Download App

Antariksham Review

‘ఘాజీ’ సినిమా చూసిన వారికి ఎవరికైనా సంకల్ప్‌రెడ్డి నాడి ఇట్టే తెలిసిపోతుంది. ఎక్కడా పనిచేసిన అనుభవం లేకుండా, కొత్త దర్శకుడు ఆ సినిమాను తీశాడంటే నమ్మశక్యం కాదు. ఆ సినిమా విడుదలై, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తర్వాత ఆయన రెండో సినిమా ‘అంతరిక్షం’ మీద అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులు ఆశించిన స్థాయిని సంకల్ప్‌రెడ్డి అందుకున్నారా? లేదా? అనేది తెలుసుకోవాలంటే ఆలస్యమెందుకు చదివేయండి..

కథ:

భారతదేశం సగర్వంగా లాంచ్ చేసిన శాటిలైట్‌ మహిరా మిస్‌ అవుతుంది. అది కనుక పూర్తిగా సంబంధాన్ని తెగిపోతే కమ్యూనికేషన్ వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుందనే విషయం అర్థమవుతుంది. ఎలాగైనా అది కాకుండా కాపాడాలని ఇండియన్ స్పేస్‌ సెంటర్ పనిచేసే సైంటిస్టులు (‘రెహమాన్, అదితిరావు హైదరి, శ్రీనివాస్‌ అవసరాల, రాజా చేంబోలు, సత్యదేవ్‌) ప్రయత్నిస్తుంటారు. కానీ అది నిరర్థకం అవుతుంది. అలాంటి సమయంలో వారు దేవ్‌ (వరుణ్‌తేజ్‌)ను సంప్రదిస్తారు. అతను అంతకు ముందు ఆ ప్రాజెక్ట్‌లో పనిచేసిన వాడే. అతను ఓ ఆలోచనతో ముందుకు సాగుతాడు. ఆ ఆలోచన ఏంటి? దానికి మిగిలిన వాళ్లు అందించిన తోడ్పాటు ఏంటి? ప్రాణాలకు కూడా తెగించి, యువ సైంటిస్టులు చేసే ప్రయోగాలు ఎలా ఉంటాయి? అవి నిజంగా జరుగుతాయా? జరిగితే ఎలా ఉంటాయి? వంటివన్నీ ఆసక్తికరం.

సమీక్ష:

సంకల్ప్‌రెడ్డి ఎంపిక చేసుకున్న నేపథ్యం బావుంది. కిట్టు విస్సాప్రగడ రాసిన కొన్ని డైలాగులు, అడిషనల్‌ స్ర్కీనప్లే మెప్పిస్తాయి. తొలిసగం సినిమా చాలా ప్యాక్డ్‌గా, మనసును తాకేలా ఉంది. దేవ్‌, రియా మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వాళ్ల మధ్య సంభాషణలు కూడా మెప్పిస్తాయి. స్పేస్‌ సెంటర్‌ ప్యాక్‌ సన్నివేశం మెప్పిస్తుంది. లావణ్య త్రిపాఠి టీచర్‌గా స్పేస్‌ సెంటర్‌కు పిల్లలను ఇండస్ట్రియల్‌ టూర్‌కు తీసుకొచ్చే సన్నివేశాలు, వరుణ్‌తేజ్‌ పిల్లలకు శాటిలైట్‌ గురించి చెప్పే అంశాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రశాంత విహారి నేపథ్య సంగీతం మెస్మరైజింగ్‌గా ఉంటుంది. సమయమా పాట వినేకొద్దీ వినాలనిపిస్తుంది. రామకృష్ణ, మోనిక చేసిన ఆర్ట్‌ వర్క్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా కావాల్సిందే. జ్ఞానశేఖర్‌ సినిమాటోగ్రఫీ గురించి కూడా తప్పకుండా మాట్లాడుకుంటారు. ఈ నిర్మాతలు పెట్టిన డబ్బుకు వీఎఫ్‌ఎక్స్‌ చాలా బాగా వచ్చాయనే చెప్పాలి. ఈ బడ్జెట్‌లో వీఎఫ్‌ఎక్స్‌ అంత బాగా రావడాన్ని మెచ్చుకోవాలి. కాకపోతే అక్కడక్కడా ఇంకాస్త బావుంటే ఇంకా బావుండేదేమో. ఇందులో జీరో గ్రావిటీ షాట్స్‌ అంత ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉండవు. మొత్తం స్పేస్‌ చుట్టూ తిరిగే ఈ సినిమాలో కాసింత ఓదార్పు కలిగించే విషయం ఫ్యామిలీ మెలోడ్రామా. వరుణ్‌తేజ్‌ తన వంతు నటనను కనబరిచారు. లుక్‌ పరంగానూ, ఎమోషన్స్ పరంగానూ తన పాత్రకు తగ్గట్టు చేశారు. అదితి తనవంతు ప్రతిభను కనబరిచింది. రెహమాన్, అవసరాల, లావణ్య, రాజా, సత్యదేవ్‌ తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు.

‘అంతరిక్షం’ ఫస్ట్‌ హాఫ్‌ చాలా బావుంది. సెకండాఫ్‌ మాత్రం అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. దర్శకుడు కథ చెప్పడంలో తన వంతు  కృతకృత్యుడయ్యాడు. అంతేగానీ ఉత్కంఠభరితమైన సన్నివేశాల కోసం సెకండాఫ్‌లో చివరి అరగంట ఎదురుచూడకూడదు. సాంకేతికంగా గొప్ప సినిమాగా నిలుస్తుంది. ప్రధాన తారాగణం నటన సినిమాకు హైలైట్‌ అవుతుంది. డైలాగులు బావున్నాయి.

చివరిగా: కొత్త అనుభూతి కోసం 'అంతరిక్షం'

Read 'Antariksham' Review in English

Rating : 3.0 / 5.0