దేశంలో ఈ స్థాయిలో కేసులు.. మరణాలు ఇదే తొలిసారి

  • IndiaGlitz, [Wednesday,April 21 2021]

కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా దేశంలో ఎంటర్ అయిన తర్వాత ఈ స్థాయిలో కేసులు కానీ.. మరణాలు కానీ ఇప్పటి వరకూ నమోదు కాలేదు. మూడు లక్షలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు నమోదవడం షాక్‌కు గురి చేస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2.95 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

కాగా.. గడిచిన 24 గంటల్లో 2023 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దేశంలో రోజు వారి మరణాలు సైతం 2 వేలు దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా.. కరోనా నుంచి 1,67,457 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 21,57,538 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 1,56,16,130 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 1,32,76,039 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మొత్తం 1,82,553 మంది మృతి చెందారు. మరణాల రేటు 1.18 శాతంగా ఉంది.

ఒక్కరోజులో అత్యధిక మరణాలు మహారాష్ట్రలో(519) సంభవించాయి. ఇక ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలోనూ మరణాల సంఖ్య అధికంగానే ఉంది. ఇక దేశంలో రికవరీ రేటు 85.56 శాతం ఉండగా.. యాక్టివ్ రేటు 13.26 శాతంగా ఉంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం సైతం శరవేగంగానే సాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 29.90 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇవ్వగా.. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 13,01,19,310 మందికి కరోనా వైరస్‌ టీకాలు అందించారు.