close
Choose your channels

అఘాయిత్యాల‌కు పాల్పడితే ఉరిశిక్షే.. తేల్చేసిన జగన్!

Monday, December 9, 2019 • తెలుగు Comments

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ సంఘటన తర్వాత ప్రభుత్వాల్లో చాలా మార్పులు సంభవిస్తున్నాయి. పరోక్షంగా ఇలాంటి ఘటన పాల్పడితే ఫలానా శిక్షే గతి అని పరోక్షంగా హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ సర్కార్.. అఘాయిత్యాలకు పాల్పడితే ఎన్‌కౌంటర్ తప్పదు అన్నట్లుగా పరోక్షంగా హెచ్చరించింది. మరోవైపు ఈ ఘటనపై అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆడ‌పిల్లల‌పై అఘాయిత్యాలకు పాల్పడితే 21 రోజుల్లోపు నేర‌స్తుల‌కు ఉరిశిక్ష ప‌డే ప‌రిస్థితుల్లోకి చ‌ట్టాలు తీసుకురావాలని.. అప్పుడే ఈ వ్యవ‌స్థలోకి మార్పు వ‌స్తుందని తేల్చిచెప్పారు. ఏపీ ప్రభుత్వం ఈ దిశ‌గా ముందడుగులు వేస్తోందని జగన్ తెలిపారు. కొన్ని దేశాల్లో అయితే ప్రజ‌ల ముందే కాల్చేస్తారని.. మ‌న దేశంలో ఇంకా కొంత చ‌ట్టాలు స‌వ‌రించాలంటే.. వారం రోజుల్లోపు విచార‌ణ పూర్తిచేసి రిపోర్టులు కంప్లీట్ చేసి ఆ త‌రువాత రెండు వారాల్లోపు ట్రయ‌ల్ కూడా కంప్లీట్ చేసి 21 రోజుల్లోపు వీళ్లకు ఉరిశిక్ష ప‌డే ప‌రిస్థితుల్లోకి చ‌ట్టాలు తీసుకురావాలన్నారు.

హ్యాట్సాప్ కేసీఆర్!
తెలంగాణ‌లో దిశ ఘ‌ట‌న‌లో బాధితురాలు త‌ల్లిదండ్రులు ప‌డే బాధ చూసి నిందితుల‌ను కాల్చేసినా త‌ప్పులేద‌ని అంద‌రం అనుకున్నామ‌న్న సందర్భాన్ని ఈ సందర్భంలో అసెంబ్లీలో జగన్ వివరించారు. అనుకోని ప‌రిస్థితుల్లో నిందితుల‌ను పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు. హ్యాట్సాఫ్ టు కేసీఆర్‌, హ్యాట్సాఫ్ టు తెలంగాణ పోలీస్ అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. మ‌న రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్‌ను ప్రవేశ‌పెట్టామ‌న్నారు. ఆడ‌వారు, చిన్న పిల్లల‌పై జ‌రుగుతున్న అత్యాచారాలు, భ‌ద్రత‌పై ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక న్యాయ‌స్థానం ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. మరీముఖ్యంగా సోష‌ల్ మీడియాలో కొందరు వేరే వ్యక్తుల‌పై బుర‌ద‌జ‌ల్లడం కోసం ఎటువంటి మ‌న‌స్సాక్షి లేకుండా సోష‌ల్ మీడియా ఈ మ‌ధ్య కాలంలో దిగ‌జారిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సోష‌ల్ మీడియాలో కూడా ఆడ‌వారిని ర‌క్షించే కార్యక్రమం జ‌ర‌గాలన్నారు. ఆడ‌వారిపై నెగిటివ్ పోస్టింగ్ చేస్తే వారికి శిక్ష ప‌డుతుంద‌నే భ‌యం ఉంటే త‌ప్ప మార్పు రాదన్నారు. అందుకే ఆ దిశ‌గా కూడా చ‌ట్టాల్లో మార్పులు తీసుకువ‌స్తామన్నారు.

తాగితే మ‌నుషులు రాక్షసులే!
‘తాగితే మ‌నుషులు రాక్షసులు అవుతారు. అందుకే వైన్‌షాపుల వ‌ద్ద ప‌ర్మిట్‌రూమ్‌ల‌ను ర‌ద్దు చేశాం. మ‌ద్యపాన నియంత్రణ అమ‌లు చేస్తున్నాం. మా ప్రభుత్వం వ‌చ్చి ఇప్పటి ఆరు నెల‌లు అవుతుంది. 2014 నుంచి 2019 వ‌ర‌కు చంద్రబాబు ఐదు సంవ‌త్సరాలు ప‌రిపాల‌న చేశారు. 2014లో మ‌హిళ‌ల‌పై జ‌రిగిన నేరాలు 13549, 2015లో 13088, 2016లో 13948, 217లో 14696, 2018లో 14048 కేసులు న‌మోదు అయ్యాయి. క‌ట్నం కోసం హ‌త్యలు, ఆత్మహ‌త్యలు, హ‌త్యలు, రేప్ కేసులు వంటివి జ‌రిగాయి. చిన్నపిల్లలపై జ‌రిగిన అత్యాచారాలు 2014లో 4032 కేసులు, 2015లో 4114 కేసులు, 2016లో 4477 కేసులు, 2017లో 4672 కేసులు, 2018లో 4215 కేసులు న‌మోదు అయ్యాయి. ప్రభుత్వం స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వమ‌ని అడిగితే... వేలెత్తి చూపించాల‌ని చేసిన విమ‌ర్శల‌కు ప్రతివిమ‌ర్శలు చేస్తున్నాం. అధికారంలోకి వ‌చ్చి ఆరు నెల‌లు అయినా.. జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు న‌న్ను క‌ల‌చివేసింది. జ‌రుగుతున్నది స‌రిగ్గా లేద‌ని నా మ‌న‌స్సు క‌ద‌లిచివేసింది కాబ‌ట్టే దీన్ని మార్చాల‌ని త‌ప‌న‌, తాప‌త్రయంతో ఏం చేయ‌గ‌లుగుతే మార్పు తీసుకురాగ‌లుగుతామ‌ని స‌ల‌హాలు, సూచ‌న‌లు అడుగుతున్నాం’ అని చంద్రబాబును వైఎస్ జగన్ అడిగారు.

మొత్తానికి చూస్తే... ఏపీలో ఇకపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే 21 రోజుల్లో ఉరిశిక్షే అని తేల్చిచెప్పడంతో.. ఓ హెచ్చరిక జారీ చేసినట్లయ్యింది. మరి ఇది ఎంతవరకు అమలు అవుతుందో..? ఇప్పటి వరకూ ఉన్న బాధిత కుటుంబాల పరిస్థితి ఏంటి..? అనేది మాత్రం ప్రభుత్వాలు మారుతున్నా ప్రశ్నార్థకంగానే పరిస్థితి ఉంది. మరి ఈ కేసులకు మోక్షం వచ్చునో..? మున్ముంథు జగన్ ఏం చేయబోతున్నారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz