్నారట. ‘అన్నా.. మమ్మల్ని జగన్ సార్‌తో ఒకసారి కలిపించి కండువా కప్పించే బాధ్యత మీదే’ అని చెబుతున్నారట.

అయితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలే వైసీపీకి టచ్‌లో ఉన్నారని అసెంబ్లీ వేదిగా జగన్.. మీడియా సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అంతేకాదు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన నేతలు తిరిగి వైసీపీలోకి వెళ్లేందుకు మొహమెక్కక బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. ఫైనల్‌గా ఎంత మంది తెలుగు తమ్ముళ్లు టీడీపీకి టాటా చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారో.. కమలం కండువా ఎంతమంది కప్పుకుంటారో తెలియాంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.