close
Choose your channels

Jaya Janaki Nayaka Review

Review by IndiaGlitz [ Thursday, August 10, 2017 • తెలుగు ]
Jaya Janaki Nayaka Review
Banner:
Dwaraka Creations
Cast:
Sai Srinivas Bellamkonda, Pragya Jaiswal
Direction:
Boyapati Srinu
Production:
M. Ravinder Reddy

Jaya Janaki Nayaka Movie Review

జుమ్‌జుమ్ అని స్సీడుగా ప‌రుగులు తీసే ఖ‌రీదైన కార్లు, వంద‌ల కోట్ల ట‌ర్నోవ‌ర్లున్న కంపెనీల అధినేత‌లు, అంతే ఇదిగా క‌ర‌డుగ‌ట్టిన వారి స్వ‌భావాలు, వారి ప‌క్క‌నే అంద‌మైన కుటుంబాలు, వారి పిల్ల‌ల జీవితాల్లో ఆహ్లాద‌క‌ర‌మైన, మ‌న‌సుకు హ‌త్తుకునే ప్రేమ‌లు... ఇవ‌న్నీ బోయ‌పాటి చిత్రాల్లో క‌నిపిస్తాయి. `భ‌ద్ర‌`, నుంచి `స‌రైనోడు` వ‌ర‌కు ఆయ‌న సినిమాల్లో ప్రేమా ఉండాల్సిందే.. ప‌గ ఉండాల్సిందే.. అంద‌మైన కుటుంబం ఉండాల్సిందే.. ఇప్పుడు వాట‌న్నిటి క‌ల‌బోత‌గా, కొత్త నేప‌థ్యంలో ఓ సినిమా తెర‌కెక్కింది. అదే `జ‌య జాన‌కి నాయ‌క‌`. ఈ చిత్రం ఎలా ఉందో.. ఒక సారి ప‌రిశీలిస్తే...

క‌థ‌:

చ‌క్ర‌వ‌ర్తి ఇండ‌స్ట్రీస్ అధినేత చ‌క్ర‌వ‌ర్తి (శ‌ర‌త్ కుమార్‌) త‌న‌యుడు గ‌గ‌న్ (బెల్లంకొండ శ్రీనివాస్‌). అత‌ని కాలేజీలో స్వీటీ (ర‌కుల్‌) చ‌దువుతుంటుంది. మినిస్ట‌ర్ (సుమ‌న్‌) తన‌యుడు విక్ర‌మ్ కూడా అదే కాలేజీ లో చ‌దువుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడు. ఓ సారి అలా జ‌రిగిన గొడ‌వ‌లో గ‌గ‌న్ అత‌నిపై చేయి చేసుకుంటాడు. ఆ విష‌యంలో గ‌గ‌న్ సోద‌రుడు (నందు), తండ్రి స‌పోర్ట్ గా నిలుస్తారు. ఆ ఫైట్ త‌ర్వాత స్వీటీకి గ‌గ‌న్ మీద ప్రేమ పుడుతుంది. ఓ సంద‌ర్భంలో ప్ర‌పోజ్ కూడా చేస్తుంది. మ‌రోవైపు లిక్క‌ర్ వ్యాపారం నుంచి రోడ్స్ కాంట్రాక్ట్ లోకి రావాల‌నుకుంటాడు ప‌వార్ (త‌రుణ్ అరోరా). అత‌నికి స్వీటీ తండ్రి (జె.పి) మ‌ద్ద‌తు ఉండ‌దు. అదే కాంట్రాక్ట్ కోసం పేరు మోసిన, ప‌రువుకు ప్రాధాన్యం ఇచ్చే అశ్వ‌త్ నారాయ‌ణ్ వ‌ర్మ (జ‌గ‌ప‌తిబాబు) కూడా ప్ర‌య‌త్నిస్తుంటాడు. ఈ ఒడిదొడుకుల మ‌ధ్య స్వీటీ వ‌ర్మ ఇంటి కోడ‌ల‌వుతుంది. పెళ్లి పీట‌ల మీదే తాళి క‌ట్టించుకున్న మ‌రుక్ష‌ణం భ‌ర్త‌ను పోగొట్టుకుంటుంది. ఆమెను కూడా ప‌వార్ నుంచి గ‌గ‌నే ర‌క్షిస్తాడు. స్వీటికి న‌చ్చ‌జెప్పి గ‌గ‌న్ ఆమెను త‌న ఇంటికి తీసుకెళ్తాడు. అయితే కోడ‌లు ఎవ‌రి చేయో.. ప‌ట్టుకుని పోయింద‌నే వార్త‌ను జీర్ణించుకోలేని వ‌ర్మ‌, ఒకానొక సంద‌ర్భంలో ప‌వార్‌తో చేతులు క‌లుపుతాడు. దానికి మినిస్ట‌ర్ ఆజ్యం పోస్తాడు. చివ‌ర‌కు ఏమైంది?  స్వీటీని గ‌గ‌న్ ద‌క్కించుకున్నాడా లేదా?  ప‌వార్ నెగ్గాడా? వ‌ర్మ నెగ్గాడా?   మినిస్ట‌ర్ ప‌రిస్థితి ఏమైంది? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం.

