డ్రోన్‌లతో ‘జొమాటో’ ఫుడ్‌ డెలివరీ

  • IndiaGlitz, [Thursday,June 13 2019]

ఇప్పుడు ఆహారం కావాలంటే హోటళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ మొబైల్‌లో యాప్స్ ఉంటే చాలు.. మీరు ఎక్కడుంటే అక్కడికి ఆహారం వచ్చేస్తోంది. దీంతో జొమాటో, స్విగ్గీ, ఉబెర్ ఈట్స్, ఫుడ్ పాండా వంటి ఫుడ్‌ డెలివరీ యాప్స్‌కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. వీటన్నింటిలో ‘జొమాటో’ ఫుడ్ యాప్ మిగతా వాటితో పోలిస్తే బాగా క్లిక్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అయితే రోజు రోజుకు బిజినెస్ పెంచేసేందుకు యత్నిస్తున్న జొమాటో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి టీని డ్రోన్ సాయంతో ఫుడ్ డెలివరీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అంటే.. మీకిష్టమైన ఆహారాన్ని ఆర్డరిస్తే చాలు... క్షణాల్లో డ్రోన్ మీరు కోరిన ఆహారాన్ని క్షణాల్లో డెలివరీ చేయనుందన్న మాట.

ఈ డ్రోన్ డెలివరీకి సంబంధించిన పరీక్ష నిర్వహించి జొమాటో విజయవంతమైంది. ఈ సందర్భంగా జొమాటో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. హైబ్రీడ్ డ్రోన్ సాయంతో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రయాణికుడికి 10 నిమిషాల్లో ఆహారాన్ని అందించే పరీక్ష విజయవంతమైందన్నారు. ఆ డ్రోను గంటకు 80 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించిందని.. ఆకాశ మార్గం ద్వారా చాలా త్వరగా ఫుడ్ డెలివరీ చేయడమే కాకుండా సమయాన్ని కూడా సగానికి తగ్గించవచ్చని చెప్పుకొచ్చారు. వినియోగదారులకు తక్షణమే ఫుడ్ డెలివరీ చేసేందుకు సుస్థిరమైన, సురక్షితమైన టెక్నాలజీ దిశగా పనిచేస్తున్నామని ప్రతినిధులు తెలిపారు. కాగా.. డ్రోన్ ద్వారా ఆహారాన్ని అందించే ప్రయోగాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆమోదం పొందిన ఒక రిమోట్ సైట్ ప్రాంతంలో చేశామని జొమాటో ప్రతినిధులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే జొమాటో చేస్తున్న ఈ సరికొత్త డ్రోన్ డెలివరీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.