close
Choose your channels

Bhaagamathie Review

Review by IndiaGlitz [ Friday, January 26, 2018 • తెలుగు ]
Bhaagamathie Review
Banner:
UV Creations
Cast:
Anushka Shetty, Asha Sharath, Murali Sharma, Dhanraj, Prabhas Srinu, Vidyullekha Raman, Deva Darshan, Talaivasal Vijay, Ajay Ghosh and Madhu Nandan
Direction:
G Ashok
Production:
Pramod and Vamshi
Music:
SS Thaman

Bhaagmathie Movie Review

అనుష్క‌... ఈ పేరు విన్న తెలుగు ప్రేక్ష‌కుల‌కు గుర్తుకు వచ్చే సినిమాలు అరుంధ‌తి, రుద్ర‌మదేవి, బాహుబ‌లిలో దేవ‌సేన పాత్ర‌.  ప్ర‌స్తుతం ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు హీరోయిన్ ఓరియెంటెడ్ స‌బ్జెక్ట్స్ అంటే అనుష్క‌నే గుర్తుకు వ‌స్తుంది. అందుక‌ని ద‌ర్శ‌కుడు అశోక్ భాగ‌మ‌తి అనే క‌థ‌ను రాసుకుని అందులో అనుష్క‌తో టైటిల్ పాత్ర‌లో సినిమాను చేశాడు. అనుష్క‌...భాగ‌మ‌తి అనే టైటిల్స్ విన‌గానే ప్రేక్ష‌కులు సినిమా ఎలా ఉంటుందోన‌ని అంచ‌నాలు వేసుకున్నారు. అందుకు త‌గిన విధంగా సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఈ అంచ‌నాల‌ను రెట్టింపు చేశాయి. ఇది భాగ‌మ‌తి అడ్దా.. లెక్క‌ల్ తేలాల్సిందే అంటూ అనుష్క చెప్పిన డైలాగ్ అరుంధ‌తి సినిమాను గుర్తుకు తెచ్చింది. దాంతో ప్రేక్ష‌కులు భాగ‌మ‌తి సినిమా మ‌రో అరుంధ‌తిలా ఉంటుందేమోన‌ని కూడా ఊహించారు. మ‌రి నిజంగానే భాగ‌మ‌తి అరుంధ‌తిలా అల‌రించిందా?  లేక చ‌ప్ప‌గా నిరుత్సాహ పరిచిందా? అని తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థః:

చంచ‌ల (అనుష్క‌) ఐఏయ‌స్ ఆఫీస‌ర్‌. భారీ నీటిపారుద‌ల శాఖామంత్రి ఈశ్వ‌ర‌ప్ర‌సాద్ (జ‌య‌రామ్‌) ద‌గ్గ‌ర ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీగా ఆమెది ద‌శాబ్ద‌కాల అనుభ‌వం. ఆ శాఖ చేసిన ప్ర‌ణాళిక ప్ర‌కారం సాగునీటిని వృద్ధి చేయ‌డానికి ఓ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడుతుంది. దానికి ఆథరైజ్డ్ అధికారి చంచ‌ల‌. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప‌నుల్లో ఉండ‌గానే ఆమెకు శ‌క్తి (ఉన్ని ముకుంద‌న్‌) ప‌రిచ‌య‌మ‌వుతాడు. ఇద్ద‌రూ పెళ్లి పీట‌ల వ‌ర‌కు వెళ్తారు. అయితే చంచ‌ల అత‌న్ని చంపేసిన నేరానికి జైలుకు వెళ్తుంది. ప్రాణంగా ప్రేమించిన వ్య‌క్తిని చంచ‌ల ఎందుకు చంపేసింది? ప‌దేళ్ల పాటు పీయ‌స్‌గా చేసిన చంచ‌ల భాగ‌మ‌తి బంగ్లాకు ఎందుకు వెళ్లింది? అక్క‌డ ఆమె ఈశ్వ‌ర‌ప్ర‌సాద్ గురించి సీబీఐతో చెప్పిన అంశాలేంటి?  భాగ‌మ‌తికి, చంచ‌ల‌కు ఉన్న అనుబంధం ఎలాంటిది? అనేది ఆస‌క్తిక‌రం.