ప్ల‌స్ పాయింట్లు:

ఈ సినిమాకి ప్ల‌స్ పాయింట్లు బోయ‌పాటి టేకింగ్‌, రిషి పంజాబీ కెమెరా ప‌నిత‌నం, దేవిశ్రీ ప్ర‌సాద్ చేసిన సంగీతం, నేప‌థ్య సంగీతం, బ‌బ్లీ గ‌ర్ల్ గా ఉన్న సీన్ల‌లో ర‌కుల్‌, నాగ‌రాజా అని ఆమె చెప్పే ఊత‌ప‌దం, శ‌ర‌త్‌కుమార్‌, నందు, చ‌ల‌ప‌తిరావు, ప‌రువు కోసం ఏమైనా చేసే జ‌గ‌ప‌తిబాబు న‌ట‌న‌, భ‌ర్త‌కు త‌గిన భ‌ర్త‌గా సితార న‌ట‌న‌, పోష్ గ‌ర్ల్ గా ప్ర‌గ్యా జైశ్వాల్ గ్లామ‌ర్‌, అటు బార్‌లోనూ, ఇటు వాన‌నీటి బుర‌ద‌లోనూ కేథ‌రిన్ ట్రెస్సా చేసే డ్యాన్సు, అక్క‌డ‌క్క‌డా మ‌న‌సును హ‌త్త‌కునేలా బోయ‌పాటి చెప్పే డైలాగులు సినిమాకు హైలైట్‌. అమ్మాయిలు విలువ‌ల‌ను ప‌రిర‌క్షించి భావి త‌రాల‌కు అంద‌జేసే లాక‌ర్ల‌లాంటివారని, మిర్చిలు, గారెలు వంటి మ‌న పొరుగు వారు చేసిన వాటి వ‌ల్ల మ‌న దేశంలో వారికి ప‌ని క‌ల్పించిన వార‌మ‌వుతామ‌ని చెప్పే డైలాగులు, స‌ర‌దాగా చెప్పిన‌ప్ప‌టికీ.. అమ్మాయిలు బ్యూటీ పార్ల‌ర్ల వైపు వెళ్ల‌క‌పోవ‌డం ఎలా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీస్తుందో చెప్ప‌డం.. వంటి డైలాగుల‌న్నీ బావున్నాయి. మ‌రీ ముఖ్యంగా వీడే వీడే పాట‌, ఐట‌మ్ సాంగ్ బావున్నాయి. డిజైన్ చేసిన పాత్ర‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌ట‌న బావుంది. గ‌త చిత్రాల‌తో పోలిస్తే డ్యాన్సులు పెద్ద‌గా లేవు. వేసినంత‌వ‌ర‌కు స్టెప్పుల‌న్నీ బావున్నాయి. ఫైట్లు కూడా న‌మ్మ‌శ‌క్యంగా అనిపించాయి. నేచుర‌ల్‌గా ఉన్నాయి.

