జగన్‌ను కలిసిన ఆటా ప్రతినిధులు.. తెలుగు మహాసభలకు రావాలంటూ ఆహ్వానం
- IndiaGlitz, [Sunday,May 01 2022]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ప్రతినిధులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జులై 1 నుంచి 3 వరకు జరగనున్న 17వ ఆటా తెలుగు మహా సభలకు హాజరుకావాల్సిందిగా వారు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. జగన్‌ని కలిసిన వారిలో ఆటా ప్రెసిడెంట్ భువనేష్ బూజల, ఆటా సెక్రటరీ, నార్త్ అమెరికాలో ఏపీ ప్రభుత్వ సలహాదారు హరిప్రసాదరెడ్డి లింగాల, ఆటా ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ సన్నీరెడ్డి, ఆటా అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ జయంత్ చల్లా ఉన్నారు.
కాగా.. వాషింగ్టన్ డీసీలో జరగబోయే ఆటా తెలుగు మహాసభలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా వైరస్ అదుపులోకి రావడంతో ఈసారి తెలుగు మహాసభలను భారీఎత్తున నిర్వహించాలని ఆటా నిర్వాహక కమిటీ నిర్ణయించింది. ఈ సభలకు 10 వేల మందికి పైగా హాజరవుతారని ఆటా ప్రెసిడెంట్ భువనేష్ బూజల మీడియాకు తెలిపారు. సభల నిర్వహణకు సంబంధించి 65 కమిటీలను కూడా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఇందులో దాదాపు 350 మందిని సభ్యులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు. వీరంతా ఆటా తెలుగు మహాసభలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తారని భువనేష్ వెల్లడించారు.
మరోవైపు ఆటా మహాసభల్లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా ఆహ్వానించారు నిర్వాహకులు. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఈ మేరకు ఎర్రబెల్లికి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ.. ఆటా సభలకు తాను గతంలోనూ వెళ్ళానని గుర్తుచేసుకున్నారు. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళంతా పండుగగా నిర్వహించుకునే ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయని మంత్రి చెప్పారు. ఆటా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. తాను తప్పక హాజరవుతానని హామీ ఇచ్చారు.