Download App

Kanulu Kanulanu Dochayante Review

మలయాళ యువ హీరోల్లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ .. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. అంతే కాకుండా ద‌క్షిణాదిన తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల్లో కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. మ‌హాన‌టిలోనూ జెమినీ గ‌ణేశ‌న్ పాత్ర‌లో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ హీరో మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో చేసిన‌ `ఓకే బంగారం` సినిమా త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌లైంది. ఇప్పుడు అదే త‌ర‌హా ప్ర‌య‌త్నం చేశాడు దుల్క‌ర్‌. ఆ సినిమాయే `క‌నులు క‌నుల‌ను దోచాయంటే`. ఈ సినిమా మ‌రి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందా? అనే విష‌యం తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

క‌థ‌:

సిద్థార్ధ్‌(దుల్క‌ర్ స‌ల్మాన్‌), క‌ల్లీస్‌(ర‌క్ష‌ణ్‌) మంచి స్నేహితులు. ఇద్ద‌రికీ సాఫ్ట్‌వేర్‌లో మంచి అనుభ‌వం ఉంటుంది. ద‌ర్జాగా జీవితాన్ని గడుపుతుంటారు. కొన్నిరోజుల త‌ర్వాత సిద్ధార్థ్..మీరా(రీతూవ‌ర్మ‌)తో, క‌ల్లీస్‌.. శ్రేయ‌(నిరంజ‌ని)తో ప్రేమ‌లో ప‌డ‌తారు. అదే స‌మ‌యంలో సిటీలో ఆన్‌లైన్ క్రైమ్ పెరిగిపోతుంది. దాంతో పాటు కార్ల‌లోని ఖ‌రీదైన వ‌స్తువులు కూడా దొంగ‌తనానికి గుర‌వుతాయి. ఈ కేసుతో పాటు మ‌రో కేసు అన‌ధికారికంగా డీల్ చేస్తూ పోలీస్ క‌మీష‌నర్ ప్ర‌తాప్ సింహ(గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌) అస‌లు దొంగ‌ల‌ను ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. అదే స‌మ‌యంలో ఈ రెండు జంట‌లు జీవితంలో స్థిర‌ప‌డాల‌ని ప్రేమ‌, పెళ్లి అటూ గోవాకు వెళ‌తారు. అక్క‌డ మీరా గురించి సిద్ధార్థ్‌కు షాకింగ్ నిజం ఒక‌టి తెలుస్తుంది. అదేంటి? అస‌లు మీరా ఎవ‌రు? ఆన్‌లైన్‌లో మోసాలు చేసేదెవ‌రు?  అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ:

కొంద‌రు హీరోలు ఎలాంటి పాత్ర‌ల్లో అయినా ఒదిగిపోతుంటారు. అలాంటి స్టార్స్‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ ఒక‌రు. ఓకే బంగారంలో ల‌వ‌ర్‌బోయ్ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన దుల్క‌ర్‌.. మ‌హాన‌టిలో జెమినీ గ‌ణేశ‌న్ పాత్ర‌తో డిఫ‌రెంట్ మేన‌రిజంతో ఆక‌ట్టుకున్నాడు. ఈ రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌లో మ‌రోసారి భిన్నమైన పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్నాడు. పెళ్ళిచూపులులో గ‌ర్ల్ నెక్ట్స్ డోర్ అమ్మాయిగా క‌నిపించిన రీతూవ‌ర్మ‌.. ఈ సినిమాలో రెండు పార్శ్వాలున్న పాత్ర‌లో న‌టించింది. ఆమె పాత్ర‌లోని కోణాలు ప్రేక్ష‌కుల‌ను ధ్రిల్ చేస్తాయ‌న‌డంలో సందేహం లేదు. అలాగే ర‌క్ష‌ణ్‌, నిరంజ‌ని పాత్ర‌ల మ‌ధ్య కొన్ని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తాయి. ఇక గౌత‌మ్ మీన‌న్ పాత్ర ముందు చూపించిన‌ట్లుగా సీరియ‌స్‌గా ఉన్నా..చివ‌రికి కామెడీగా మిగిలిపోతుంది. అనీష్ కురువిల్లా స‌హా ఇత‌ర పాత్ర‌ధారులంద‌రూ వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించారు.

ద‌ర్శ‌కుడు దేసింగ్ పెరియ‌సామి డిఫ‌రెంట్‌గా సినిమాను స్టార్ట్ చేశాడు. సినిమా ప్ర‌ధాన అంశం ధ్రిల్ల‌ర్. అయితే దీనికి ప్రేమ‌క‌థ‌ను యాడ్ చేసిన ద‌ర్శ‌కుడు. ఆన్‌లైన్ మోసాలు..దొంగ‌త‌నాలు, హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ ఇలా అన్నీ స‌న్నివేశాల‌తో ఫ‌స్టాఫ్ ర‌న్ అవుతుంది. ఇంట‌ర్వెల్‌ను మంచి ట్విస్ట్‌తో ఇచ్చారు. దీంతో సెకండాఫ్ ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో క‌లుగుతుంది. ఫ‌స్టాప్‌లో చూపిన స‌న్నివేశాలు, అందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు వివ‌ర‌ణ ఇస్తూ ద‌ర్శ‌కుడు సెకండాఫ్‌ను ప్లాన్ చేసుకున్నారు. మ‌ధ్య మ‌ధ్య‌లో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాల‌నుకున్న ప్ర‌య‌త్నం పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. అస‌లు సినిమాలో జ‌రుగుతున్న ఆన్‌లైన్ మోసాల‌కు బ‌ల‌మైన మోటివేష‌న్ ఇదంటూ డైరెక్ట‌ర్ చూపించ‌కుండా వ‌దిలేశాడు. మాసాల కేఫ్ అందించిన పాట‌లు బావున్నాయి. హర్షవర్ధన్ నేపథ్య సంగీతం సంగీతం బావుంది. కె.ఎం.భాస్కరన్ కెమెరా పనితనం బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి.

చివరగా.. కనులు కనులను దోచాయంటే..ఆక‌ట్టుకునే రొమాంటిక్ థ్రిల్ల‌ర్

Read Kanulu Kanulanu Dochayante Review in English

Rating : 3.3 / 5.0