close
Choose your channels

సీన్ రివర్స్.. టీడీపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే!

Monday, January 4, 2021 • తెలుగు Comments

సీన్ రివర్స్.. టీడీపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే!

టైటిల్ చూడగానే.. ఇదేంటి సీన్ అంతా రివర్స్‌గా ఉందని ఆశ్చర్యపోతున్నారు కదూ.. అవును మీరు వింటున్నది నిజమే. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు నుంచి వైసీపీలోకి టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి భారీగా చేరికలు జరిగాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులను జగన్ సమక్షంలో వైసీపీలో చేర్చి మద్దతిస్తూ వస్తున్నారు. త్వరలోనే భారీగానే చేరికలు ఉంటాయని.. టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని వైసీపీ కీలక నేతలు చెబుతూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో సీన్ మొత్తం రివర్స్ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇదీ అసలు కథ..

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు టీడీపీలో చేర‌నున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టీడీపీ నుంచే రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన డేవిడ్ రాజు.. 1999లోనే సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు జడ్పీ చైర్మన్‌గా కూడా ఆయన పనిచేశారు. 2009లో టీడీపీ తరఫున మళ్లీ పోటీ చేసిన డేవిడ్.. ప్రస్తుత మంత్రి ఆదిమూలపు సరేష్ చేతిలో 13,194 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత నాటి వైసీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్‌ను పక్కనపెట్టిన జగన్.. డేవిడ్‌కు టికెట్ ఇచ్చారు. టీడీపీ అభ్యర్థి అజితారావ్‌పై 19,071 ఓట్ల మెజార్టీతో డేవిడ్ రాజు గెలుపొందారు.

అటు ఇటు తిరుగుడే..!

అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండటంతో ఎక్కువ రోజులు వైసీపీలో ఉండలేక మళ్లీ ఆయన సొంతగూటికి వెళ్లిపోయారు. అయితే 2019లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ టీడీపీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన డేవిడ్ రాజు మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్‌కే టికెట్ ఇచ్చింది. టీడీపీ అభ్యర్థిపై సురేష్ 31,632 భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. అంతేకాదు ఆయనకు రిజర్వేషన్ కేటగిరిలో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఒకప్పటి విరోధి.. డేవిడ్ ఇద్దరూ వైసీపీలో ఉండటంతో ఈయన్ను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.

సీన్ రివర్స్.. టీడీపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే!

సీన్ రివర్స్ ఇక్కడే..!

వైసీపీ అధికారంలోకి రావడంతో ఏదో ఒక నామినేటెడ్ పదవిని పట్టేందుకు చాలా మంది పార్టీ నేతలు కలిశారట. అయితే ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోయారట. చేతిలో ఒక పదవి ఉంటే దాన్ని పట్టుకుని పర్యటిద్దామని డేవిడ్ రాజు అనుకున్నారట. ఆయన ఇలా అనుకుంటే వైసీపీ నేతలు మాత్రం మరోలా అనుకుంటున్నారట. వైసీపీలో ఆయన్ను పట్టించుకునే నాథుడే లేడంట. దీంతో పేరుకే అధికార పార్టీలో ఉన్నా.. చేతిలో మాత్రం పవర్ లేదనే అసంతృప్తి ఆయనలో పెరిగిపోయిందట. ఏడాదిన్నరగా తీవ్ర అసంతృప్తికి లోనవుతున్న ఆయన.. ఇటీవల తన పాత, కొత్త కార్యకర్తలు, ఆత్మీయులతో సమావేశమై వైసీపీలో ఉండాలా..? మళ్లీ టీడీపీలో ఉండాలా..? అని అడగారట. కార్యకర్తలు మాత్రం టీడీపీలోకి వెళ్లమని.. అక్కడైతే కచ్చితంగా సముచితస్థానం కలిపిస్తారని చెప్పారట. ఇటీవల మీడియాతో మాట్లాడిన డేవిడ్ రాజు.. ఇప్పటి వ‌ర‌కూ తాను ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ను క‌లిసిన సంద‌ర్భం లేదని అయితే.. ప‌దవులు శాశ్వతం, ముఖ్యం కాదు.. కానీ, గౌర‌వం అనేది చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన.. తనను క‌లిసేందుకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేద‌ని మాజీ తీవ్ర మ‌న‌స్తాపంతో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

వెళ్తారా.. ఉంటారా..!?

ఈ క్రమంలో టీడీపీలో వెళ్లేందుకు బాటలు వేయాలని అనుచరులకు సూచించారట. ఆయన ప్రవర్తనను.. సంప్రదింపులను పూర్తిగా కనుగొన్న వైసీపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. ఇదే విషయమై జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అడగ్గా.. అవునా డేవిడ్ రాజు వైసీపీలో ఉన్నాడా..? అన్నట్లుగా మీడియా ప్రతినిధులనే ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు డేవిడ్ రాజుకు పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్నాయట. ప్రస్తుతం ఎర్రగొండపాలెంలో టీడీపీ ఇంచార్జ్ ఎవరూ లేరు..? అందుకే టీడీపీలో చేరి ఆ బాధ్యతలు చేపట్టాలని రాజు లెక్కలు వేసుకుంటున్నారట. రెండుసార్లు టీడీపీని వీడి వెళ్లిన డేవిడ్ రాజుకు చంద్రబాబు వెల్‌కమ్ చెబుతారా..? లేకుంటే నో చెబుతారా అన్నది తెలియాల్సి ఉంది.

Get Breaking News Alerts From IndiaGlitz