close
Choose your channels

30న ‘జగన్ అనే నేను’.. కుంభకోణాలు బయటపెడతా!

Sunday, May 26, 2019 • తెలుగు Comments

ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే-23 సాయంత్రం నుంచి బిజీబిజీగా గడుపుతున్నారు. శనివారం రోజు హైదరాబాద్‌లో బిజీ షెడ్యూల్‌తో ఉన్న ఆయన ఆదివారం నాడు దేశ రాజధాని ఢిల్లీలోనూ వరుస భేటీలు, మీడియా సమావేశాలు ఇలా బిజీబిజీగానే గడిపారు. మొదట ప్రధాని నరేంద్ర మోదీతో.. ఆ తర్వాత బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలే ప్రధాన ఎజెండాగా భేటీ జరిగింది. అనంతరం ఏపీ భవన్‌లో ఉద్యోగులతో జగన్ ముచ్చటించారు. అనంతరం మీడియా మీట్ ఏర్పాటు చేసిన జగన్.. తనపై ఉన్న కేసులు, ఏపీ ప్రత్యేక హోదా విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మోదీతో భేటీపై..

"ఏపీకి సహాయ, సహకారాలు కావాలని ప్రధాని మోదీని కోరాను. రాష్ట్ర పరిస్థితులు వివరించాను.. కేంద్రం నుంచి సాయం అందించాలని విజ్ఞప్తి చేశాను. రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్ మీద బతుకుతోంది. రాష్ట్రం విడిపోయే నాటికి రూ.97వేల కోట్లు ఉన్న అప్పు.. ఐదేళ్లలో రూ.2.57 లక్షల కోట్లకు ఎగపాకింది. అప్పుల మీద కట్టాల్సిన వడ్డీలే రూ.20వేల కోట్లు ఉన్నాయి. రీ-పేమెంట్‌కు రూ.40వేల కోట్లు కావాలి" అని జగన్ లెక్కలేసి మరీ చెప్పారు.

నాపై తప్పుడు కేసులు పెట్టింది!

"కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాతే తనపై కేసులు పెట్టింది. నా తండ్రి సీఎంగా ఉన్న సమయంలో కనీసం సెక్రటేరియెట్‌కు కూడా వెళ్లలేదు. ఏ అధికారికి ఫోన్ కూడా చేయలేదు. నా తండ్రి హయాంలో నేను బెంగళూరులోనే ఉన్నాను. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీనీ అమలు చేస్తాం. మేనిఫెస్టోను ఓ భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌లా భావిస్తాం. ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లకుండా పనులు చేస్తాం. నవరత్నాలను కచ్చితంగా అమలు చేస్తాం. 2024 నాటికి మద్యాన్ని ఐదు నక్షత్రాల హోటళ్లకు పరిమితం చేశాకే ఓట్లు అడుగుతాం" అని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీకి 250 సీట్లు వచ్చుంటే..!

"బీజేపీకి 250 సీట్లు మాత్రం వచ్చి ఉంటే.. ప్రత్యేక హోదాపై సంతకం పెడితేనే మనం మద్దతిచ్చే వాళ్లం. ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టే.. కేంద్రానికి మన బాధ చెప్పుకుంటున్నాం. మన సహాయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం సాగుతోంది.. మన సహాయం వారికి అవసరం లేదు కానీ.. మనల్ని ఆదుకోవాల్సిన అవసరం వారికి ఉంది. రాష్ట్రాన్ని బాగా నడపాలన్న తపన ఉంది కాబట్టే.. ఆదుకోవాలని కేంద్రం, ప్రధానిని కోరాను. ప్రత్యేక హోదా విషయం కలిసిన ప్రతిసారీ అడుగుతూనే ఉంటాను. మున్ముంథు ప్రధానితో భేటీలు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యేక హోదాకు మద్దతుగా ఉంటామని కేసీఆర్ చెప్పారు. టీఆర్ఎస్, వైసీపీ ఎంపీలు కలిపి మొత్తం 31మంది తెలుగు రాష్ట్రాల కోసం పోరాడతారు. పొరుగు రాష్ట్రంతో సఖ్యత ఉండాలి. కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది" అని జగన్ స్పష్టం చేశారు.

నేనొక్కడినే ప్రమాణం చేస్తున్నా..

"ఈ నెల 30న నేను ఒక్కడినే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తాను. కొన్ని రోజుల తర్వాత మిగతా మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. మరో వారం, పది రోజుల్లో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తాను. మా ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుంది. అవినీతి రహిత పాలన అందిస్తాం. అవినీతి జరిగిందని తెలిస్తే కాంట్రాక్టులు రద్దు చేస్తాం. మా ప్రభుత్వంలో ప్రతిదీ పారదర్శకంగా ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కుంభకోణం జరిగితే విచారణ చేపడతాము" అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

పెద్ద కుంభకోణం..

"రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో పెద్దకుంభకోణం దాగి ఉంది. దానికి సంబంధించిన అన్ని విషయాలనూ బయటకు తీసుకురావాల్సిన అవసరముంది. ఇష్టం వచ్చినట్లు భూ పంపకాలు జరిగాయి. చంద్రబాబుపై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదు. టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున అవినీతి జరిగింది. టీడీపీకి అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లు, టీడీపీ సభ్యులైన వారికే ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. దాని వల్ల ప్రజాధనం టీడీపీ నేతల జేబులోకి వెళుతుంది" అని జగన్ చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే.. జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న రివర్స్ టెండరింగ్ విధానం సంచలనానికి దారితీయబోతోందని చెప్పుకోవచ్చు.

Get Breaking News Alerts From IndiaGlitz