close
Choose your channels

చరిత్ర సృష్టించిన వైఎస్ జగన్..

Wednesday, January 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చరిత్ర సృష్టించిన వైఎస్ జగన్..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం స్వతహాగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అనే ఒక కొత్తపార్టీని (వైఎస్సార్సీపీ) స్థాపించి మొదటి ఎన్నికల్లోనే ప్రభంజనం సృష్టించిన ‘ఒకే ఒక్కడు’ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. నాటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ జనం మధ్యే ఉంటూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క శాతం ఓటింగ్‌‌తో సీఎం పీఠాన్ని కోల్పోయిన ఆయన.. 2019 ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలని చిన్నపాటి చాన్స్‌‌ను కూడా సువర్ణావకాశంగా వాడుకుంటూ జనాల్లోకి వెళ్లారు.

ఒకానొక సమయంలో ఏ పాదయాత్ర అయితే తన తండ్రికి సీఎం పదవి తెచ్చిపెట్టిందో.. అదే మార్గాన్ని ఎంచుకున్న వైఎస్ జగన్ 2017 నవంబర్ 06 నుంచి వైఎస్సార్ స్మృతి వనం ఉన్న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆ పాదయాత్ర నేటితో అనగా జనవరి 09 2019తో శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురంతో యాత్ర ముగియనుంది. సుమారు 341 రోజులు జగన్ పాదయాత్రతో జనంతో మమేకమవుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు అడుగేశారు. ఇలా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు పాదయాత్రను పూరించారు జగన్. కాగా ఇవాళ్టితో జగన్ 3,648 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకూ జగన్ జీవితంలో జరిగిన సంఘటనలపై www.indiaglitz.com ప్రత్యేక కథనం.

ఎవరెన్ని కుట్రలు పన్నినా...
ఇలా ఒకే కుటుంబంలో ముగ్గురు పాదయాత్ర చేయడం బహుశా ప్రపంచంలోని మొట్టమొదటి సారి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. తండ్రి మరణాంతరం తెలుగు రాష్ట్రాల పర్యటించి తన తండ్రి మరణవార్త విని హఠాన్మరణం చెందిన కుటుంబాలను ఓదార్చాలని అప్పట్లో కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్న సోనియా గాంధీని.. వైఎస్ కుటుంబం అడగ్గా కుదరదనడం దీంతో పార్టీపై తిరుగుబావుటా చేయడం.. సొంత పార్టీని జగన్ స్థాపించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అనంతరం ‘ఓదార్పు యాత్ర’ చేపట్టడం.. ఆపై జగన్‌పై కక్ష్యగట్టి కొన్ని దుష్టశక్తులు ‘లక్ష కోట్లు.. లక్ష కోట్లు’ అని పెద్దఎత్తున పుకార్లు రేపడం అవినీతికి పాల్పడ్డాడని కేసులు పెట్టడం ఆయన జైలుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత జరిగిన.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసే ఉంటాయి.. ఇక్కడ అవన్నీ అప్రస్తుతం కూడా.

చరిత్ర సృష్టించిన జగన్..
2003 వేసవికాలంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో వైఎస్సార్ పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించారు. ఆ పాదయాత్రకు ఫలితం ఆ మరసటి ఏడాది జరిగిన ఫలితాల్లో నెగ్గి సీఎం పీఠం కైవసం చేసుకోగలిగారు. అప్పట్లో ప్రజల కోసం మంచి పథకాలు, సంక్షమ కార్యక్రమాలు చేపట్టిన వైఎస్‌‌కు వరుసగారెండోసారి సీఎం పీఠాన్ని అప్పజెప్పారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. సెప్టెంబర్ 2, 2009 న చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరిన ఆయన.. కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు - వెలుగోడుకు సమీపంలోని నల్లమల అడవుల్లో హెలికాఫ్టర్ ప్రమాదంలో తుదిశ్వాస విడిచారు. ఆ తర్వాత జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడం.. మళ్లీ అదే కుటుంబం నుంచి షర్మిళ పాదయాత్ర.. 2017 చివరి నుంచి ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు యాత్ర చేశారు. కాగా ఇలా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పాదయాత్రలు చేసినట్లు ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా చేయలేదు. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ కుటుంబంది చరిత్రే అని చెప్పుకోక తప్పదు. తండ్రి రికార్డును ఆయన కుమార్తె బ్రేక్ చేస్తే వారిద్దరి రికార్డును బ్రేక్ చేస్తూ.. ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేయడం జగన్‌కే సాధ్యమైంది. అలా జగన్ రికార్డు సృష్టించుకున్నారని వైసీపీ శ్రేణులు, వైఎస్ కుటుంబ అభిమానులు చెప్పుకుంటున్నారు.