మైన‌స్ పాయింట్లు:

క‌థ‌ను రాసుకునేట‌ప్పుడు అన్ని విధాలుగా ఆలోచించిన బోయ‌పాటి శ్రీనివాస్ కాసింత కామెడీ పాళ్లు పెంచి ఉంటే బావుండేది. ర‌కుల్ లాంటి అంద‌మైన అమ్మాయిని ఇంకాస్త గ్లామ‌ర‌స్‌గా చూడాల‌ని జ‌నాలు కోరుకుంటారు. ర‌కుల్‌, ప్ర‌గ్య‌, కేథరిన్ ఉన్నార‌ని అన‌గానే మాస్ జ‌నాలు మ‌రింత గ్లామ‌ర్‌ని ఆశిస్తారు. అయితే ర‌కుల్  సెకండాఫ్‌లో ఓ మూలన కూర్చుని ఎప్పుడూ క‌న్నీళ్లు కారుస్తూ, దిగాలుగా చూడ‌టం.. అనే ఆలోచ‌న‌ని జీర్ణం చేసుకోవ‌డం కాస్త ఇబ్బంది అవుతుంది. పైగా త‌న గ‌త చిత్రాల్లో అన్నీ ఎమోష‌న్స్ ను చూపించిన హీరో, ఇందులో క‌థానుగుణంగా ఒక‌టే ర‌క‌మైన ఫేస్ ఫీలింగ్స్ తో ఎక్కువ‌గా క‌నిపిస్తాడు. తొలి స‌గంలో సిగ్గు, మ‌లిస‌గంలో కోపం, దిగ‌మింగుకున్న బాధ‌తో క‌నిపిస్తాడు. దాంతో ఎక్కువ వేరియేష‌న్ చూపించ‌డానికి స్కోప్ లేక‌పోయింద‌ని అనిపిస్తుంది.

విశ్లేష‌ణ:

టైటిల్ పెట్ట‌డంలో బోయ‌పాటిది ప్ర‌త్యేక‌మైన శైలి. ఆయ‌న టైటిల్ పెట్టార‌న‌గానే స‌గం క‌థ‌ను ప్రేక్ష‌కుల‌కు ఉప్పందించిన‌ట్టే. అలాగే ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారంటే క‌థ‌లో క్రీమ్‌ని రుచి చూపించిన‌ట్టే. న‌రాలు తేలి, కోపంతో క‌ళ్ల‌ల్లో క‌సితో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ ఫోటోలు చూడ‌గానే ఇది ఫ‌క్తు మాస్ మ‌సాలా సినిమా అని ప్రేక్ష‌కుల‌కు చెప్ప‌క‌నే చెప్పారు. జ‌య‌జాన‌కీ నాయ‌క అనే టైటిల్‌తోనే హీరోయిన్ కోసం హీరో చేసే పోరాట‌మే అని చెప్పారు. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ కాస్త కొత్త‌గా అనిపిస్తుంది. హీరోయిన ని విడోగా చూపించిన చిత్రాలు ఈ మ‌ధ్య‌లో పెద్ద‌గా రాలేదు.  సో ఆ ర‌కంగా ఈ సినిమా కాస్త కొత్త‌గా అనిపించింది. అయితే డ‌ల్ మూడ్‌లో, వితౌట్ మేక‌ప్‌తో, క‌న్నీటి ధార‌ల మ‌ధ్య ర‌కుల్‌ని చూడ‌టం మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపించింది. అస‌లు క‌థే అది కాబ‌ట్టి ఆ స‌న్నివేశాలు త‌ప్ప‌వు. ప్ర‌గ్యా జైశ్వాల్ త‌న గ్లామ‌ర‌స్ లుక్స్ తో కాసింత సేపు ప్రేక్ష‌కుల‌కు రిలీఫ్‌నిచ్చింది. కేథ‌రిన్ పాట బావుంది. శ‌ర‌త్‌కుమార్‌, నందు త‌మ పాత్ర‌ల్లో బాగానే చేశారు. నిర్మాత పెట్టిన ఖ‌ర్చు తెర‌పై క‌నిపించింది. రిషి పంజాబీ ప్ర‌తి ఫ్రేమ్‌నూ రిచ్‌గా తీశారు. వ‌ర్మ త‌ర‌హా పాత్ర‌ల్లో జ‌గ‌ప‌తిబాబును కొట్టేవారు ఎవ‌రూ లేర‌ని మ‌రోసారి అర్థ‌మైంది. బోయ‌పాటి గ‌త సినిమాలు న‌చ్చిన వారికి ఈ సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. ఇది ఫ‌క్తు బోయ‌పాటి మార్కు సినిమా.

బాట‌మ్ లైన్‌: బోయ‌పాటి మార్కు మ‌సాలా.. జ‌య జాన‌కీ నాయ‌కా

Jaya Janaki Nayaka Movie Review in English

Rating: 3 / 5.0

Showcase your talent to millions!!

Write about topics that interest you - anything from movies to cricket, gadgets to startups.
SUBMIT ARTICLE