close
Choose your channels

రెండో రోజు కలెక్టర్ల సదస్సులో జగన్ కీలక నిర్ణయాలు

Tuesday, June 25, 2019 • తెలుగు Comments

రెండో రోజు కలెక్టర్ల సదస్సులో జగన్ కీలక నిర్ణయాలు

ఉండవల్లిలోని ప్రజావేదికలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా మద్యపాన నిషేధం, హోదా ఉద్యమ కారులపై కేసుల ఎత్తివేత, అగ్రిగోల్డ్, పోలీసులకు సలహాలు సూచనలు ఇలా చాలా విషయాలపై నిశితంగా చర్చించిన అనంతరం వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుని సదస్సు వేదికగా మీడియాకు వెల్లడించారు. అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అందుకు అందరి సహకారం అవసరమని వైఎస్ జగన్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆ దిశగా అడుగులు వేస్తున్నామని.. ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. శాంతిభద్రతలకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని.. పోలీస్‌ వ్యవస్థలో ‘దేశంలోనే నంబర్‌ వన్‌’ అన్నట్లుగా పనిచేయాలని ఈ సందర్భంగా ఐపీఎస్‌లకు జగన్ సూచించారు.

సంపూర్ణ మద్దతిస్తా!

"తప్పు చేసినవారు ఎవరైనా సహించవద్దు. పోలీసులు చాలా సార్లు ఎంపీ, ఎమ్మెల్యేలను లెక్క చేయకుండా ఉంటారు. 2 లక్షల మంది ఎన్నుకున్న ఎమ్మెల్యేలను గౌరవించకపోతే ఎలా..? పోలీసులు మానవీయ కోణంలో పనిచేయాలని, పాలన వ్యవస్థలో పోలీసులు, ప్రజాప్రతినిధులూ ముఖ్యమే. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే పని ఎవరూ చేయవద్దు. పర్సనల్‌ ఇగోలు పక్కనబెట్టాలి. ప్రజలకు మంచి చేయాలనుకునే అధికారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది" అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

మంచి పోలీస్‌ వ్యవస్థ అంటే ఇదేనా!

"గత ప్రభుత్వంలో కొన్ని అనుభవాలను ప్రస్తావించదలచుకున్నా.. గత ముఖ్యమంత్రి నివాసం సమీపంలోనే యధేశ్చగా ఇసుక మాఫియా సాగింది. చంద్రబాబు ఇంటి వద్ద ఇసుక మాఫియా జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోను టీడీపీ ఎమ్మెల్యే జుట్టుపట్టుకొని ఈడ్చి దాడి చేసినా అతనిపై చర్యలు లేవు. ఇలాంటి సంఘటనలు మన కళ్ల ఎదుటే జరిగాయి. గుంటూరులో మైనింగ్‌ మాఫియా జరిగినా ఏం చేయలేదు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు థియేటర్ల ఓనర్లను, విద్యాసంస్థల యజమానులను డబ్బులు డిమాండ్‌ చేశారు. పేకాట క్లబ్బులు కూడా నడిపించారు. అయినా ఎలాంటి చర్యలు లేవు. ఇదేనా నంబర్‌ వన్‌ పోలీసింగ్‌ అంటే..? రాజధాని భూముల విషయంలో ల్యాండ్‌ ఇవ్వని రైతులను బెదిరింపులకు గురిచేసి అక్రమ కేసులు పెట్టారు. 11 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ యధేశ్చగా సాగింది. ఆ విషయంలో ఎంత మందిపై కేసులు నమోదు చేశారు. ఎంత మందిని అరెస్టు చేశారు. ఇదేనా మంచి గవర్నెన్స్‌ అంటే.. మంచి పోలీస్‌ వ్యవస్థ అంటే..?" అని పోలీసుల తీరుపై వైఎస్ జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

రేపట్నుంచే కూల్చివేత!

"మనం అంతా కూర్చున్న భవనం ప్రజావేదిక ఇది కూడా అక్రమ కట్టడమే. నిబంధనలను తుంగలో తొక్కి గత ముఖ్యమంత్రి నిర్మించుకున్నారు. నిబంధనలన్నీ బేఖాతరు చేసి ప్రజా వేదిక కట్టారు. మన కళ్ల ఎదుటనే గత ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యమంత్రి అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్నారు. కరకట్ట ఎత్తు 22.2 మీటర్లు అయితే 19 మీటర్ల ఎత్తులోనే ప్రజావేదిక కట్టారు. ప్రభుత్వమే అక్రమ కట్టడాలను నిర్మిస్తే ఎలాంటి సంకేతాలు మనం ఇచ్చినట్లు.? ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. నైతికత లేకపోతే మనం ఎవరినైనా ప్రశ్నించగలమా..? అవినీతి, లూటీ, అక్రమాలకు అధికారులు నో చెప్పాలి. వ్యవస్థలను శుద్ధి చేయాలి. అక్రమ నిర్మాణాల కూల్చితే ప్రజావేదిక నుంచే ప్రారంభం కావాలి. రేపటి నుంచి ప్రజా వేదిక కూల్చేయండి" అని వైఎస్ జగన్ తేల్చిచెప్పారు.

