close
Choose your channels

TDP:తెలుగుదేశం మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు

Wednesday, May 1, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశంలో నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. భగభగ మండే ఎండలు ఓవైపు.. మైకుల హోరు మరోవైపు.. ఉక్కపోత ఓవైపు.. హామీల వర్షం మరోవైపు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఇక తెలంగాణలో అయితే ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అసలు పోటీలోనే లేని తెలుగుదేశం పార్టీ మద్దతును ప్రధాన పార్టీలు కోరడం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. టీడీపీ మద్దతును కాంగ్రెస్ నాయకులు కోరారు. దీంతో వారు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపారు.

ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లోనూ టీడీపీ కార్యకర్తల మద్దతు కూడగట్టేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. ఇటీవల ఖమ్మంలో పర్యటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత సీఎం నందమూరి తారక రామారావుపై పొగడ్తల వర్షం కురిపించారు. తెలంగాణలో రెండు రూపాయలకే కిలోబియ్యం, పటేల్ పట్వార్ వ్వవస్థ రద్దు చేయడం, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు లాంటి ఎన్నో గొప్ప పనులు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. అలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ అలా ఎన్టీఆర్ మీద ప్రశంసలు కురిపించారో లేదో.. కాంగ్రెస్ నేతలు కూడా తెలుగు తమ్ముళ్లను ప్రసన్నం చేసుకునేందుకు రంగంలోకి దిగారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డితో కలిసి ఖమ్మంలోని తెలుగుదేశం కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఉన్న నేతలను అప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అంటూ ప్రశంసించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినట్లు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు తెలుగు తమ్ముళ్లు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్టీఏ కూటమిలో ఉంది. ఏపీలో బీజేపీతో కలిసి పోటీ చేస్తుంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. దీంతో పరోక్షంగా కాంగ్రెస్‌కు సహకారం అందించారనే ప్రచారం జరిగింది. అప్పుడు ఎన్డీఏ కూటమిలో లేదు. ఇప్పుడు ఎన్టీఏలో కొనసాగుతుంది. అయినా కానీ ఏ పార్టీకి చంద్రబాబు మద్దతు ప్రకటించలేదు. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా తెలుగుదేశం క్యాడర్ మద్దతు కోరడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.