ప్ల‌స్ పాయంట్స్:

భాగ‌మ‌తి అనే టైటిలే సినిమా మీద హైప్ పెంచింది. దానికి తోడు లెక్క తేలాల్సిందే.., అనుకున్న‌ప్పుడు రావ‌డానికి, వ‌ద్ద‌నుకున్న‌ప్పుడు వెళ్ల‌డానికి ఇదేవ‌న్నా ప‌శువుల దొడ్డా..? ఇది భాగ‌మ‌తి అడ్డా అని అనుష్క ప‌లికే డైలాగులు సినిమా మీద అంచ‌నాల‌ను పెంచాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే సినిమాలోనూ భాగ‌మ‌తిగా అనుష్క రాజ‌సాన్ని ప‌లికించింది. చంచ‌ల‌గానూ ఐఏయ‌స్ ఆఫీస‌ర్‌గా హుందాత‌నాన్ని చూపించింది. జ‌య‌రామ్, ఉన్ని ముకుంద‌న్‌, ఆశా శ‌ర‌త్‌, త‌లైవాస‌ల్ విజ‌య్‌, ముర‌ళీ శ‌ర్మ, ధ‌న్‌రాజ్‌, ప్ర‌భాస్ శీనుతో పాటు అంద‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో బాగా న‌టించారు. త‌మ‌న్ సంగీతం మెప్పించింది. ర‌వీంద‌ర్ వేసి భాగ‌మ‌తి సెట్ బావుంది. పాత చిత్రాల్లోని సెట్స్ ని గుర్తు చేసింది. కెమెరామెన్ మ‌ది ప‌నిత‌నాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇంట‌ర్వెల్ సీక్వెన్స్, సెకండాఫ్‌లో జ‌య‌రామ్ వెళ్లి ఆసుప‌త్రిలో చంచ‌ల‌ను క‌లిసే స‌న్నివేశాలు క‌థ‌లో ట్విస్ట్ లాగా అనిపిస్తాయి. ఉన్న‌ది ఒక్క పాటే అయినా తెర‌మీద చూసినంత సేపు బావుంది. రాజ‌కీయ నాయ‌కుల ద‌గ్గ‌ర ప‌నిచేసే ఐఏయ‌స్ అధికారుల ప‌రిస్థితి క‌త్తిమీద సాములాగా ఉంటుంద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. క‌థ‌ను  చూస్తున్నంత సేపు  జైలుకెళ్లిన ఐఏయ‌స్ అధికారి శ్రీల‌క్ష్మి ప్రేక్ష‌కుల‌కు గుర్తుకొస్తారు. అయితే నిజంగా ఐఏయ‌స్‌లు త‌ల‌చుకుంటే మంత్రుల ఆగ‌డాల‌ను తెలివిగా సీబీఐ చేతుల్లో పెట్ట‌గ‌ల‌ర‌నే అంశాన్ని క‌థ‌లో చ‌క్క‌గా పొందుప‌ర‌చ‌డం అభినందనీయం.

మైన‌స్ పాయింట్స్:

`భాగ‌మ‌తి` అనే టైటిల్ సినిమాకు ఎంత ప్ల‌స్ అయిందో, అంతా మైన‌స్ కూడా అయింది. ఆ టైటిల్ విన్న ప్ర‌తి ఒక్క‌రూ ఇది భాగ‌మ‌తి క‌థ అనుకుని థియేట‌ర్లకు వెళ్తారు. కానీ భాగ‌మ‌తి బంగ్లాకు ఉన్నంత ప్రాముఖ్య‌త సినిమాలో భాగ‌మ‌తి పాత్ర‌కు ఉండ‌దు. ఉన్న ఒక‌టీ , రెండు స‌న్నివేశాలు కూడా భాగ‌మ‌తి క‌థ‌ను చ‌దివి ఆమెలా చంచ‌ల ప్ర‌వ‌ర్తిస్తుందేమోనని అనిపిస్తుంది. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే చంద్ర‌ముఖిలో జ్యోతిక ప‌రిస్థితి అన్న‌మాట‌. అలాగే స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా అన్నా స‌రే.. స్క్రీన్‌ప్లే ఎక్క‌డా కొత్త‌గా క‌నిపించ‌దు. విజ‌య్ సేతుప‌తి న‌టించిన పిజ్జా చిత్రంలో ఇదే త‌ర‌హా స్క్రీన్‌ప్లే ఉంటుంది. కాక‌పోతే అక్క‌డ హీరో, హీరోయిన్లు నెగ‌టివ్ పాత్ర‌ల్లోనే మిగిలిపోతారు. ఇక్క‌డ నాయిక‌ను పాజిటివ్‌గా మ‌ల‌చి, దానికి ఓ సోష‌ల్ కాజ్‌ను కూడా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. బంగ్లా సెట్ బావుంది. కాక‌పోతే ఆ సెట్ అందాన్ని చీక‌ట్లోనూ, దుమ్ముతోనూ కాకుండా భాగ‌మ‌తి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ల‌లో అందంగా చూపించే ప్ర‌య‌త్నం కొన్ని స‌న్నివేశాల్లో చూపించినా ఇంకా ఇంపాక్ట్ ఉండేది. `అరుంధ‌తి` చిత్రానికి, ఈ సినిమాకు ఉన్న ముఖ్య‌మైన తేడా అదే. హార‌ర్ చిత్రాల విజ‌యంలో భ‌య‌పెట్టే రీరికార్డింగ్‌ది ఎంత కీల‌క‌మైన పాత్రో, క‌డుపుబ్బ న‌వ్వులు తెప్పించే కామెడీది అంత‌కు మించిన పాత్ర‌. `భాగ‌మ‌తి`లో న‌వ్వులు తెప్పించే స‌న్నివేశాలు చాలా త‌క్కువ‌. మ‌ల్టీలింగ్వుల్ ప్రాజెక్ట్ గా విడుద‌ల చేయాల‌నే ఉద్దేశంతో నిర్మాత‌లు ప‌ర‌భాషా న‌టుల‌ను ఎంపిక చేసుకున్న‌ప్ప‌టికీ, నేటివిటీ మిస్ అయిన ఫీలింగ్ తెలుగువారికి త‌ప్ప‌క క‌లుగుతుంది.

విశ్లేష‌ణ‌:

తెలుగులో మ‌హిళా ప్ర‌ధాన‌మైన సినిమాలంటే మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ప్ర‌స్తుతం ఉన్న ఏకైక ఆధారం అనుష్క‌నే. అందుకు కార‌ణం ఆమె న‌టించిన అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లిలో దేవ‌సే పాత్ర‌ల‌కు వ‌చ్చిన ఆద‌ర‌ణ‌. ఆ పాత్ర‌ల్లో అనుష్క న‌ట‌న‌.  నిజాం ప్ర‌భువు ప్రేయ‌సి భాగ‌మ‌తి పేరుపైనే హైద‌రాబాద్‌ను భాగ్య‌న‌గ‌రం అని పిలిచేవారు. అందుక‌ని ద‌ర్శ‌కుడు భాగ‌మ‌తి అనే టైటిల్ పెట్ట‌డంతో ఇదేదో చారిత్రాత్మ‌క సినిమా అనుకున్నారు. కానీ ద‌ర్శ‌కుడు అశోక్ ప్ర‌స్తుతం స‌మాజంలో రాజ‌కీయ నాయ‌కుల మ‌న‌స్త‌త్వం, ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉంటుంది. అటువంటి ఓ వ్య‌క్తి వ‌ల్ల న‌ష్ట‌పోయిన ఓ అధికారిణి ఎలా ప్ర‌తీకారం తీర్చుకుంద‌నే అంశాల క‌ల‌యితో ఈ భాగ‌మ‌తి క‌థ‌ను త‌యారు చేసుకున్నాడు. ద‌ర్శ‌కుడు త‌యారు చేసుకున్న క‌థ‌లో ప్ర‌స్తుత పాత్ర‌కు, క‌ల్పిత పాత్ర‌కు అనుష్క త‌న‌దైన న‌ట‌న‌తో ప్రాణం పోసింది. ఐపీఎస్ ఆఫీస‌ర్ చంచ‌ల‌, రాణీ భాగ‌మ‌తి అనే రెండు షేడ్స్‌లో అనుష్క న‌ట‌న మెప్పించింది. ముఖ్యంగా బంగ‌ళాలో భాగ‌మ‌తి గెట‌ప్‌లో అనుష్క రెండు, మూడు సీన్స్‌లో న‌టించింది. ఈ స‌న్నివేశాల్లో అనుష్క న‌ట‌న సింప్లీ సూప‌ర్బ్‌. అందుకు త‌గిన విధంగా త‌మ‌న్ నేప‌థ్య సంగీతం, మ‌ది సినిమాటోగ్ర‌ఫీ, ర‌వీందర్ క‌ళాత్మ‌క ప‌నిత‌నం సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలిచాయి. అనుష్క‌తో పాటు మ‌ల‌యాళ న‌టుడు జ‌యరాం, ఉన్ని ముకుంద‌న్ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. సినిమాలో కానిస్టేబుల్స్‌గా న‌టించిన ధ‌న‌రాజ్‌, ప్ర‌భాస్ శ్రీను, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు ఎంట‌ర్‌టైన్మెంట్ పార్ట్ కోసం త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేశారు కానీ పెద్ద‌గా వ‌ర్కవుట్ కాలేదు. మ‌నుషుల‌ను ట్రాప్ చేసే క్ర‌మంలో ద‌ర్శ‌కులు ప్రేక్ష‌కుల‌ను దారి మ‌ళ్లిస్తుంటారు. ద‌ర్శ‌కుడు అశోక్ అదే టెక్నిక్‌ను ఉప‌యోగించాడిక్క‌డ‌. చివ‌ర‌కు ఓ సోష‌ల్ ఎలిమెంట్ కోసం హీరోయిన్ ఏం చేసిందనే పాయింట్‌ను ప్ర‌ధానంగా ఆవిష్క‌రించారు. సెట్ ప్రాప‌ర్టీపై పెట్టిన శ్ర‌ద్ధ ఎక్కువ‌గా పెట్టిన కోణం క‌న‌ప‌డుతుంది. సంభాష‌ణ‌ల్లో ప‌దును క‌న‌ప‌డ‌దు. పిజ్జా అనే సినిమాలో హీరో హీరోయిన్లు వారికి కావాల్సిన డైమండ్స్ రాబ‌ట్టుకోవ‌డానికి ఓ క‌ల్పిత క‌థ‌ను క్రియేట్ చేస్తారు. ఇందులో ద‌ర్శ‌కుడు అలాంటి టెక్నిక్‌నే ఇందులో ఉప‌యోగించాడు. మేకింగ్ బావుంది.

బోట‌మ్ లైన్ః: థ్రిల్ చేస్తూ భ‌య‌పెట్టే 'భాగ‌మ‌తి'

Bhaagmathie Movie Review in English

Rating: 3 / 5.0

Showcase your talent to millions!!

Write about topics that interest you - anything from movies to cricket, gadgets to startups.
SUBMIT ARTICLE