close
Choose your channels

సఫల రాష్ట్రంగా తెలంగాణ.. పెన్షన్ దారులు, రైతన్నలకు కేసీఆర్ శుభవార్త..

Sunday, June 2, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సఫల రాష్ట్రంగా తెలంగాణ.. పెన్షన్ దారులు, రైతన్నలకు కేసీఆర్ శుభవార్త..

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. జూన్-02 రాష్ట్రవ్యాప్తంగా అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. పతాకావిష్కరణ చేసి అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సుమారు అరగంటకుపైగా ప్రసంగించారు. తెలంగాణ సఫల రాష్ట్రంగా పురోగమిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ యావన్మందికి రాష్ట్ర ఆవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రైతన్నలకు కేసీఆర్ శుభవార్త అందించిన ఆయన.. ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకుని ఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్నామని చెప్పుకొచ్చారు.

ప్రగతిపథంలో దూసుకుపోతుంది!

"ఒక రాష్ట్ర చరిత్రలో ఐదేళ్ల కాలం చిన్న కాలం. అయితే మనం సాధించిన ఫలితాల దృష్ట్యా ఈ ఐదేళ్ల కాలం ఎంతో ఘనం. శాంతిని, సామరస్యాన్ని కాపాడుకుంటూ అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. దేశ చరిత్రలో ప్రత్యేక మహోద్యమాన్ని సాగించి తెలంగాణ సాధించుకున్నాం. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఐదేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించింది. తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తోంది. తెలంగాణ సఫల రాష్ట్రంగా పురోగమిస్తోంది. మొక్కవోని దీక్షతో అభ్యుదయపథంలో సాగుతోంది. ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో అవరోధాలను అధిగమించగలిగాం. అపనమ్మకాల నడుమ వచ్చిన రాష్ట్రం వాటన్నింటినీ అధిగమించింది. తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోతుంది. ప్రభుత్వం పట్టుదలతో సాధించిన విజయం ఇది. రాష్ట్రం కోసం రాజీలేని పోరాటం చేసిన వాళ్లే అభివృద్ధి చేస్తారని ప్రజలు నమ్మారు. పంచాయతీ నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు తిరుగులేని విజయం కట్టబెట్టారు. రాజకీయ అవినీతికి దూరంగా బలమైన రాష్ట్రంగా నిలదొక్కుకుంది. ఐదేళ్లలో రాష్ట్రం 16.5 శాతం వృద్ధిరేటు సాధించాం" అని కేసీఆర్ స్పష్టం చేశారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతాని కృషి...

"ఈ ఐదేళ్ల కాలంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు వేశాం. కుల వృత్తులను ప్రోత్సహించడం ద్వారా వారి జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేశాం. ఆయా కులాల ఆత్మగౌరవ భవనాలను హైదరాబాద్‌లో నిర్మిస్తున్నాం. చిత్తశుద్ధితో కరెంట్‌ సమస్యను పరిష్కరించాం. అతి తక్కువ కాలంలో విద్యుత్ సమస్యను అధిగమించాం. వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. విద్యుత్ సరఫరాలో గుణాత్మక మార్పు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నూతనోత్తేజం చేకూరుస్తున్నాం. జులై చివరినాటికి మిషన్‌ భగీరథ పూర్తవుతుంది" అని గులాబీ బాస్ స్పష్టం చేశారు.

పెన్షన్లు పెంచుతున్నాం..!

"వృద్ధులు, వితంతులు, వికలాంగులకు ఆసర పథకం అండగా నిలుస్తోంది. ఈనెల నుంచి పెంచిన పెన్షన్లను ఇస్తాం. వ్యవసాయ, పరిశ్రమ రంగాలు పురోగతి సాధించాయి. వృద్ధ్యాప్య పింఛన్ల వయోపరిమితిని 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించాం. కల్యాణలక్ష్మి పథకానికి వచ్చిన ఆశీస్సులే ప్రభుత్వానికి పెట్టని కోటలు. బతుకమ్మ, బోనాలు, క్రిస్మస్, రంజాన్‌లను రాష్ట్ర పండుగలుగా గుర్తించాం. రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. కంటి వెలుగు పథకం పేద ప్రజలకు పెద్ద వరంగా మారింది. త్వరలోనే దంత, చెవి, ముక్కు వ్యాధుల నిర్దరణకు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశాం. చేనేతల సమస్యలు చాలా వరకు పరిష్కరించాం. విద్య, వైద్య రంగాల్లో ప్రమాణాలు మెరుగుపర్చాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు మెరుగుపర్చాం" కేసీఆర్ చెప్పుకొచ్చారు.

కోటి ఎకరాలకు నీళ్లివ్వడమే లక్ష్యం..

"పెండింగ్ ప్రాజెక్టులను వాయువేగంతో పూర్తిచేయబోతున్నాం. ప్రాజెక్టులతో రాష్ట్రంలో ఇకపై ఎటుచూసినా పచ్చనిపైర్లే దర్శనమిస్తాయి. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను సమర్థంగా వినియోగించుకుంటున్నాం. మహబూబ్‌నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీరు అందించగలిగాం. ప్రపంచంలోనే వేగంగా నిర్మించే ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్రలో నిలబోతుంది. అదేవిధంగా మరోవైపు సీతారామ ఎత్తిపోతల పథకం పనులు కూడా యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులు ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజం సమకూరుస్తాయి. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు వరదాయిని. తెలంగాణలో ఇకపై కరువు అనేది కన్పించదు. అన్ని చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతాయి" అని రాష్ట్ర ప్రజలకు సీఎం హామీ ఇచ్చారు.

రైతన్నకు శుభార్త...

"రూ.లక్ష రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నాం. మరో రూ.లక్ష రుణమాఫీ చేయబోతున్నాం. రైతుబంధు పథకం రైతుల హృదయాల్లో సంతోషం నింపింది. రైతుబంధు పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కేంద్రానికి కూడా రైతుబంధు ఆదర్శనీయమైంది. రైతు కుటుంబాలను ఆదుకోవాలని రైతుబీమా పెట్టాం. రాష్ట్రంలో క్రాప్‌ కాలనీలు ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు పెడతాం. రైతుల తలరాతలు మారాలి, వ్యవసాయం లాభసాటి కావాలి. తెలంగాణలో రైతులు ధనవంతులు కావడానికి కృషి చేస్తా. రైతుల శ్రేయస్సు కోసమే నా జీవితాన్ని దారపోస్తా. తెలంగాణకు హరితహారం ఎంతో విశిష్టమైనది. రైతు మరణిస్తే రైతు బీమా కింద రూ. 5 లక్షలు అందిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు హరితహారం ప్రవేశపెట్టాము. మొక్కల పెంపకం, సంరక్షణతో సస్యశ్యామల సమశీతల తెలంగాణ ఆవిష్కరించుకోవాలి. కొత్త రెవెన్యూ చట్టం అమలులో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. అవినీతిని పారద్రోలితే పాలనా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది" అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

కాగా.. కేసీఆర్‌ చెప్పినవన్నీ అబద్ధాలేనని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. రూ. 2లక్షల కోట్లకు పైగా రాష్ట్ర అప్పుల్లో కూరుకుపోయిందని.. నిరుద్యోగుల ఆశలను వమ్ము చేశారని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏ పరీక్షలనూ సక్రమంగా నిర్వహించలేదని ఎద్దేవా చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.