close
Choose your channels

అసెంబ్లీలోకి 'గాడిద'.. వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు!!

Thursday, July 11, 2019 • తెలుగు Comments

అసెంబ్లీలోకి ‘గాడిద’.. వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు!!

అసెంబ్లీలోకి ‘గాడిద’ అంటే.. నిజంగానే వచ్చిందని కాదండోయ్.. గాడిద అనే పదం ఏపీ బడ్జెట్ సమావేశాల్లో రచ్చరచ్చకు దారితీసింది. ఇంతకీ అసలేం జరిగింది. గాడిద అనే పదం ఎవరు అన్నారు..? ఎవరు రచ్చజేశారనేది ఈ కథనంలో చూద్దాం.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజే సమావేశాలు హాట్ హాట్‌గా జరిగాయి. ఇవాళ ప్రాజెక్టులు, విద్యతో పాటు పలు విషయాలపై చర్చించారు. అయితే ఒకనొక సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు- సీఎం జగన్ మోహన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్‌కు జగన్ వెళ్లడాన్ని టీడీపీ తీవ్రంగా తప్పుబట్టింది. అయితే ఇందుకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. మీరు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టారని గుర్తు చేశారు. ‘గాడిద’ అని వైఎస్ జగన్‌ వ్యాఖ్యానించడంతో ఈ మాటలతో అసెంబ్లీలో పెద్ద హంగామానే జరిగింది.

తప్పేంటి..? అప్పుడు మీరేం గాడిదలు కాశారా!

"చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఆల్మట్టి, కాళేశ్వరం కట్టారు. కాళేశ్వరం కడుతుంటే.. చంద్రబాబు గాడిదలు కాశారా?. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఆల్మట్టి ఎత్తు పెంచారు. చంద్రబాబు చక్రం తిప్పుతున్న రోజుల్లోనే ఇవన్నీ జరిగాయి. నేను కాళేశ్వరం ప్రారంభానికి వెళ్లినా.. వెళ్లకున్నా స్విచ్చాన్‌ చేసేవారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ పట్ల ఔదార్యం చూపుతున్నారు. సత్సంబంధాలు కొనసాగిస్తున్నందుకు సంతోషించాల్సింది పోయి విమర్శిస్తారా?. తెలంగాణతో స్నేహభావంతో మెలగడం తప్పా?. సీఎంల మధ్య సఖ్యత ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణ నుంచి ఏపీకి గోదావరి నీరు ఇస్తున్నారు. గోదావరి నీళ్లను సాగర్‌, శ్రీశైలం తీసుకెళ్తే ఆయకట్టు స్థిరీకరణ. నీళ్ల విషయంలోనూ రాజకీయాలు వెదుకుతున్నారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రతిపక్షం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఐదేళ్లు బాబు సీఎంగా ఉన్న సమయంలోనే  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని.. అప్పుడు ఆయన 'గాడిదలు కాశారా' అని ప్రశ్నించారు.  ఇక.. ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నప్పుడే ఆల్మట్టి డ్యాం ప్రాజెక్టు కట్టారని జగన్‌ గుర్తు చేశారు" అని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్‌కు చంద్రబాబు కౌంటర్..

"నా రాజకీయ అనుభవమంత లేదు జగన్‌ వయసు. అవమానిస్తారా? ఎగతాళి చేస్తారా?. అధికారం ఉందని విర్రవీగడం సరికాదు. సభలో నన్ను మాట్లాడనివ్వకుండా చేయొచ్చు.. వాస్తవాలు ప్రజలు గ్రహిస్తారు. సభలో మాట్లాడే ప్రతి అంశాన్ని ప్రజలు చూస్తారు. కాళేశ్వరం వస్తే ఏపీ, తెలంగాణ..భారత్‌, పాక్‌ మాదిరిగా మారుతాయని జగనే అన్నారు. భావితరాల భవిష్యత్‌ను తాకట్టు పెట్టే అధికారం ఎవరు ఇచ్చారు.

నీటి పంపకాలు సున్నితమైన అంశం. ప్రజల్లో ఆందోళన ఉంది.. దీనిపై చర్చ జరగాలి. ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. రాష్ట్రప్రయోజనాలను దెబ్బతీసేలా ఏకపక్ష నిర్ణయాలు వద్దు" అని జగన్‌కు చంద్రబాబు కౌంటరిచ్చారు.

మొత్తానికి చూస్తే మొదటి రోజే బడ్జెట్ సమావేశాలు ఇంత హాట్ హాట్‌గా జరిగితే ఈ నెల 30 వరకు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు మామూలుగా ఉండవేమో.!. మున్ముంధు అయినా ఈ గాడిదలు, కోతులు అనేవి కాకుండా ప్రజా సమస్యలపై చర్చిస్తే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz