YS Rajasekhara Reddy:ఆ చిరునవ్వును, ఆ పాలనను మరచిపోగలమా : తెలుగు నేలపై చెరగని సంతకం .. డాక్టర్ వైఎస్సార్


Send us your feedback to audioarticles@vaarta.com


తెలుగు ప్రజల గుండె చప్పుడు.. అపర భగీరథుడు, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు. సంక్షేమానికి కొత్త భాష్యం చెబుతూ.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ రామరాజ్యాన్ని తలపించింది ఆయన పాలన. ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా.. ఇవ్వని హామీలను కూడా ప్రజలకు అందించారు. తన పాలనా కాలంలో వ్యవసాయం, ఇరిగేషన్, ప్రజారోగ్యం, విద్యా రంగాలకు పెద్దపీట వేశారు వైఎస్సార్. ఆయన మరణించి 13 ఏళ్లు కావొస్తున్నా.. తెలుగు ప్రజల స్మృతిపథంలో మాత్రం ఇంకా నిలిచేవున్నారు. అచ్చ తెలుగు పంచెకట్టు, చెరగని చిరునవ్వు, ప్రతి ఒక్కరిని పేరు పేరునా ‘‘నమస్తే నమస్తే ’’ అంటూ పలకరించే ఆ పిలుపు ఇంకా ప్రతి ధ్వనిస్తూనే వుంది.
మండుటెండలో 1472 కిలోమీటర్ల పాదయాత్ర :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ వరుస ఓటములతో వున్న కాలం.. తెలుగుదేశం పార్టీ దూకుడు ఓ రేంజ్‌లో వుంది. సీఎంగా, ఎన్డీయే కన్వీనర్‌గా చంద్రబాబు జాతీయ రాజకీయాలను శాసిస్తున్న పరిస్ధితి. కానీ రాష్ట్రంలో మాత్రం పేదల పరిస్థితి దిగజారుతూ పోయింది. వర్షాలు లేక కరువు తాండవం ఆడుతోంది. విద్యుత్ ఛార్జీలను తగ్గించమంటే ప్రభుత్వం పేదలను గుర్రాలతో తొక్కించి, కాల్చి చంపించింది. బతుకు దుర్భరమై, జీవితం అస్తవ్యస్తమైన దశలో వైఎస్సార్ నేనున్నానంటూ బయల్దేరారు. మండుటెండలో చేవేళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ప్రజా ప్రస్థానం పేరుతో 1475 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ అప్పటి నుంచే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయాలనే దానిపై గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు వైఎస్సార్.
సంక్షేమానికి పెద్దపీట :
అంతకుముందు రాష్ట్రం, దేశం కనివినీ ఎరుగని స్థాయిలో సంక్షేమ పాలనను అందించారు. ముఖ్యంగా జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి కార్యక్రమాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రజలకు దగ్గర చేశాయి. ఈ పథకాల అమలులో ప్రతిపక్షం నుంచి విమర్శలు ఎదురైనా , నిధుల సమస్య వచ్చినా వైఎస్ వెనకడుగు వేయలేదు. ఎందుకంటే మడమ తిప్పడం ఆయన డిక్షనరీలోనే లేదు. రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు సాగునీరు అందించేలా జలయజ్ఞం పేరుతో 84 ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టి అపర భగీరథుడిగా ఖ్యాతి గడించారు వైఎస్సార్.
పేదలకు భరోసానిచ్చిన ఆరోగ్యశ్రీ:
2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.168.52 కోట్లను అందించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈ క్రమంలోనే ఆయన ‘‘ఆరోగ్యశ్రీ’’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఓ కార్డ్ తీసుకుని రాష్ట్రంలో నచ్చిన ఆసుపత్రిలో ఉచితంగా కార్పోరేట్ వైద్యాన్ని అందుకునేలా పేదవాడికి భరోసా కల్పించారు వైఎస్. అలా ఎన్నో వేల గుండెలకు రాజశేఖర్ రెడ్డి ప్రాణం పోశారు. ఆ గుండెలు లబ్..డబ్..లబ్ డబ్ అని కాకుండా వైఎస్ఆర్.. వైఎస్ఆర్ అని కొట్టుకుంటూనే ఉన్నాయి.
ఫీజు రీయింబర్స్‌మెంట్ :
పేదరికం కారణంగా కారణంగా పిల్లలు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి వైఎస్ఆర్ శ్రీకారం చుట్టారు. ఆయన చూపిన బాటలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తరగతులకు చెందిన విద్యార్ధులు డాక్టర్, ఇంజినీర్ లాంటి ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అంతేకాదు.. జిల్లాకు ఒక యూనివర్సిటీ కాన్సెప్ట్ వైఎస్‌దే. తాడేపల్లి గూడెంలో ఉద్యానవర్సిటీ, తిరుపతిలో పశువైద్య కళాశాలను నెలకొల్పారు. ఐఐటీ హైదరాబాద్, మూడు ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేశారు.
ఉచిత విద్యుత్ :
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు వైఎస్సార్. విద్యుత్ బకాయిలు చెల్లించలేదంటూ టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేశారు. రూ.1100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. రూ.6 వేల కోట్ల విద్యుత్ సబ్సిడీలను అమలు చేశారు. పావలా వడ్డీకే రైతులకు రుణాలు అందించారు. పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధర కల్పించేందుకు వైఎస్సార్ శ్రమించారు.
ప్రజల వద్దకు వెళుతూ అనంత లోకాలకు :
2009 ఎన్నికల సమయంలో తానే స్టార్ క్యాంపెయినర్‌ని అని .. గెలుపోటములకు తనదే బాధ్యత అని రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. చెప్పినట్లుగానే రాష్ట్రంలో, కేంద్రంలో ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే అసెంబ్లీలో ప్రజలు తనకు 156 సీట్లే ఇవ్వడంతో పాస్ మార్కులే వచ్చాయని.. ఈసారి ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటానని వైఎస్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే 2009 సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయన నేలకొరిగారు. పేదరికంతో అల్లాడుతున్నప్పటికీ తనపట్ల అంతులేని ప్రేమ చూపిన ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వైఎస్ఆర్ కూడా అదే రీతిలో సంక్షేమ వరాలు కురిపించి మన కళ్ళముందే అంతర్థానమైపోయారు.
అయితే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. రాజశేఖర్ రెడ్డిని జనం గుండెల్లో వుండేలా చేస్తూ.. ఆయన జయంతిని పండగలా మార్చారు. తండ్రి ఆశయాలు , ఆలోచనలు కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు జగన్. ఆయనలో పెద్దాయను చూసుకుంటూ ప్రజలు పొంగిపోతున్నారు. ఏ లోకంలో వున్నా తెలుగు ప్రజలను వైఎస్సార్ ఆశీర్వదిస్తూనే వుంటారు. ఆ మహానేతకు నివాళులర్పిస్తూ..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments