సీఎం కాన్వాయ్‌కి ప్రభుత్వ వాహనాలు లేవా... నేనేప్పుడూ చూడలేదు: ఒంగోలు ఘటనపై పవన్ ఆగ్రహం

  • IndiaGlitz, [Thursday,April 21 2022]

ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం కాన్వాయ్ కోసం తిరుమలకు వెళ్తున్న ఓ కుటుంబం నుంచి కారు లాక్కున్న ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన సీఎంవో స్ధానిక ఆర్టీఏ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. తాజాగా ఒంగోలు ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి ఒంగోలు పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. ఎవరి ఒత్తిడితో ప్రయాణికులను దింపి మరీ వాహనం తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలని సీఎంవోను పవన్ కోరారు. సీఎం జిల్లాల్లో పర్యటిస్తే ప్రయాణీకులను నడిరోడ్డుపై దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకొనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం విచిత్రంగా ఉందని పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి పర్యటన ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న ట్రావెల్స్ నుంచి వాహనాలు అద్దెకు తీసుకోవడం గురించి విన్నామే తప్ప .. ప్రయాణంలో ఉన్నామని చెబుతున్నా పట్టించుకోకుండా వాహనం తీసుకొనే పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని ఆయన దుయ్యబట్టారు.

తిరుమలకు వెళ్తున్న వారి వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం విస్మయానికి గురి చేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం కాన్వాయ్ కోసం ప్రయాణీకులను నడిరోడ్డుపై దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకోవల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్ కలిగి, రూ.7.77 లక్షల కోట్లు అప్పు తెచ్చుకొన్న సామర్థ్యం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యమంత్రి పర్యటనకు ప్రైవేట్ వ్యక్తుల వాహనాలు తీసుకోవడం ఏంటంటూ ఆయన ఫైరయ్యారు. ముఖ్యమంత్రి భద్రత పర్యవేక్షించే అధికారులు కాన్వాయ్‌లో ప్రైవేట్ వాహనాలు అనుమతిస్తున్నారా అంటు పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒంగోలు ఘటనలో ఒక సహాయ అధికారిని, ఒక హోమ్ గార్డుని సస్పెండ్ చేసేసి విషయాన్ని మరుగునపెట్టేద్దామని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉందని పవన్ ఎద్దేవా చేశారు. సదరు ఉద్యోగులపై ఆ స్థాయి ఒత్తిడిని రాజకీయ నాయకులు తీసుకువచ్చారా..? ఉన్నతాధికారులు తీసుకువచ్చారా అనేది తేల్చాలని జనసేనాని కోరారు. పాలనా వ్యవస్థలో భాగమైన ఆ ఉద్యోగులు ఎవరి ఒత్తిడితో, ఎవరి వినియోగం కోసం బలవంతంగా వాహనాలు స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏటా ముఖ్యమంత్రి భద్రతకు ఎంత ఖర్చు చేస్తున్నారు? వాహన శ్రేణిలో ఉండే వాహనాలు ఎన్ని? ముఖ్యమంత్రి పర్యటనలకు ప్రైవేట్ వాహనాలు ఎందుకు స్వాధీనం చేసుకొంటున్నారు? ప్రైవేట్ వాహనాల్లో ఎవరు పర్యటనలు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

More News

విజయ్ దేవరకొండ, సమంత చిత్రం ప్రారంభం

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయ్యింది. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ సినిమా రూపొందిస్తున్నారు.

రేపు జగన్ టూర్.. కాన్వాయ్ కోసం కారు లాక్కెళ్లిన కానిస్టేబుల్, నడిరోడ్డుపై కుటుంబం

పలు నిర్ణయాలతో విమర్శలు మూట కట్టుకున్న ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది.

జీవో 111 ఆంక్షల ఎత్తివేత... ఫలించిన 26 ఏళ్ల నిరీక్షణ, 84 గ్రామాలకు విముక్తి

జీవో 111ను ఎత్తేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

నిర్మాతకు ఒక రూపాయి మిగలాలని తపించేవారు : తాతినేని మరణంపై బాలయ్య దిగ్భ్రాంతి

సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

నాని ‘‘ అంటే సుందరానికి ’’ టీజర్ : నవ్వులు పూయిస్తున్న నేచురల్ స్టార్

నేటీతరం హీరోల్లో అత్యంత ప్రతిభావంతమైన నటుల్లో ఒకడిగా మన్ననలు పొందుతున్న నాని..