close
Choose your channels

Chandrababu Naidu:రేపే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. చంద్రబాబు ఎత్తుగడలు, వైసీపీలో టెన్షన్

Thursday, March 23, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే. టీచర్ స్థానాల్లో వైసీపీ విజయం సాధించగా.. పట్టభద్రుల స్థానాలూ మూడు టీడీపీ ఖాతాలో పడ్డాయి. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీని టెన్షన్ పెడుతున్నాయి. అసెంబ్లీలో వున్న బలం నేపథ్యంలో 7 స్థానాలకు గాను 6 స్థానాలు వైసీపీవే అయితే 7వ స్థానంలో గెలవలేమని తెలిసినా అభ్యర్ధిని నిలబెట్టింది. తెలుగుదేశం గెలిచేందుకు టెక్నికల్‌గా 22 మంది ఎమ్మెల్యేలు సరిపోతారు కానీ.. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ మద్ధతుదారులుగా మారిపోయారు. అయినప్పటికీ పంచుమర్తి అనూరాధను చంద్రబాబు తమ అభ్యర్ధిగా నిలబెట్టారు.

అసంతృప్తులపై వైసీపీ నిఘా :

టీడీపీకి 19 ఓట్ల సొంత బలం వుంది. దీనికి అదనంగా ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఓట్లేస్తే.. 21 ఓట్లు పడతాయి. అయితే ఏ ఇద్దరు అభ్యర్ధులకైనా 22 ఓట్లు పడి ఆగిపోతే.. రెండవ ప్రాధాన్యం ఓట్లు లభిస్తాయి. కానీ టీడీపీకి ఆ ఛాన్స్ కూడా లేదు. కానీ.. ఇక్కడే చంద్రబాబు తెలివిగా ఆలోచించారు. వైసీపీ నుంచి ఒక్కరైనా సభ్యుడు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడితే మాత్రం టీడీపీదే విజయం. ఇదే ఇప్పుడు వైసీపీని భయపెడుతోంది. ఈ క్రమంలోనే అసంతృప్తులుగా వున్న వారి జాబితాను రూపొందించింది. ప్రత్యేకంగా నిఘా పెట్టింది. రేపు పోలింగ్ నేపథ్యంలో బుధవారం రాత్రి ఎమ్మెల్యేలందరికీ విందును ఏర్పాటు చేయడంతో పాటు మాక్ పోలింగ్‌ను కూడా నిర్వహిస్తోంది.

క్రాస్ ఓటింగ్‌పై టీడీపీ ఆశలు:

ఇప్పటికే అధికార పార్టీ 3 సార్లు మాక్ పోలింగ్ నిర్వహించగా.. 156 మంది ఎమ్మెల్యేల్లో (151 వైసీపీ, నలుగురు టీడీపీ రెబల్, ఒక జనసేన అభ్యర్ధి) 132 మంది హాజరుకాలేదు. దీనికి తోడు వారిలోనూ నలుగురు ఓట్లు చెల్లనివిగా నమోదు కావడంతో అధికార పార్టీని టెన్షన్‌కు గురిచేస్తోంది. అటు తెలుగుదేశం తమ పార్టీలో వున్న 19 మంది ఎమ్మెల్యేలు తప్పులు చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేయాలంటూ టీడీపీ పిలుపునివ్వగా.. కొందరైనా వైసీపీ సభ్యులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతారని విపక్ష నేతలు భావిస్తున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుండగా.. సాయంత్రానికి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ ఉత్కంఠ నెలకొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.