close
Choose your channels

జగన్‌కు మోదీ అంటే భయం.. ఎవ‌రు నిల‌బ‌డ‌తారో.. ఎవ‌రు పారిపోతారో!

Monday, June 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జగన్‌కు మోదీ అంటే భయం.. ఎవ‌రు నిల‌బ‌డ‌తారో.. ఎవ‌రు పారిపోతారో!

ఆంధ్రప్రదేశ్‌ను లీడ్ చేస్తున్న వారికి ప్రధాని మోదీ అంటే భయం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా ఎద్దేవా చేశారు. జ‌న‌సేన పార్టీ ఓట్ల కంటే ఎక్కువ‌గా ప్ర‌జ‌ల హృద‌యాలు గెలుచుకుంద‌ని పవన్ స్ప‌ష్టం చేశారు. పార్టీకి వ‌చ్చిన ప్ర‌తి ఓటుకు స‌ర్వ‌దా కృత‌జ్ఞ‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తాన‌ని మాటిచ్చారు. ఆదివారం అభ్య‌ర్ధుల‌తో జ‌రుగుతున్న స‌మీక్షా స‌మావేశాల్లో పాల్గొన్నారు. అనంత‌రం త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన జ‌న‌సైనికుల‌ను క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌ మాట్లాడుతూ..."జ‌న‌సేన పార్టీకి వ‌చ్చిన ప్ర‌తి ఓటు వంద ఓట్ల‌తో స‌మానం. డ‌బ్బు లేకుండా రాజ‌కీయాలు చేయ‌డం చాలా క‌ష్టం. కానీ ప్ర‌య‌త్నం చేయ‌క‌పోతే ఏదీ సాధ్య‌ప‌డ‌దు. నేను కొంత మందిని అడిగాను ఓటుకు ఎంతిచ్చారు అని. రెండు వేలు అని చెప్పారు. రెండు వేల‌ను ఐదు సంవ‌త్స‌రాల‌కు విభ‌జిస్తే రోజుకు రూపాయి వ‌స్తుంది. గుడి దగ్గ‌ర భిక్షాట‌న చేసుకునే వారికి కూడా అంత‌కంటే ఎక్కువే వ‌స్తాయి. ద‌య‌చేసి నోటు కోసం మీ భ‌విష్య‌త్తును, మీ బిడ్డ‌ల భ‌విష్య‌త్తును తాక‌ట్టు పెట్ట‌వ‌ద్దు. జ‌న‌సేన త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన అభ్య‌ర్ధులు మాకు ఓట్లు రాలేదు అని చెబుతున్నారు. మిమ్మ‌ల్ని న‌మ్మి కొద్ది మందైనా ఓట్లు వేశారు అందుకు సంతోషించాలి. ప్ర‌జ‌ల్లో జ‌న‌సేన పార్టీకి ఎంత‌టి ఆదరణ ఉందంటే, మూడు రోజుల ముందు బి.ఫారంలు తీసుకుని వెళ్లిన అభ్య‌ర్ధి సైతం మీటింగ్ పెడితే ప‌ది వేల మంది వ‌చ్చారు. పార్టీ ప‌ట్ల యువ‌త‌కు గౌర‌వం ఉంది. అయితే ప్ర‌జ‌లు ప‌రీక్షిస్తున్నారు. మీరు ఎంత వ‌ర‌కు నిల‌బ‌డ‌తారో అని. 2019లో అద్భుతాలు జ‌రుగుతాయి అని ఆశించ‌లేదు. ఓట‌మి ఎదురైన‌ప్పుడే తెలుస్తుంది ఎవ‌రు నిల‌బ‌డ‌తారో, ఎవ‌రు పారిపోతారో. జ‌న‌సేన పార్టీ ఇప్పుడే నిజ‌మైన రాజ‌కీయ పార్టీగా అవ‌త‌రించింది. మ‌ళ్లీ చెబుతున్నా నా చివ‌రి శ్వాస వ‌ర‌కు జ‌న‌సేన పార్టీని మోస్తాను" అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

అంతా వెళ్లిపోయిన ఒక్కడ్నే నిలబడతా..!

"ఇక ముందు కూడా బ‌లంగా నిల‌బ‌డ‌తా. అంద‌రికీ అందుబాటులో ఉంటా. అంద‌ర్నీ క‌లిసేందుకు ప్ర‌త్యేక స‌మ‌యాలు కేటాయిస్తా. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నా వంతు కృషి చేస్తా. రాజ‌కీయాల్లోకి ఇష్టంతో వ‌చ్చా. నా ఆశ‌యాల‌ను ఓ క్ర‌మంలో ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నా. ఇక్క‌డి నుంచి అంతా వెళ్లిపోయినా నేను ఒక్క‌డినే నిల‌బ‌డ‌తా. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయ‌లేమో చూస్తా. రాజ‌కీయం అన్న త‌ర్వాత క‌ష్టం, న‌ష్టం ఉంటాయి. అన్నింటినీ త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌ల ధైర్యం నాకుంది. నేను స‌మాజ శ్రేయ‌స్సు కోరుకునేవాడిని, భార‌త దేశ స‌మ‌గ్ర‌త కోరుకునేవాడిని. న‌న్ను చాలామంది అడిగారు ప్ర‌ధాని పిలిస్తే ఎందుకు వెళ్ల‌లేదు అని. కానీ నాకు రాష్ట్ర శ్రేయ‌స్సు ముఖ్యం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని లీడ్ చేస్తున్న వ్య‌క్తుల‌కు మోడీ అంటే భ‌యం ఉంది. నాకు భ‌యం లేదు కేవలం ప్ర‌ధాని అన్న గౌర‌వం మాత్ర‌మే ఉంది. ఈ కార్యాల‌యం ఎవరి దయాదాక్షిణ్యాల మీద వ‌చ్చింది కాదు. నా బిడ్డ‌ల భ‌విష్య‌త్తు ప‌ణంగా పెట్టి క‌ట్టింది. హైద‌రాబాద్‌లో కూర్చుని రాజ‌కీయాలు చేయ‌ను ఇక్క‌డే ఉంటా. అందరికీ అందుబాటులో ఉంటాను" అని పవన్ కల్యాణ్ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపారు.

సీమ ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడదాం

ఆదివారం ఉదయం అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో జనసేన తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ "రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు కొన్ని కుటుంబాల గుప్పిట్లో ఉండిపోయాయి. ఆ కుటుంబాలను తట్టుకొని నిలబడి... ఎన్ని ఒత్తిళ్లనైనా భరించి ప్రజలకు అండగా నిలుద్దాం. సీమ ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడదాం.అక్కడ అపరిమితమైన సహజ వనరులున్నాయి. అయితే ప్రజలు ఉపాధి కోసం వలసపోతున్నారు. వారికున్న సమస్యలను నాయకులు పట్టించుకోవడంలేదు. ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఇది మనకు పరీక్షా కాలంగా భావించి ప్రజల కోసం పని చేద్దాం. మనం ఏ మేరకు నిలబడగలం అని చూస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు, గణాంకాలు కాదు... మనల్ని అభిమానించి, మన పార్టీపై అమిత విశ్వాసంతో ఓటు వేసిన లక్షల మందిని గుర్తుపెట్టుకొందాం. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో మన బలాన్ని పెంచుకొందాం. ఇందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి. ప్రజా క్షేత్రంలో మనం ఎక్కువ సమయం వెచ్చించాలి. వారితో మమేకం కావాలి. వారి ప్రేమను పొందుదాం" అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. జనసేనాని వ్యాఖ్యలకు వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.