Download App

Yuddham Sharanam Review

కెరీర్ ప్రారంభంలో ఏ మాయ చేసావేతో హిట్ కొట్టి ల‌వ‌ర్‌బోయ్ ఇమేజ్ సంపాదించుకున్నారు నాగ‌చైతన్య. త‌రువాత మాస్ ఇమేజ్ కోసం చైతు చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా స‌క్సెస్ కాకపోవ‌డంతో చైతు ల‌వ్ అండ్ ఫ్యామిలీ కంటెంట్ ఉన్న స‌బ్జెక్ట్స్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తూ వ‌చ్చారు. అయితే స్నేహితుడు ద‌ర్శ‌కుడిగా మార‌డ‌మో, లేక కంటెంట్ న‌చ్చ‌డ‌మో ఏమో తెలియ‌దు కానీ, నాగ‌చైత‌న్య యుద్ధం శ‌ర‌ణం సినిమా చేశాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాలో సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ విల‌న్‌గా చేయ‌డం స్పెష‌ల్‌. మ‌రి ఈ సినిమాతో చైత‌న్య ఎలా ఆక్టుకున్నాడో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం

క‌థ‌:

బాగా చ‌దువుకున్న కుర్రాడు అర్జున్‌ (చెయ్ అక్కినేని). వేల‌కు వేలు వ‌చ్చే ఉద్యోగాన్ని వ‌దిలిపెట్టి త‌న అభిరుచి మేర‌కు డ్రోన్ డిజైనింగ్ ప‌నిని చేస్తుంటాడు. అత‌ని త‌ల్లిదండ్ర‌లు (రావు ర‌మేశ్‌, రేవ‌తి)వైద్యులు. త‌న త‌ల్లి ద‌గ్గ‌ర ఇంట‌ర్న్ షిప్ చేయ‌డానికి వ‌స్తుంది ఫ్యామిలీ ఫ్రెండ్ కుమార్తె అంజ‌లి (లావ‌ణ్య త్రిపాఠి). ఆమెను చూడ‌గానే ప్రేమిస్తాడు అర్జున్‌. అంజ‌లి కూడా అత‌ని ప్రేమ‌కు స‌మ్మ‌తిస్తుంది. అప్ప‌ర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో త‌న‌కు స్థానం దొరికినందుకు సంబ‌ర‌ప‌డుతుంది. అర్జున్ త‌న త‌ల్లిదండ్రుల‌కు 30వ పెళ్లిరోజును నిర్వ‌హిస్తాడు. ఆ ఆనందంలో ఉన్న దంప‌తులు గుడికి వెళ్తారు. కానీ తిరిగి రారు. వారికి ఏమైంద‌ని టెన్ష‌న్ ప‌డుతున్న అర్జున్‌కి వారి గురించి తెలుస్తుంది. వారితో పాటు నాయ‌క్ గురించి, జోగి గురించిన వివ‌రాలు తెలియ‌సాగుతాయి.. త‌న‌కు కూడా తెలియ‌కుండా, త‌న త‌ల్లిదండ్రుల‌తో సంబంధం ఉన్న ఆ వ్య‌క్తులు ఎవ‌ర‌ని అర్జున్ ఆరా తీస్తాడు. అత‌ని అన్వేష‌ణ ఫ‌లిత‌మే ఈ సినిమా.

ప్ల‌స్ పాయింట్స్:

సినిమాలో చాలా మంది సీనియ‌ర్ ఆర్టిస్టులు క‌నిపిస్తారు. ఇటీవ‌ల `లోఫ‌ర్‌`లో న‌టించిన రేవ‌తి ఇందులో త‌ల్లి పాత్ర‌లో బాగా చేసింది. ఒక‌ర‌కంగా జ‌య‌సుధ ఇంత‌కు పూర్వం చేసిన పాత్ర‌ల త‌ర‌హా పాత్ర ఆమెది. శ్రీకాంత్ నెగ‌టివ్ షేడ్స్ లో మెప్పించాడు. అత‌ని లుక్స్, న‌ట‌న‌.. ఆయ‌న కెరీర్ తొలినాళ్ల‌లో విల‌న్‌గా చేసిన పాత్ర‌ల‌క‌న్నా పరిపుష్టిని తీసుకొచ్చాయి. అప్ప‌ర్ మిడిల్ క్లాస్ కుర్రాడిలాగా, బాధ్య‌త ఎరిగిన యువ‌కుడిలాగా చెయ్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. అక్క‌డ‌క్క‌డా డైలాగులు మ‌న‌సుకు హ‌త్తుకుంటాయి. ముర‌ళీశ‌ర్మ ఈ సినిమాలో కొత్త‌గా క‌నిపించారు. లావ‌ణ్య త్రిపాఠి డాక్ట‌ర్‌గా న‌టించ‌డం ఇదేం కొత్త కాదు. నేప‌థ్య సంగీతం బావుంది. యాక్ష‌న్ సీక్వెన్స్ రియాల్టీకి ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి.

