యువతకు శుభవార్త చెప్పిన సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయడంఖా మోగించిన తర్వాత వాలెంటర్లు, సచివాలయ పోస్టులతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరో శుభవార్త చెప్పారు. ఏపీలో నిరుద్యోగులకు.. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్న యువతకు సోమవారం నాడు జగన్ తియ్యటి శుభవార్త చెప్పారు.

రాష్ట్రాన్ని నైపుణ్య వికాస కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 30 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శిక్షణా కేంద్రాల పర్యవేక్షణకు కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. వాస్తవానికి స్కిల్స్ లేక చాలా మంది యువత ఇంటర్వ్యూల దాకా వెళ్లి వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే విద్యార్థులు చదువుకున్న కోర్సుకు సంబంధిత నైపుణ్యాలను ఈ సెంటర్స్ ద్వారా బోధించి.. వారిని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఏపీ యువత.. హర్షం వ్యక్తం చేస్తోంది.

ఇలా తీర్చిదిద్దబోతున్నారు..!

సోమవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖలపై సీఎం సమీక్షించారు. పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున, నాలుగు ట్రిపుల్‌ ఐటీలకు అనుబంధంగా నాలుగు కేంద్రాలు సహా పులివెందుల జేఎన్టీయూకు అనుబంధంగా మరొక కేంద్రం ఏర్పాటు చేయాలని జగన్‌ ఆదేశించారు. ‘రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి గొప్ప ఊతమిచ్చేలా ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను తీర్చిదిద్దాలి. ఐటీ రంగంలో హై ఎండ్‌ స్కిల్స్‌పై ఓ సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలి. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పించి వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలి.. దీనికి అనుబంధంగా సెంట్రల్‌ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో మరో రెండు సంస్థలను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక రూపొందించాలి. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ విభాగాలు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలన్నీ నైపుణ్యాభివృద్ధి విభాగం ద్వారానే చేయాలి. విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి విభాగాలు కలిసి పనిచేయాలి. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలి. ఉన్నత విద్యామండలి, ఐటీ విభాగాలకు చెందిన వారిని ఇందులో సభ్యులుగా నియమించాలి’ అని అధికారులను జగన్ ఆదేశించారు. కాగా.. ఈ సమావేశానికి మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చెల్లా మధుసుదన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.