YSRCP: ఏపీలో వైసీపీ సునామీ ఖాయం.. ప్రముఖ జాతీయ సర్వేలో స్పష్టం..

  • IndiaGlitz, [Friday,April 05 2024]

ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అయితే చాలా సంస్థలు చేసిన సర్వేల్లో అధికార వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెబుతున్నాయి. తాజాగా మరో సర్వేలోనూ వైసీపీ ప్రభంజనం కొనసాగనుందని తేలింది.

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్‌నౌ-ఈటీజీ రీసెర్చ్ సర్వే తన ఒపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీనే అత్యధిక స్థానాలను దక్కించుకుంటుందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 21-22 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఇక టీడీపీ కూటమికి 3-4 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఏపీలో వైసీపీ హవా మరోసారి కొనసాగనుందని స్పష్టంచేసింది.

అటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీకి 8-10 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. బీజేపీకి 4-6 ఎంపీ స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 1-3 ఎంపీ స్థానాలు దక్కుతాయని చెప్పుకొచ్చింది. అటు కర్ణాటకలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి 21-23 సీట్లు, కాంగ్రెస్ పార్టీ కేవలం 4-6 స్థానాలకు పరిమితం కావచ్చంది. ఇక జేడీఎస్ 1-2 లోక్‌సభ స్థానాలు గెల్చుకోవచ్చని అభిప్రాయపడింది.

ఇక 39 లోక్‌సభ స్థానాలున్న తమిళనాడులో అధికార డీఎంకే 21-22 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 5-7 సీట్లు గెల్చుకోవచ్చని వెల్లడైంది. గత ఎన్నికల్లో ఖాతా తెరవని బీజేపీ ఈసారి అనూహ్యంగా 2-6 స్థానాలు సాధించవచ్చని పేర్కొంది. ఏఐఏడీఎంకేకు 1-3 స్థానాలు లభించనున్నాయని.. ఇతరులు మరో 4-5 స్థానాలు గెలవవచ్చని చెప్పుకొచ్చింది. అలాగే కేరళలో కాంగ్రెస్ పార్టీ 8-10 స్థానాలు, సీపీఎం 6-8 సీట్లు, ఐయూఎంఎల్ 1-2 స్థానాలు గెలిచే పరిస్థితులున్నాయని అంచనా వేసింది. ఇతరులు మరో 1-2 స్థానాలు సాధించవచ్చని వెల్లడించింది.

మొత్తంగా చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి కంటే ఇండియా కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని టైమ్స్‌నౌ సర్వే వివరించింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడతలుగా దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ, తెలంగాణలో నాలుగో విడతలో భాగంగా మే 13న పోలింగ్ జరగనుంది. మొత్తం ఏడు విడతల ఫలితాలను జూన్ 4న ప్రకటించనున్నారు.