నెగ‌టివ్ పాయింట్స్:

క‌థ‌లో ఏ మాత్రం కొత్త‌ద‌నం లేదు. క‌థ‌నం కూడా పేల‌వంగానే సాగింది. స‌మాజానికి మంచి చేయాల‌నుకునేవారికి ఎక్క‌డో ఓ చోట దుండ‌గుల‌తో ముప్పు ఉంటుంది. వారి చేతులో మంచివారు హ‌త‌మ‌వుతారు. వాళ్ల వార‌సుడు దుష్టుల‌పై ప‌గ సాధించుకుంటాడ‌నే కాన్సెప్ట్ తో ఇప్ప‌టికే చాలా సినిమాలు వ‌చ్చాయి. `యుద్ధం శ‌ర‌ణం` కూడా ఫ‌క్తు అలాంటి సినిమానే. ఎక్క‌డా కొత్త‌ద‌నం క‌నిపించ‌దు. ప్రియ‌ద‌ర్శి లాంటి న‌టుడు ఉన్నా కామెడీ శూన్యం. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ వ‌ల్ల పెద్ద‌గా ఒరిగిన విష‌యాలేమీ క‌నిపించ‌వు. పాట‌లు విన‌సొంపుగా లేవు. మ‌ళ్లీ మ‌ళ్లీ పాడుకునే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌.

విశ్లేష‌ణ‌:

ఈ సినిమాకు యంగ్ టీమ్ ప‌నిచేసింది. ఇందులో డ్రోన్‌మేక‌ర్ అనే కాన్సెప్ట్ కొత్త‌గా ఉంది. అప్పుడెప్పుడో విల‌న్‌గా చూసిన శ్రీకాంత్‌ని ఇందులో విల‌న్‌గా చూడ‌టం కూడా బావుంది. స‌మాజం కోసం శ్ర‌మించే దంప‌తులుగా, మంచి కుటుంబ రూప‌క‌ల్ప‌న‌లో భాగ‌స్వామ్యులైన క‌పుల్‌గా రావు ర‌మేశ్‌, రేవ‌తి చ‌క్క‌గా న‌టించారు. నాగ‌చైత‌న్య బావ‌గారి పాత్ర‌లో న‌టించిన న‌టుడితో పాటు, చైతు సిస్ట‌ర్స్ పాత్ర‌ల్లో న‌టించిన ఇద్ద‌రమ్మాయిలు వారి వారి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. కానీ రాజ‌కీయ‌నాయ‌కుడిగా న‌టించిన వినోద్‌కుమార్‌కి ఇందులో స‌రైన పాత్ర ద‌క్క‌లేదు. అంత హోదా ఉండి, బాంబ్ బ్లాస్ట్ ల‌ను పుర‌మాయించ‌గ‌ల స్థాయిలో ఉన్న నాయ‌కుడిలో ఉండాల్సిన ప‌వ‌ర్ ఆ పాత్ర‌లో క‌నిపించ‌దు. శ్రీకాంత్ న‌ట‌న బావున్న‌ప్ప‌టికీ పాత్ర ఎలివేష‌న్ మాత్రం స‌రిగా లేదు. అత‌ని కింద ప‌నిచేసిన జోగి పాత్ర‌ధారి న‌ట‌న బావుంది. మొత్తంగా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాను అభివ‌ర్ణించిన‌ప్ప‌టికీ రెగ్యుల‌ర్ ఫార్మాట్‌లోనే సాగింది. ఫ‌స్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ తేలిపోయింది.

బాట‌మ్ లైన్‌:  యువ‌కుడి ప‌గే 'యుద్ధం శ‌ర‌ణం'

'Yuddham Sharanam' Review in English

 

Rating : 2.3 / 5.0