close
Choose your channels

అటు కేసీఆర్ సర్కార్.. ఇటు ఈసీపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఫైర్

Thursday, April 29, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఈ కర్ఫ్యూ రేపటితో ముగియనుంది. కరోనా మహమ్మారి అదుపులోకి రాలేదు సరికదా.. మరింత వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30 తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుందనే దానిపై విచారణ నిర్వహించింది. అటు కర్ఫ్యూ అనంతరం తీసుకుంటున్న చర్యలేంటని ప్రశ్నిస్తునే.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపటితో కర్ఫ్యూ ముగియనుంది.. తదుపరి చర్యలు ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

రేపు పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఏమిటంటూ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నియంత్రణ చర్యలపై దాగుడు మూతలెందుకని ప్రశ్నించింది. కనీసం ఒక రోజు ముందు చెబితే నష్టమేంటని మండిపడింది. నియంత్రణ చర్యలపై తాము ఎలాంటి సూచనలూ ఇవ్వడం లేదని హైకోర్టు తెలిపింది. క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే మధ్యాహ్నంలోగా ప్రభుత్వాన్ని సంప్రదించి తదుపరి తీసుకునే చర్యలేంటో చెబుతానని ఏజీ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు వెల్లడించారు.

ఆకాశం విరిగి మీద పడినా ఎన్నికలు జరగాలసిందేనా?

రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు ముందుకు వెళ్లారని నిలదీసింది. ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? అని ప్రశ్నించింది. యుద్ధం వచ్చినా.. ఆకాశం విరిగి మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా? అంటూ ఈసీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్ఈసీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనిస్తున్నారా? అని ప్రశ్నించింది. అసలు ఎస్ఈసీ అధికారులు భూమిపై నివసిస్తున్నారా.. ఆకాశంలోనా? అని నిలదీసింది. కొన్ని మున్సిపాలిటీల ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా అని ప్రశ్నించగా... రాష్ట్ర ప్రభుత్వం ఏకాభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్‌ఈసీ తెలిపింది.

ఫిబ్రవరిలోనే కరోనా రెండోదశ మొదలైనా.. ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి అనంతరం ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఏంటని హైకోర్టు నిలదీసింది. ఎన్నికలను వాయిదా వేయడానికి సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదా? అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం ఎన్నికల ప్రచార సమయాన్ని కూడా కుదించ లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ యంత్రాంగం కరోనా నియంత్రణ వదిలేసి ఎన్నికల పనుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడింది. ఎస్ఈసీ వివరణ సంతృప్తికరంగా లేదన్న హైకోర్టు..కాసేపట్లో ఎన్నికల సంఘం అధికారులు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.