జగన్‌ అనే నేను..!
మొత్తం 134 నియోజకవర్గాలలో పర్యటించిన జగన్.. 124 బహిరంగ సభలలో ప్రసంగించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు.. తాను అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలు, పథకాల గురించి మాట్లాడారు. పాదయాత్ర మొదలుకుని బహిరంగ సభల వరకూ ప్రతిచోటా ఎక్కడ చూసినా జనాలే. బహుశా తన పాదయాత్రకు ఈ రేంజ్‌‌లో రెస్పాన్స్ వస్తుందని జగన్ కలలో కూడా ఊహించి వుండరేమో. మరీ ముఖ్యంగా ఒక సభ బాగా జరిగింది మరొకటి బాగా జరగలేదనడానికి లేదు.. దేనికదే సాటి. ప్రతీ సభా ఒక ప్రత్యేకతను చాటిందనే చెప్పుకోవాలి. ఒక్కో బహిరంగ సభలో సుమారు గంటకుపైగా జగన్ ప్రసంగాలు చేసిన రోజులున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆయన.. ‘జగన్ అనే నేను’ అని చేసిన ప్రసంగం వైఎస్ అభిమానులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, నేతలను ఎంతగానో ఆకట్టుకుంది.

గోదావరి జిల్లాలూ జగన్‌కే జై కొట్టాయి..!
ఏపీ రాజకీయాలను శాసించే ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్ పార్టీకి పెద్దగా పట్టులేదని.. గత ఎన్నికల్లో గట్టిగా దెబ్బేసింది ఈ రెండేనని విశ్లేషకులు చెబుతుంటారు. జగన్‌‌కు ఓటేయడానికే ఇష్టపడని తూ.గో, ప.గో జిల్లాల ప్రజలు ఇక ఆయన పాదయాత్రను ఏ మాత్రం ఆదరిస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఆయన జిల్లాల్లో అడుగుపెట్టిన రోజు నుంచి నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని వెళ్లే రోజు వరకు ఇసుకేస్తే రాలనంతగా జనం వచ్చారు. బహుశా ఈ రెండు జిల్లాల్లో జగన్‌‌కు ఈ రేంజ్‌‌లో జై కొడతారని ఎవరూ ఊహించలేదు. కట్టలు తెగిన నదీ ప్రవాహం మాదిరి జనం పోటెత్తేవారు. మేడలు, మిద్దెలు, చెట్టు చేమలు జనంతో నిండిపోయిన సందర్భాలు కోకొల్లలు. మరీ ముఖ్యంగా సభ ముగింపు తర్వాత ఆయా ప్రాంగణాలన్నీ తెగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన చొక్కాలు, చిందరవందరగా కాగితాలు, బెలూన్లతో నిండిపోయేవి.!. ఇవన్నీ అటుంచితే మండుటెండల్లో ఆయన వెంట జనం నడవడం.. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జగన్ ప్రసంగాన్ని విన్న సందర్భాలు జగన్ పాదయాత్రలో ఉన్నాయి. అయితే గోదావరి జిల్లాల్లో కాపు రిజర్వేషన్, పోలవరం ముంపు బాధితులకు న్యాయం చేయలేకపోవడం, ఆక్వా, ఇసుక దోపిడి, కాల్ మనీ సెక్స్ రాకెట్‌‌తో పలు విషయాల్లో టీడీపీ సర్కార్‌‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని.. దీన్ని జగన్ తనకొచ్చిన సువర్ణావకాశంగా మార్చుకున్న ఆయన.. ఈ రెండు జిల్లాల్లో ఆచి తూచి అడుగులేశారనే చెప్పుకోవచ్చు .

యాత్రలో కోడికత్తితో దాడి జరిగినా..!
వైసీపీ అధినేత చేపట్టిన పాదయాత్రలో రాయలసీమతో పాటు కోస్తా ఆంధ్రాలో దాదాపు అన్ని జిల్లాల్లో సాఫీగా జరిగింది. అయితే అక్టోబర్ 25న పాదయాత్ర ముగించుకుని విశాఖ ఎయిర్‌‌పోర్టు నుంచి హైదరాబాద్‌‌కు రావాలని వేచి చూస్తుండగా సెల్ఫీ కోసం అని వచ్చి శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో ఆయనపై దాడికి దిగాడు. అయితే త్రుటిలో తప్పించుకున్న జగన్‌‌ ఎడమచేతికి గాయమైంది. ఎయిర్‌పోర్టు ఆస్పత్రిలోనే ప్రథమ చికిత్స చేయించుకున్న జగన్‌‌‌ అనంతరం హైదరాబాద్‌‌కు వచ్చి ఆస్పత్రిలో చేరారు. కాగా ఆ దాడి చేసిందెవరు..? ఎవరు చేయించారు..? అసలు ఈ వ్యవహారం వెనుక ఉన్నదెవరు..? అనేది పెరుమాళ్లకే ఎరుక. ఈ దాడి జగనే చేయించుకున్నాడని.. సీఎం పీఠంపై కన్నేసిన ఆయన ఇలా సింపతీ కోసం చేయించుకున్నాడని అధికార పార్టీ నేతలు.. ఆఖరికి సీఎం చంద్రబాబు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ఈ కేసును మొదట ఏపీ పోలీసులే దర్యాప్తు చేసి నిజానిజాలను నిగ్గు తేల్చడంలో విఫలమయ్యారని కేంద్రానికి వైసీపీ లేఖ రాయడం ఆ తర్వాత తీవ్ర నాటకీయ పరిణామాల మధ్య ఆ కేసు ఎన్ఐఏ చేతుల్లోకి రావడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. కాగా ప్రస్తుతం ఎన్ఐఏ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తోంది. అయితే దాడి జరిగినప్పటికీ ఏ మాత్రం భయపడకుండా కొద్దిరోజుల విరామం అనంతరం యథావిథిగా మళ్లీ పాదయాత్రను కొనసాగించారు జగన్.