నేనూ మా నాన్న నుంచి నేర్చుకున్నా!

"గ్రామాల్లో బెల్ట్‌షాపులు ఉండకూడదు. నా పాదయాత్రలో బెల్ట్‌షాపుల వల్ల నాశనమైన కుటుంబాల బాధలు చాలా గ్రామాల్లో విన్నాను. బెల్ట్‌షాపు అంటేనే క్రిమినల్‌ వర్డ్‌. మంచి పనిచేసేందుకు అధికారులకు ముఖ్యమంత్రి నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. మనం మంచిపాలన అందించాలి. అందుకు సమూల మార్పులు తీసుకువద్దాం. ఎదిగే కొద్దీ ఒదగాలనేది మా నాన్న (దివంగత నేత వైఎస్సార్) నుంచి నేర్చుకున్నా. అదే సిద్ధాంతాన్ని నేను నమ్ముతున్నా. ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు వస్తే నవ్వుతో వారిని పలకరించి ఫిర్యాదులు స్వీకరించాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేస్తే ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరుగుతుంది. పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అనేది దేశంలోనే ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో మన ప్రభుత్వం మొట్టమొదటి సారిగా అమలు చేస్తుంది. పోలీసులను రిక్రూట్‌ చేసుకుంటాం. వారంలో ఒక్క రోజు పోలీసులు సెలవు తీసుకుంటే మిగిలిన రోజుల్లో  ఉత్సాహంగా పనిచేయగలరు. పోలీస్‌ స్టేషన్లలో రిసెప్షన్‌ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఫిర్యాదు దారులను గౌరవించేలా రిసెప్షన్‌ విభాగం ఉండాలి. దళితులు, బలహీనవర్గాలకు పోలీసులు మరింత చేరువలో ఉండి మన్ననలు పొందాలి. సాయం కోరి వచ్చిన పేదలకు న్యాయం చేయాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ చాలా ముఖ్యం.

సంపూర్ణ సహకరాం ఉంటుంది!

"వీకర్‌ సెక్షన్‌ కాలనీలను కలెక్టర్లు, ఎస్పీలు సందర్శించాలి. వారితో మాట్లాడాలి. ఎస్‌ఐ, సీఐల పనితీరును ప్రజలను అడిగి తెలుసుకోండి. ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు కూడా చేపట్టాలి. గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదులు తీసుకొని రశీదులు ఇవ్వాలి. కేసులను వేగంగా పరిష్కరించాలి. సైబర్‌ క్రైమ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టాలి. మహిళా రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సోషల్‌ మీడియాలో మహిళలపై అభ్యకరంగా ప్రవర్తించినా సహించవద్దు. మహిళలకు రక్షణ కల్పించకపోతే వైఫల్యం చెందినట్లే. ఈవ్‌టీజింగ్‌ను కూడా సహించవద్దు. అందరూ గర్వించేలా పనిచేయాలి. మంచి పాలన ప్రజలందరికీ అందించాలి. ప్రభుత్వం నుంచి అధికారులకు సంపూర్ణ సహకారం ఉంటుంది" అని వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.  
 
కేసులు ఎత్తివేత..

"ప్రత్యేకహోదా ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలేకాదు.. ప్రతి ఉద్యోగి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని తెలిపారు. మంగళవారం కలెక్టర్ల రెండో రోజు సదస్సులో భాగంగా జిల్లా ఎస్పీలు, పోలీస్‌ ఉన్నతాధికారులనుద్దేశించి ప్రసంగించారు. ‘ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. దేశంలోనే ఏపీ పోలీస్‌ వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉండాలి. చట్టాలను అమలు చేయడంలో ఎమ్మెల్యేలను కలుపుకుని పోవాలి. మానవీయ కోణంలో పోలీసులు పనిచేయాలి. ప్రజాప్రతినిధులను గౌరవించాలి. తప్పు చేస్తే ఎవరైనా ఎంతటివారైనా సహించవద్దు. పాలనా వ్యవస్థలో పోలీసులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమే. చెడ్డపేరు వచ్చే పని ఎవరూ చేయవద్దు. పర్సనల్‌ ఇగోలు పక్కనపెట్టి పనిచేయండి"అని వైఎస్ జగన్ సూచించారు.

సో.. మొత్తానికి చూస్తే మొదటి రోజు కలెక్టర్లతో.. రెండో రోజు మొత్తం ఐపీఎస్‌లతోనే సమావేశం జరిగింది. ఈ రెండ్రోజులు కూడా వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు ఇవ్వడంతో పాటు ఆదేశాలు సైతం జారీ చేశారు.

Get Breaking News Alerts From IndiaGlitz