జగన్‌ ఫేస్‌బుక్ పోస్టుతో సీఎం ఎవరో తేలిపోయింది!

  • IndiaGlitz, [Tuesday,May 21 2019]

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కౌన్‌డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో ఏపీ సీఎం ఎవరో.. ప్రతిపక్షనేత ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే పలు ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు సర్వేలు చేసి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయో తేల్చేశారు. కొన్ని సర్వేలు టీడీపీకి.. జాతీయ సర్వేలు సైతం వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పడంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి.

అయితే ఎన్నికల పోలింగ్ మొదలుకుని ఇప్పటి వరకూ చంద్రబాబు పలుమార్లు ప్రెస్‌ మీట్స్ పెట్టి అటు ఎన్నికల కమిషన్.. ఇటు కేంద్ర ప్రభుత్వం దుమ్మెత్తి పోశారు. ఆఖరికి ఎన్నికల కమిషన్‌పై తిరుగుబాటు చేసి మరీ సుప్రీం కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఆదివారం విడుదలైన ఎగ్జిట్స్ పోల్స్‌పై కూడా చంద్రబాబు పెద్ద ఎత్తున హడావుడే చేశారు.

అయితే ఇంతవరకూ.. ఎగ్జిట్స్ పోల్స్‌పై స్పందించని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ఫేస్‌బుక్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ను బట్టి ఏపీ సీఎం ఎవరన్నది తేలిపోయింది. రాజన్న సుపరిపాలనను తీసుకురావాలన్నదే తన సంకల్పమని జగన్ పోస్ట్ చేశారు. ఈ క్యాప్షన్‌తో పాటు ఓ పోస్టర్‌ను సైతం జగన్ పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌లో నవ్వుతూ మైకు పట్టుకుని జగన్ ఉండటం గమనించవచ్చు.

ప్రజాస్వామ్యంలో ‘ప్రజాపరిపాలనే సాగాలి’ అనే క్యాప్షన్‌తో.. మండు టెండల్ని సైతం లెక్కజేయకుండా క్యూలలో నిలబడి ప్రజలు ఓట్లేశారని, ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనాన్ని నిలబెట్టారని, వారి ఆశీస్సులు అందిన వేళ వారికి బాధ్యుడినై ఉంటానని రాసుకొచ్చారు. సో.. దీన్ని బట్టి అసలు ఎవరు ఏపీకి సీఎం కాబోతున్నారు.. అసలు జగన్ ధీమా ఏ రేంజ్‌లో ఉన్నది అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ పోస్ట్‌కు పలువురు కార్యకర్తలు, వీరాభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.