close
Choose your channels

కరోనా సోకిందని వివక్ష చూపొద్దు.. ప్రేమ చూపండి : జగన్

Wednesday, April 1, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా సోకిందని వివక్ష చూపొద్దు.. ప్రేమ చూపండి : జగన్

కరోనాపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్‌ లక్షణాలు గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని తెలిపారు. రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం బాధ కలిగిస్తోందన్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌ను అరికట్టవచ్చు..

కరోనాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం వైయస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు. వైరస్‌ వస్తే ఏదో జరిగిపోతుందని అనుకోవద్దన్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌ను అరికట్టవచ్చని చెప్పారు. వయసు మళ్లినవారిలో ఈ వైరస్‌ ప్రభావం కొంత తీవ్రంగా ఉందని తెలిపారు. కరోనా వైరస్‌ అనేది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేదని ప్రజలు గుర్తించాలని కోరారు. కొన్నిచోట్ల దేశ ప్రధానులకు కూడా కరోనా వచ్చిందని గుర్తుచేశారు. వైరస్‌వచ్చిన వ్యక్తుల పట్ల వ్యతిరేకభావం చూపొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

70 శాతం ఢిల్లీ మీటింగ్‌కు వెళ్లినవారే..

ఢిల్లీలో ఒక మీటింగ్‌కు వెళ్లి వచ్చినవారిలో పలువురికి కరోనా వచ్చినట్టుగా గుర్తించామని సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఏపీలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 70 శాతం ఢిలీ మీటింగ్‌కు వెళ్లినవారే ఉన్నారని తెలిపారు. ఏపీ నుంచి మొత్తం 1085 మంది ఢిల్లీ మీటింగ్‌కు వెళ్లారని తెలిపారు. వారిని గుర్తించి వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 585 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. అనుమానితులుంటే ప్రజలు దగ్గరలో ఉన్న అధికారులు సమాచారమివ్వాలని సూచించారు. ఢిలీ నుంచి వచ్చినవారు ఎవరైనా వైద్య పరీక్షలు చేయించుకోవకపోతే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. 104కు ఫోన్‌ చేస్తే వైద్య సాయం అందిస్తారని తెలిపారు.

సర్వే జరుగుతోంది..

రాష్ట్రంలో ప్రతి ఇంటిని సర్వే చేయిస్తున్నామని సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బందితో సర్వే జరుగుతోందని చెప్పారు. ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా ప్రజలు వారికి తెలియజేయాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే చికిత్స చేయించుకుని స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, ప్రైవేట్‌ ఆస్పత్రులు ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మధ్యాహ్నం వరకు పనులకు వెళ్లొచ్చు..

కరోనా నియంత్రణ చర్యల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారం పడిందని సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు. భారమైనప్పటికీ వేతనాలు వాయిదా వేసే అవకాశం ఇచ్చి ప్రభుత్వానికి సహకరించిన ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోపాటు ఇతర అధికారులు, పెన్షనర్లకు ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ కృతజ్ఞతలు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరి సహకారం మరిచిపోలేనిదని కొనియాడారు. రైతులు, రైతు కూలీలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు వ్యవసాయ పనులకు వెళ్లవచ్చన్నారు.

ప్రేమ, ఆప్యాయతలు చూపండి..

కరోనా వైరస్‌ సోకిందని వివక్ష చూపొద్దని, వారి పట్ల ప్రేమ, ఆప్యాయతలు చూపాలని సీఎం వైయస్‌ జగన్ సూచించారు. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారని, జ్వరం, ఏ ఇతర సమస్యలున్నా వాలంటీర్లకు చెప్పాలని సీఎం వైయస్‌ జగన్ తెలిపారు. 81 శాతం కరోనా కేసులు ఇంట్లో ఉంటేనే నయమవుతాయని, కరోనా వైరస్‌కు 14 శాతం మాత్రమే ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. 4, 5 శాతమే ఐసీయూలో చికిత్స చేయాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. వాలంటీర్లకు ప్రజలు సహకరించాలని, వారు మీ బాగోగులు చూస్తారని చెప్పారు. పరిస్థితి విషమిస్తే వాలంటీర్లే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారని వైయస్‌ జగన్ స్పష్టం చేశారు. కరోనా సోకినవారిపట్ల వివక్ష చూపించొద్దని, ఆప్యాయత చూపాలని సీఎం వైయస్‌ జగన్ స్పష్టం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos