close
Choose your channels

ఇదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం!

Sunday, January 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం!

తెలంగాణ ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్‌‌కు చావుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఈ ఉద్ధండులకు ఎదురే లేదు.. కచ్చితంగా గెలుస్తారని ఎవర్నైతే అనుకున్నారో వాళ్లు అట్టర్ ప్లాప్ అవ్వడం గమనార్హం. ముఖ్యంగా జానారెడ్డి, జీవన్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, కొండా సురేఖలు తాము ఓడిపోతామని బహుశా కలలో కూడా ఊహించి ఉండరేమో. ఎలాగైనా సరే తోపులని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలను చిత్తు చిత్తుగా ఓడించి తమ సత్తా ఏంటో చూపించాలని ఎన్నికలకు కొన్ని నెలలముందు నుంచే వ్యూహాలు పన్నిన టీఆర్ఎస్ కారుదెబ్బకు.. హస్తం కకావికలమైంది. అయితే మహాకూటమిని ఏర్పాటు చేయడం వల్ల మైనస్సే గానీ దానివల్ల ఒరిగిందేమీ లేదని తాజాగా కొందరు కాంగ్రెస్ నేతలే తీవ్ర ఆవేదనకు లోనైన సంగతి తెలిసిందే. అయితే ఉన్న ఎమ్మెల్యేలను అయినా కారెక్కకుండా అధిష్టానం జాగ్రత్తలు పడుతోంది. ఈ తరుణంలో వైరల్ అవుతున్న ఓ వార్తతో అసలేం జరుగుతోందో.. తెలియక రాష్ట్ర, అధిష్టానం జుట్టు పీక్కుంటోందట.

మంత్రి, ఎంపీ సీటు కన్ఫామయినట్లేనా..!?
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీకి హ్యాండిచ్చి కారెక్కడానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని అందుకే పార్టీ మారడానికి ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఎమ్మెల్యే సీటు రాక అసంతృప్తితో రగిలిపోతున్న సబిత కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల పార్లమెంట్ సీటివ్వడానికి కూడా టీఆర్ఎస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. కొడుకు భవిష్యత్ కోసం కాంగ్రెస్‌‌ను వీడి కారెక్కడానికి సబితా నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ఎన్నికలకు ముందు చేవెళ్ల ఎమ్మె్ల్యే విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్‌‌కు టాటా చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

టీఆర్ఎస్ వ్యూహమిదేనా..!
గెలిచే పార్టీలో నుంచి ఎవరైనా జంప్ చేస్తారా..? అసలు ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా? అంటే అదొక్క విశ్వేశ్వరెడ్డికే అని చెప్పుకోవాలి. ఆయన ఎందుకు పార్టీ మారారు..? ఆ విషయాలన్నీ ఇక్కడ అప్రస్తుతం. పార్టీ మారడమే కాకుండా తనతో కేసీఆర్, కేటీఆర్ ఇలా అన్నారని మీడియాకు లీకులివ్వడంతో టీఆర్ఎస్ పెద్దలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో విశ్వేశ్వర్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా బుద్ధి చెప్పాలనే సబితా కుటుంబాన్ని పార్టీలోకి రావాలని ఆహ్వానించారట. అయితే రాజకీయ చాణక్యుడైన కేసీఆర్ ప్లాన్ ఎంత వర్కవుట్ అనేది చూడాలి.

ఇప్పుడు ఆరుగురు.. తర్వాత నలుగురు..!
సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జె. సురేందర్‌‌లు కాంగ్రెస్‌‌కు గుడ్ బై చెప్పేసి సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరతారని సమాచారం. అయితే ఈ చేరిక అనంతరం మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. వీరిలో కొందరికి నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్..!
ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నంబర్ ‘వన్’ స్థానానికి పరిమితమైన టీడీపీ.. 2018 ముందస్తు ఎన్నికల్లో నంబర్ ‘టూ’కు పరిమితమైంది. రేపు జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో. అయితే తెలంగాణలో టీడీపీ చచ్చిపోయిందన్నది గత నాలుగేళ్లుగా విశ్లేషకులు చెబుతున్నమాట. పైగా ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కూడా లేవు.. సాధ్యం కాకపోవచ్చేమో. అయితే పైన అనుకున్నట్లుగా జరిగితే మాత్రం టీడీపీ-కాంగ్రెస్‌‌ పార్టీలు తెలంగాణలో దుకాణాలు దాదాపు మూస్కోవాల్సిందే. అంటే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌‌ను వెతికినప్పటికీ కనుచూపుమేరలో కనపడదన్న మాట. అయితే ఈ రేంజ్‌‌లో వార్తలు వస్తున్నప్పటికీ ఒకరిద్దరు తప్ప కాంగ్రెస్ పెద్ద తలకాయలు.. ఇటు టీఆర్ఎస్ నేతలు కూడా ఈ వ్యవహారంపై క్లారిటీ ఇవ్వడానికి సాహసించట్లేదు. మొత్తానికి చూస్తే ఇప్పటికే టీడీపీని ఓవర్ స్పీడ్‌తో ఢీ కొట్టి చంపిన కారు.. కాంగ్రెస్‌‌ను సైతం ఢీ కొట్టడానికి సిద్ధమవుతోందన్న మాట. అయితే ఇది ఎంతమేరకు నిజమవుతుంది..? అసలు ఇది సాధ్యమేనా..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.