నిర్మాత దిల్‌రాజుకు సీఎం వైఎస్ జగన్‌ కీలక పదవి!

  • IndiaGlitz, [Saturday,June 22 2019]

టైటిల్‌ చూడగానే తెలంగాణకు చెందిన దిల్‌రాజుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక పదవి ఇవ్వడమేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే సూపర్‌హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజుకు‌ జగన్ కీలక పదవి ఇవ్వడానికి సిద్ధమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈయనకు పదవి రావడం వెనుక వైసీపీ తరఫున పోటీచేసి ఓడిన ఓ ఎంపీ అభ్యర్థి ఉన్నారట. ఇంతకీ దిల్‌రాజుకు జగన్ ఎందుకు కీలక పదవి ఇవ్వాలని అనుకుంటున్నారు..? ఆయనకు పదవి ఇవ్వాలని ప్రపోజల్ పెట్టిందెవరు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

దిల్‌ రాజుకు ప్రేమతో జగన్!

టాలీవుడ్‌లో నంబర్ వన్ ప్రొడ్యూసర్ ఎవరని అడిగితే టక్కున గుర్తొచ్చిది దిల్ రాజు పేరే.. అందుకే ఆయన్ను సూపర్‌హిట్ చిత్రాల నిర్మాత అని అందరూ పిలుస్తుంటారు.. బిరుదు ఇచ్చేశారు కూడా. సినీ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు అలియాస్ వి. వెంకట రమణారెడ్డి.. రాజకీయాల్లో రాణించాలని ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నారన్నది ఇన్నర్ టాక్. అయితే ఆ సువర్ణావకాశాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ .. ఆయనకు ఇచ్చారట. అదేంటో కాదండోయ్.. టీటీడీ పాలకమండలిలో సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని జగన్ భావించారట.

ఎవరి రెకమెండేషన్‌తో..!

దిల్‌ రాజు- నిర్మాత పీవీపీ ఇద్దరూ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ ఎంపీగా పోటీచేసిన పీవీపీ అత్యల్ప ఓట్లతో ఓడిపోయారు. వైఎస్ జగన్‌తో పీవీపీ మంచి సంబంధాలున్నాయి. అయితే తన మిత్రుడు.. తిరుమల వెంకన్న భక్తుడు, వెంకన్న పేరు మీదే ప్రొడక్షన్ నడుపుతున్న దిల్‌ రాజుకు మండలిలో సభ్యుడిగా ఇవ్వాలని జగన్‌ను పీవీపీ చిరు కోరిక కోరారట. అయితే మారుమాట చెప్పకుండా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దీంతో పీవీపీ.. దిల్‌ రాజు ఆనందానికి అవధుల్వేవట.

ఎలా లీక్ అయ్యింది..!

శనివారం నాడు టీటీడీ చైర్మన్‌గా వైఎస్ జగన్ బాబాయ్.. వైసీపీ కీలకనేత వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈయన ప్రమాణ స్వీకారోత్సవంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హాజరుకాగా.. దిల్ రాజు కూడా విచ్చేశారు. దీంతో దిల్‌ రాజుకు పాలకమండలిలో చోటు కన్ఫామ్ అయ్యిందన్న వార్తలకు మరింత బలం చేకూరింది. కాగా ఇదివరకే టాలీవుడ్ నుంచి శ్రీవారికి సేవ చేసుకునే అవకాశం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు పలువురికి దక్కిన విషయం విదితమే. సో.. ఇప్పుడు ఆ జాబితాలోకి దిల్ రాజు కూడా చేరబోతున్నారన్న మాట. ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే ఈ నెల చివరి వరకు వేచి చూడాల్సిందే మరి.