ఎవరిపైనా మాకు కక్ష లేదు.. ఆకస్మిక తనిఖీలుంటాయ్!

  • IndiaGlitz, [Tuesday,July 02 2019]

కాంట్రాక్టర్లను వేధించడం తమ ఉద్దేశం కాదని, ఎవరిపైనా మా ప్రభుత్వానికి కక్ష లేదని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నాడు గృహనిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులకు సంబధిత మంత్రికి జగన్ సలహాలు సూచనలు చేశారు. ముఖ్యంగా పట్టణ గృహ నిర్మాణ (అర్బన్ హౌసింగ్) ప్రాజెక్టులపై అదే టెక్నాలజీ, స్పెసిఫికేషన్స్‌తో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అధిక ప్రచారం చేయడం ద్వారా ఎక్కువ మంది రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనేలా చూడాలన్నారు.

అంతా రివర్సే..!

ఎక్కువ మంది రివర్స్ టెండరింగ్ లో పాల్గొనేందుకు ఎలిజిబులిటీ క్రైటీరియాను తగ్గిద్దాం. పునాది స్థాయి దాటని, శాంక్షన్ అయినా ప్రారంభం కాని ప్లాట్ల విషయంలో ఏ టెక్నాలజీ అయినా అనుమతించాలని అనుకుంటున్నాము. ఈ నిర్ణయాల వల్ల ఎంత ఆదా చేయగలమో అంత చేయండి. నిర్మాణాల నాణ్యత, సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దు. ప్రస్తుతం నడుస్తున్న ఇళ్ల నిర్మాణంలో అత్యవసరంగా పూర్తి చేయాల్సిన వాటిని గుర్తించాలిఅని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

వచ్చే ఏడాది నుంచే ఇళ్లు..!

ఏపీలో సొంతిల్లు లేని వారెవరూ ఉండకూడదు. సొంతిల్లు పొందే క్రమంలో లబ్ధిదారుడు ఎక్కడా ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఈ ఏడాది శాచ్యురేషన్ విధానంలో ప్రతి గ్రామంలో లబ్ధిదారులందరికీ 1.5 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు అందజేస్తాము. వచ్చే ఏడాది నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం. ఉగాది రోజున ఇళ్ల స్థలాలు, పట్టాల పంపిణీ కార్యక్రమం అన్ని జిల్లాల్లో ఘనంగా చేపట్టాలి అని అధికారులను వైఎస్ జగన్ ఆదేశించారు.

ఆకస్మిక తనిఖీలుంటాయ్!

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం జరిగిన ‘స్పందన’ కార్యక్రమంపై జగన్‌ సమీక్ష నిర్వహించారు. మంగళవారం నాడు కలెక్టర్లు, ఎస్సీలతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజలు ఇస్తున్న వినతిపత్రాలకు రశీదులు ఇవ్వాలని.. సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జగన్ ఆదేశించారు. రశీదుల మీదే పలానా తేదీలోగా సమస్య పరిష్కరిస్తామని రాసి ఇవ్వాలని సలహాలిచ్చారు. అంతేకాదు ఆ రశీదును అక్కడితో మరిచిపోకుండా వెంటనే కంప్యూటరైజ్‌ చేసి డేటాబేస్‌లో ఉంచాలని జగన్ సూచించారు. ఇచ్చిన టైం ప్రకారం సమస్యలను పరిష్కరిస్తున్నారో? లేదో కలెక్టర్లు, ఎస్సీలు పర్యవేక్షించాలని సూచించారు. తాను కూడా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని.. ఎక్కడా లోటుపాట్లు ఉండకూడదని.. తేడాలొస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని ఉన్నతాధికారులకు వైఎస్ జగన్ తేల్చిచెప్పారు.