మందు బాబులకు జగన్ సర్కార్ భారీ షాక్
- IndiaGlitz, [Monday,May 04 2020]
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ పొడిగించిన కేంద్రం ప్రభుత్వం.. తాజాగా మరోసారి 3.0 పేరుతో మే-17వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ మూడోసారి మాత్రం కొన్నింటికి సడలింపులు ఇచ్చింది. అందులో మద్యం షాపులు ఓపెనింగ్‌కు కూడా సడలింపు ఉంది. అయితే కొన్ని కండిషన్స్ ప్రకారం ఓపెనింగ్ చేసుకోవచ్చని తేల్చిచెప్పింది. ఇలాంటి తరుణంలో ఏపీలో కూడా మద్యం షాపులు తెరుచుకుంటాయని రాష్ట్రంలోని మందు బాబులు తెగ ఆనందపడిపోయారు. ఈ క్రమంలో మద్యం నియంత్రణ దిశగా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇదీ అసలు విషయం..!
దీంతో మందు బాబుల్లోని ఆ ఆనందం, ఆ ఉత్సాహం మొత్తం ఆవిరైపోయింది. ఊహించని విధంగా జగన్ సర్కార్ షాకిచ్చింది. 25 శాతం మద్యం ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పెంచిన ధరలతోనే అమ్మకాలు ఉంటాయని ప్రభుత్వం తేల్చిచెప్పేసింది. కరోనా కష్టకాలంలోనూ ముందుగా అనుకున్న.. చెప్పిన మాట ప్రకారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులేస్తున్నారు. మద్యాన్ని నియంత్రించడం, రద్దీని తగ్గించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. అంతేకాదు.. ఇవన్నీ ఒకఎత్తయితే ఇప్పటి వరకూ ఉన్న మద్యం దుకాణాల సంఖ్యను మరింత తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా కేంద్రం చెప్పిన నిబంధనలన్నీ ఏపీలో కూడా వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. దశలవారీగా రాష్ట్రంలో మద్యం నియంత్రిస్తానని పాదయాత్రలోనే జగన్ చెప్పారు.. ఆ దిశగా ఇప్పటికే అడుగులేస్తున్నారు.
గవర్నమైంట్ గైడ్‌లైన్స్ ఇవీ..
ఏపీఎస్పీడీసీఎల్ రిటైల్ షాపులు రేపటి నుండి ఓపెన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసింది. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లిక్కర్ షాప్‌లు ఓపెన్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాప్‌లు తెరిచి ఉంచాలని నిర్ణయించింది.
- కంటైన్మెంట్ జోన్లు, క్లస్టర్స్‌లో మాత్రమే షాపులు ఓపెన్ కావు
- అమ్మకందారు కచ్చితంగా మాస్కు ధరించాలి.. మద్యం షాపుల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి
- ఒకే సమయంలో ఐదుగురు కస్టమర్లను మించి అనుమతించకూడదు
- షాపుల ముందు ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాల్సిందే
- ఇందుకు గాను ప్రతి మద్యం షాపు ముందు ఐదు సర్కిల్ ఏర్పాటు చేసి ఆరు అడుగుల దూరం వాటిమధ్య ఉండేలా చూడాల్సి ఉంటుంది
- షాపులు కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలి
- మద్యం షాపుల్లో అవసరమైతే లోకల్‌గా ఉన్న పోలీస్ సిబ్బందిని భద్రత కోసం ఉపయోగించుకోవచ్చు
- నియమాలకు విరుద్ధంగా ఒకే షాపు వద్ద ఎక్కువ మంది గుమిగూడితే తక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
- అలా జరిగితే తాత్కాలికంగా షాపు మూసివేసి రద్దీ తగ్గాక తిరిగి తెరవాలి.
- అవసరమైతే లిక్కర్ షాప్ ముందు భౌతిక దూరాన్ని పాటించేందుకు వార్డు విలేజ్ వాలంటీర్ల సేవలను కలెక్టర్లు ఉపయోగించుకోవచ్చు అని గైడ్ లైన్స్‌లో నిశితంగా పేర్కొంది.