close
Choose your channels

వైఎస్ జగన్, కేటీఆర్, కేసీఆర్.. కేంద్రమా ఎందుకిలా!?

Tuesday, December 3, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైఎస్ జగన్, కేటీఆర్, కేసీఆర్.. కేంద్రమా ఎందుకిలా!?

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అపాయిట్మెంట్ ఇవ్వలేదా..? సోమవారం రాత్రి నుంచి కేసీఆర్ ఢిల్లీలో తిష్ట వేసినప్పటికీ అపాయింట్మెంట్ కుదరలేదా..? కేసీఆర్ మాత్రం భేటీ అయ్యి తీరాల్సిందేనని.. దేశ రాజధానిలోనే తిష్టవేశారా..? తెలుగురాష్ట్రాలను మోదీ తక్కువ చూపు చూస్తున్నారా..? మొన్న ఏపీ సీఎం జగన్‌కు.. నిన్న మంత్రి కేటీఆర్‌కు.. ఇవాళ చూస్తే కేసీఆర్‌కు ఢిల్లీ వేదికగా అసలేం జరుగుతోంది..? అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానాలు దొరకట్లేదట. సోమవారం రాత్రి కేసీఆర్ ఢిల్లీకి పయనమైన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా మొదట మోదీ.. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావాలని కేసీఆర్ భావించారు. అయితే మొదటి అపాయిట్మెంటే వర్కవుట్ అవ్వలేదు. దీంతో ఢిల్లీ వ్యవహారాలు చూసుకునే టీఆర్ఎస్ ఎంపీపై కేసీఆర్ కాస్త ఆగ్రహానికి లోనయ్యారట.

భేటీ అయ్యి తీరాల్సిందే..!
ఒక్కరోజు ఆలస్యమైనా సరే మోదీతో భేటీ అయ్యి తీరాల్సిందేనని ఢిల్లీలోనే కేసీఆర్ ఉండిపోయారు. అసలు ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యమేంటి..? ఎందుకెళ్లారు..? అనే విషయానికొస్తే.. రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు, విభజన తరువాత అపరిష్కృతంగా ఉన్న దాదాపు 30 అంశాలతో పాటు రేప్‌ కేసులపై కఠిన చర్యలు తీసుకునేందుకు గాను చట్టంలో మార్పులు, ఆర్టీసీ విషయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి నిశితంగా చర్చిస్తారని తెలుస్తోంది. అయితే ఇంతవరకూ అపాయిట్మెంటే కుదరలేదు. మరి కేసీఆర్ ఢిల్లీ నుంచి తిరిగొచ్చేస్తారా..? లేకుంటే అపాయింట్మెంట్ దొరికే వరకూ అక్కడే ఉంటారా..? అన్నది తెలియాల్సి ఉంది.

ఇవీ కేసీఆర్ చర్చించే అంశాలు!?
మొత్తానికి చూస్తే.. గత కొన్ని రోజులుగా తెలంగాణ జరుగుతున్న పరిణామాలపై కేంద్రం యమా సీరియస్‌గా ఉందని తెలుస్తోంది. దీంతో కేసీఆర్‌కు ఇప్పట్లో అపాయిట్మెంట్ ఇవ్వకూడదని పీఎంవోలోని అధికారులను హోం మంత్రి షా ఆదేశాలు జారీ చేశారట. ఫైనల్‌గా చూస్తే మొన్నటికి మొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విషయంలోనూ ఇదే జరిగింది. అమిత్ షాతో అపాయిట్మెంట్ మొదట కుదరకపోవడం.. ఆ తర్వాత దొరికినా మాట్లాడటానికి వీల్లేకపోవడంతో చేసేదేమీ లేక జగన్ మిన్నకుండి అమరావతికి తిరిగొచ్చేశారు. అంతేకాదు ఇటీవల శంషాబాద్‌లో జరిగిన ‘దిశ’ హత్య ఉదంతంపై కఠిన చర్యలు తీసుకునేందుకు గాను అవసరమైతే చట్ట సవరణలు చేద్దామని ట్విట్టర్ వేదికగా కోరినప్పటికీ పీఎంవో నుంచి ఇంతవరకూ రిప్లై కూడా రాలేదు. మరోవైపు.. సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో దిశ ఘటన ప్రస్తావనకు రావడం.. ప్రతిపక్షాలన్నీ ఈ విషయంపై చర్చించాలని పట్టుబట్టడంతో అటు లోక్‌సభ.. ఇటు రాజ్యసభ ఎంపీలు అరుపులు కేకలతో హోరెత్తింది. అయినప్పటికీ ఇంతవరకూ మోదీ మాత్రం అస్సలు రియాక్ట్ అవ్వట్లేదు.

ఎందుకిలా జరుగుతోంది..!?
మొత్తానికి.. దీన్ని బట్టి చూస్తే కేంద్రం తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తోందే తప్ప.. పనులు మాత్రం చేయట్లేదని స్పష్టంగా అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. అంతేకాదు.. కోపముంటే రాష్ట్రాల ప్రభుత్వాలపై అంతేకానీ.. ప్రజలపైన కాదని.. ప్రజా సమస్యలపై పరిష్కరించాల్సిన అవసరం ప్రతీ రాజకీయ నాయకుడికీ ఉండాల్సిన మొదటి లక్షణమని.. అలాగే రాష్ట్రాల సమస్యలను తీర్చడానికి ప్రధాని ఉన్నారని.. వాటిని పట్టించుకోకుండే అలక్ష్యం చేస్తే ఎలా అని పలువురు నెటిజన్లు.. విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. మొన్న వైఎస్ జగన్‌కు.. నిన్న కేటీఆర్‌కు.. ఇవాళ కేసీఆర్‌కు రేపు ఇంకెవ్వరుంటారో మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.