తండ్రి బాటలో షర్మిల.. అక్టోబర్‌లో చేవెళ్ల నుంచి మరో ‘ప్రజా ప్రస్థానం’

  • IndiaGlitz, [Monday,September 20 2021]

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ రాజకీయ పార్టీ పెట్టిన వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆ మేరకు గట్టి సంకల్పంతో పనిచేస్తున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్షలు చేపడుతున్నారు. అలాగే రైతులు, ఇతర వర్గాల సమస్యలపైనా స్పందిస్తున్నారు. ఇటీవల సైదాబాద్‌లో అత్యాచారానిక గురైన చిన్నారికి న్యాయం చేయాలంటూ దీక్షకు దిగి కలకలం రేపారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పార్టీ నిర్మాణాలను పటిష్టం చేసుకునేందుకు షర్మిల కసరత్తు ప్రారంభించారు. ఇలాంటి సమయంలో వైఎస్సార్‌టీపీకి చెందిన పలువురు రాజీనామాలు చేస్తున్నారు. అటు రెడ్డి వర్గంపై ఆశలు పెట్టుకున్న షర్మిలకు రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ షాకిచ్చింది. ఈ నేపథ్యంలో తండ్రి చూపిన బాటలో పాదయాత్ర నిర్వహించాలని షర్మిల డిసైడ్ అయ్యారు.

ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టనున్నట్లు షర్మిల అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్‌ 20వ తేదీ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ఆమె చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుందని షర్మిల వెల్లడించారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్‌గా భావించే చేవెళ్లలోనే పాదయాత్రను ప్రారంభించి చేవెళ్లలోనే ముగించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. రోజుకు 12 నుంచి 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు షర్మిల వెల్లడించారు. అలాగే తాను ప్రతి మంగళవారం చేపడుతున్న నిరాహార దీక్షను పాదయాత్రలోనే కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యే వరకు పాదయాత్ర కొనసాగిస్తామన్నారు. పాదయాత్రకు వైఎస్‌ఆర్‌ బ్రాండ్ అంబాసిడర్‌ అని.. ఆయన ఆశయాలు సాధించేందుకే పాదయాత్ర చేయాలని సంకల్పించినట్లు షర్మిల తెలిపారు.