నేటితో పాదయాత్ర ముగింపు..
జగన్‌‌పై అనంతరం మూడు నెలలపాటు జగన్ చేసిన పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఇప్పటికే వైసీపీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. వైసీపీకి చెందిన అగ్రనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఇతర ముఖ్యనేతలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఇచ్ఛాపురం చేరుకుంటున్నారు. పలు ప్రాంతాల నుంచి సొంత వాహనాలు, బస్సులు, రైళ్లలో తరలివచ్చారు. ముగింపు కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ప్రైవేట్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఫైలాన్ గురించి మూడు ముక్కల్లో..
సిక్కోలుకు 130 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటైన ఈ పైలాన్‌ అందరి దష్టినీ ఆకర్షిస్తోంది. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సమాధి ఇప్పటికే దర్శనీయ స్థలంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వైఎస్‌ జగన్‌ విజయసంకల్ప స్థూపం కూడా అదే స్థాయిలో చరిత్రలో నిలవబోతోందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 91 అడుగుల ఎత్తైన ఈ స్థూపాన్ని ఆవిష్కరిస్తారు. స్థూపం పైభాగాన పార్లమెంటు తరహాలో వృత్తాకారంలో వైసీపీ జెండా రంగులతో కూడిన టూంబ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. టూంబ్‌కు దిగువున నాలుగు దిక్కుల దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వివిధ భంగిమల్లో ఉన్న ఫోటోలు.. ఆ దిగువన పాదయాత్రికుడు వైఎస్‌ జగన్‌ నడిచి వస్తున్న చిత్రాలను ఉంచారు. పైలాన్‌ లోపలి భాగంలో చుట్టూ జగన్‌ తన పాదయాత్రలో ప్రజలను కలుసుకుంటూ వచ్చిన ఫొటోలను ఏర్పాటు చేయడం జరిగింది. స్థూపం బేస్‌మెంట్‌ పైకి ఎక్కేందుకు 13 మెట్లను ఏర్పాటు చేశారు. పాదయాత్రగా జగన్‌ నడచి వచ్చిన 13 జిల్లాల పేర్లను కింది నుంచి పైకి మెట్లపైన ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం దాకా జగన్‌ నడిచిన రూట్‌ మ్యాపును కూడా నిక్షిప్తం చేశారు. ఇక బయట చుట్టూ ప్రహరీ గోడపై ఓ వైపు ప్రజాసంకల్ప పాదయాత్ర 2017–2019 అని, మరోవైపు విజయసంకల్ప స్థూపం అని రాశారు.

రెండు గంటల పాటు ప్రసంగం..
బుధవారం మధ్యాహ్న భోజన విరామం అనంతరం ఒంటి గంటకు అక్కడి నుంచి బయలు దేరి 1.15 గంటలకు ఇచ్ఛాపురంలోని పైలాన్‌ వద్దకు జగన్ చేరుకోనున్నారు. పాత బస్టాండ్‌ వద్దకు కాలినడకన చేరుకుంటారు. 1.30 గంటలకు అక్కడ భారీ బహిరంగ సభలో జగన్‌ పాదయాత్ర ముగింపు ప్రసంగం చేస్తారు. కాగా ఇప్పటి వరకూ పాదయాత్రలో జరిగిన అనుభవాలు.. ఆయనకు ఎదురైన పరిణామాలతో పలు ఆసక్తికర విషయాలపై జగన్ ప్రసంగిస్తారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. కాగా పాదయాత్ర ముగింపు రోజు కావడంతో జగన్ ఏం మాట్లాడబోతున్నారు..? ఎవరిపై విమర్శలు ఎక్కుపెట్టనున్నారు..? అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.