close
Choose your channels

యురేనియం తవ్వకాలపై అసెంబ్లీ కేటీఆర్ ప్రకటన!

Sunday, September 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యురేనియం తవ్వకాలపై అసెంబ్లీ కేటీఆర్ ప్రకటన!

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు గాను రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి అనుమతినిచ్చాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అన్నీ తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తున్నాయి..? అడవులను తవ్వేస్తే పరిస్థితేంటి..? అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయ్..? అంటూ పలువురు ప్రముఖులు, విశ్లేషకులు, సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఉద్యమానికి తెరలేపారు. అయితే ప్రస్తుతానికి తెలంగాణ సర్కార్ మాత్రం ఈ తవ్వకాలపై వెనక్కి తగ్గింది.

యురేనియం నిక్షేపాలు ఉన్నా!
ఇక అసలు విషయానికొస్తే.. ఆదివారం నాడు ప్రత్యేకంగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ తవ్వకాలపై నిశిత చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందుకు మంత్రి కేటీఆర్ బదులిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వేదికగా తవ్వకాలపై కేటీఆర్‌ ప్రకటన చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. యురేనియం నిక్షేపాల కోసం నల్గొండ జిల్లాలో అన్వేషణ చేపట్టాం కానీ.. నాగర్‌కర్నూల్‌- అమ్రాబాద్‌ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని స్పష్టం చేశారు. ‘యురేనియం నిక్షేపాల కోసం రాష్ట్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. యురేనియం నిక్షేపాలు ఉన్నా అనుమతులు ఇవ్వబోమని వన్యప్రాణుల సంరక్షణ విభాగం స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి అసెంబ్లీ, కౌన్సిల్‌లో యురేనియంకు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తాం’ అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

రెండు దశలుంటాయ్!
‘మైనింగ్‌లో రెండు దశలుంటాయి.. తొలి దశలో అన్వేషణ చేస్తారు. ప్రాథమిక దశలో జియాలజిస్టులు అధ్యయనం చేస్తారు. యురేనియం ఉందనే అంచనాకు వచ్చిన తర్వాతే అన్వేషణ చేస్తారు. కేంద్రం పరిధిలోని ఏఎండీ ఆధ్వర్యంలో ప్రక్రియ జరుగుతుంది. మైనింగ్‌ చేయాలా..? వద్దా..? అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. యురేనియంపై రాష్ట్రప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. యురేనియం శుద్ధి చేసే వరకు ఎలాంటి రేడియేషన్‌ వెలువడదు.. అన్వేషణ దశలోనే కృష్ణా జలాలు కలుషితమైనట్టు ప్రచారం చేస్తున్నారు’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

మేం అనుమతివ్వలేదు!
‘నల్గొండ జిల్లాలోని లంబాపూర్, పెద్దగట్టు, చిత్రియాల్‌లో 1992-2012 కాలంలో ఏఎండీ యురేనియం అన్వేషణ చేపట్టింది. 18 వేల 550 మెట్రిక్ టన్నుల యురేనియం నిక్షేపాలు ఉన్నాయని కనుగొన్నారు. హైదరాబాద్‌లోని డీఏఈ, ఏఎండీ తరపున సాగర్ డబ్ల్యూఎల్‌లోని చిత్రియాల్‌లో 50 చ.కి.మీ పైబడి సర్వే చేసింది. బోర్లను తవ్వడం కోసం అటవీశాఖ ఉన్నతాధికారికి 2012లో ప్రభుత్వం అనుమతిచ్చింది. నల్లమలలో యురేనియం నిక్షేపాలు ఉన్నా వాటిని వెలికితీసేందుకు అనుమతి ఇవ్వబోమన్న షరతుతో 2016లోనే రాష్ట్ర అటవీశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్‌కు నల్లమలలో ఎలాంటి అనుమతి ఇవ్వలేదు’ అని కేటీఆర్ తేల్చిచెప్పారు.

మాకు ఎలాంటి సంబంధం లేదు!
ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. యురేనియం అన్వేషణకు 2009లో కాంగ్రెస్‌ పార్టీ అనుమతి ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తోందని.. 2016లో యురేనియం అన్వేషణకు మాత్రమే అనుమతి వచ్చిందని ఆయన తెలిపారు. యురేనియం అన్వేషణలో టీఆర్‌ఎస్‌కి ఎలాంటి సంబంధం లేదని కడియం తేల్చిచెప్పారు.

ఇదిలా ఉంటే.. మొత్తానికి చూస్తే ఈ తవ్వకాలపై కేటీఆర్ అధికారిక ప్రకటన చేయడంతో కాస్త పరిస్థితులు సద్దుమణిగే అవకాశం ఉంది. లేకుంటే తెలంగాణలో మరో ఉద్యమం వచ్చేది.. సో.. కేటీఆర్ నిర్ణయంతో నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.