కర్ణాటక కింగ్ ‘యెడ్డీ’నే.. ఇలా జరిగిందేంటి కుమారా!?

  • IndiaGlitz, [Monday,December 09 2019]

కర్ణాటక ఉప ఎన్నికల్లో కమలం వికసించింది. ఈ ఎన్నికల్లో ఏం జరుగుగుతుందో ఏమో..? మేజిక్‌ ఫిగర్‌ను సీఎం యెడ్డీ నిలబెట్టుకుంటారా.. లేదా? అని కన్నడనాట కమలనాథులు మొదలుకుని ఢిల్లీలోని బీజేపీ పెద్దలు అందరిలోనూ ఇవే అనుమానాలు. అయితే ఆ అనుమానాలన్నీ డిసెంబర్-09వ తారీఖుతో పటాపంచ్‌లయ్యాయి. సోమవారం వచ్చిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. మొత్తం 15 స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించగా.. 12 స్థానాల్లో కాషాయ జెండా ఎగిరింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం కాగా.. ఓ స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.

ఇలా జరిగిందేంటి కుమారా..!?
అయితే.. జేడీఎస్ మాత్రం సింగిల్ సీటును కూడా సాధించలేకపోవడం గమనార్హం. తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయిన జేడీఎస్.. స్వతంత్ర అభ్యర్థిని మాత్రం అతి కష్టమ్మీద గట్టెక్కారు. యడియూరప్ప సొంత జిల్లా మండ్యలో బీజేపీ తొలిసారి అసెంబ్లీ సీటును గెలుపొందడం విశషమని చెప్పుకోవచ్చు. ఒక్కలిగ సామాజిక వర్గానికి కంచుకోట లాంటి మండ్య జిల్లాలో బీజేపీ గెలవడాన్ని బట్టి కమలం పార్టీ ఏ రేంజ్‌లో సత్తా చాటిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి చూస్తే.. కన్నడనాట కాషాయ జెండా ఎగరడంతో యెడ్డీ మళ్లీ ‘కింగ్’ అయ్యారు!. అయితే కుమారన్న పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో కర్ణాటక కింగ్ ‘యెడ్డీ’నే.. ఇలా జరిగిందేంటి కుమారా అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.

సిద్ధా రాజీనామా..!
ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో చిత్తుగా ఓడటంతో సీఎల్పీ లీడర్ పదవికి మాజీ సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపినట్లు మీడియాకు వెల్లడించారు. ఉపఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి దినేశ్ గుండూరావ్ కూడా రాజీనామా చేశారు. ఉప ఎన్నికల పూర్తి బాధ్యత నాపై ఉంచారన్న దినేశ్.. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. రాజీనామా చేస్తున్నానన్నారు.

సంబరాల్లో బీజేపీ..!
కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాజీనామా చేసే పనిలో ఉండగా.. మరోవైపు జేడీఎస్ మాత్రం హతవిధీ ఇలా జరిగిందేంటి..? అని ఆలోచనలో పడింది. ఇదిలా ఉంటే.. కర్ణాటక0లో బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా యెడ్డీ మీడియాతో మాట్లాడుతూ.. ఫలితాలపై తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. ప్రజలు చాలా మంచి తీర్పు ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు సుస్థిర ప్రభుత్వం కోసం, తన పరిపాలన తీరును చూసి ఓట్లు వేశారని.. ఇక ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా ప్రజానుకూలంగా, సుస్థిర ప్రభుత్వాన్ని అందజేస్తామని ఈ సందర్భంగా యెడ్డీ హామీ ఇచ్చారు.