అమరావతిపై ఎట్టకేలకు జగన్ స్పందన.. కీలక నిర్ణయం!

  • IndiaGlitz, [Friday,September 13 2019]

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని వైఎస్ జగన్ కొనసాగిస్తారా..? మరో చోటికి మారుస్తారా..? జగన్ మనసులో ఏముంది? ఆయన మన్ కీ బాత్ ఏంటి? రాజధానిని అమరావతి నుంచి మారుస్తారా? లేకపోతే కేవలం పరిపాలన నిర్మాణాల వరకే పరిమితం చేస్తారా? మంత్రి బొత్స అస్తమాను మీడియా ముందుకు వచ్చి రాజధాని గురించి ఎందుకు ప్రకటనలు చేస్తున్నారు..? రాజధాని వేదికగా అసలేం జరుగుతోంది..? ఇంతకీ రాజధానిని జగన్ కడతారా..? లేకుంటే మిన్నకుండిపోతారా..? అనే సందేహాలు యావత్ ఆంధ్రా ప్రజానీకంలో ఉన్నాయి. అంతేకాదు.. రాజధానికి భూములిచ్చిన రైతులు గంధరగోళంలో పడ్డారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై వైస్ జగన్ నిశితంగా ఆలోచించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

కమిటీ ఏర్పాటు.. ఆరు వారాల్లో నివేదిక!
తాజాగా.. అమరావతిపై జగన్ సర్కార్ ఓ కమిటీని నియమించింది. ఆరుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ప్రొఫెసర్ మహావీర్, అంజలీ మోహన్, శివానందస్వామి, కేటీ రవీంద్రన్, డాక్టర్ అరుణాచలం సభ్యులుగా ఉన్నారు. వీరంతా పట్టణాభివృద్ది రంగంలో నిపుణులే కావడం విశేషమని చెప్పుకోవచ్చు. కాగా..ఈ కమిటీ రాజధాని అమరావతితో పాటు రాష్ట్రాభివృద్ధికి పలు సూచనలు, సలహాలు కూడా ఇవ్వనుంది. ఈ కమిటీ ఆరు వారాల్లో నివేదిక ఇవ్వనుంది. దీంతోపాటు పర్యావరణం, వరదల నియంత్రణలో నిపుణులైన వారిని కమిటీలో కో ఆప్షన్ సభ్యుడిగా నియమించుకోవచ్చని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

మొత్తానికి చూస్తే.. ఇన్ని రోజులు రాజధాని నిర్మాణంపై మిన్నకుండిపోయిన వైఎస్ జగన్ ఎట్టకేలకు కమిటీ వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కమిటీ ఏం తేలుస్తుంది..? కమిటీ వద్దంటే రాజధాని నిర్మాణం ఉండదా..? ఇలాంటి విషయాలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే కమిటీ నివేదిక వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.