close
Choose your channels

జీవో 111 ఆంక్షల ఎత్తివేత... ఫలించిన 26 ఏళ్ల నిరీక్షణ, 84 గ్రామాలకు విముక్తి

Thursday, April 21, 2022 • తెలుగు Comments
KCR
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జీవో 111ను ఎత్తేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది సర్కార్. జీవో 111 పరిధి నుంచి 84 గ్రామాలకు విముక్తి కలిగిస్తున్నట్లు.. కొత్తగా జీవో 69 జారీ చేసింది. ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ జంట జలాశయాల పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా.. ఎస్టీపీల నీరు జంట జలాశయాల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. అంతేకాదు.. జంట జలాశయాల చుట్టుపక్కల గ్రామాల్లో సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. తద్వారా భూగర్భ జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

మరోవైపు .. జంట జలాశయాల పరిరక్షణకు సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది . కమిటీ సభ్యులుగా మున్సిపల్, ఫైనాన్స్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, వాటర్ బోర్డ్ ఎండి, పొల్యూషన్ కంట్రోల్ మెంబర్ సెక్రటరీ, హెచ్ఎండీఏ డైరెక్టర్ ఉంటారు. జంట జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన మార్గదర్శకాలకు రూపకల్పన చేయనుంది ఈ కమిటీ.

అసలేమిటీ జీవో 111:

హైదరాబాద్‌లోని ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌ జలాశయాల పరిరక్షణకు వాటి పరీవాహక ప్రాంతంలోని పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాల్లో ఆంక్షల అమలుకు 1996లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 111 తెచ్చింది. 1996 నాటికి రాజధాని తాగునీటి అవసరాలలో 27.59 శాతం గండిపేట, హిమాయత్‌సాగర్‌లు తీర్చేవి. ఆయకట్టు పరిధిలో కాలుష్య కారకాలైన పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర సంస్థలను ఏర్పాటు చేయరాదని ప్రభుత్వం ఆదేశించింది.

అయితే జీవో జారీ తర్వాత కఠినంగా ఆంక్షలు అమలయ్యాయి. దీంతో క్రమేపీ స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. జీవో ఎత్తివేయాలని పలుమార్లు ఆందోళనలు సైతం నిర్వహించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ... ప్రజలు, ప్రజాప్రతినిధుల విన్నపం మేరకు ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్‌కు గోదావరి, కృష్ణా, మంజీరా నదీ జలాలు పుష్కళంగా అందుతుండటంతో జీవో 111 ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. దీనిపై శాసనసభలో ప్రకటన చేయగా... ఇటీవల రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణం ఉత్తర్వులు వచ్చాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.