close
Choose your channels

Meda Meeda Abbayi Review

Meda Meeda Abbayi Review
Banner:
Jahnavi Films
Cast:
Allari Naresh, Nikhila Vimal, Avasarala Srinivas, Hyper Adhi, Jayaprakash, Jeeva, Tulasi
Direction:
G Prajith
Production:
Boppana Chandrasekhar
Music:
DJ Vasanth
Movie:
Meda Meeda Abbayi

Meda Meeda Abbayi

IndiaGlitz [Friday, September 8, 2017 • తెలుగు] Comments

Meda Meeda Abbayi Telugu Movie Review

అల్ల‌రి న‌రేష్‌..ఈ పేరు తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మే. స్వ‌ర్గీయ ద‌ర్శ‌కుడు ఈవివి స‌త్య‌నారాయ‌ణ త‌న‌యుడుగా ఎంట్రీ ఇచ్చిన న‌రేష్ త‌క్కువ కాలంలోనే త‌న‌దైన కామెడితో మంచి పేరు, విజ‌యాల‌ను సాధించాడు. అయితే 2012లో సుడిగాడు చిత్రంతో సూప‌ర్‌హిట్ సాధించిన అల్ల‌రి న‌రేష్‌కు ఆ రేంజ్ హిట్ త‌ర్వాత లేకుండా పోయింది. ఐదేళ్లుగా న‌రేష్ చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. అయితే విజ‌యం మాత్రం అల్ల‌రి న‌రేష్‌కు అంద‌నంత దూరంలోనే ఆగిపోయింది. దీంతో స్పూఫ్‌ల‌ను ప‌క్క‌న పెట్టి అల్ల‌రి న‌రేష్ పంథా మార్చి చేసిన చిత్ర‌మే `మేడ మీద అబ్బాయి`. మ‌ల‌యాళ చిత్రం `ఒరు వ‌డ‌క్కిల్ సెల్ఫీ` సినిమాకు తెలుగు రీమేకే ఈ చిత్రం. మ‌రి న‌రేష్ మార్చుకున్న పంథా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌ర్క‌వుట్ అయ్యిందా? న‌రేష్‌కు హిట్ ద‌క్కిందా అని తెలుసుకోవాలంటే ముందు క‌థేంటో చూద్దాం..

క‌థ:

మ‌ధ్య త‌ర‌గ‌తి త‌ల్లిదండ్రులు క‌ష్ట‌ప‌డి చ‌దివించినా, చ‌దువుకోకుండా, జీవితం విలువ అర్థం చేసుకోకుండా జ‌ల్సాగా తిరిగే కుర్రాడు శీను(అల్ల‌రి న‌రేష్‌). ఇంజ‌నీరింగ్‌లో 24 స‌బ్జెక్ట్స్‌లో ఫెయిలౌతాడు. ఊర్లోకి వ‌చ్చిన శీను, అక్క‌డ అమ్మాయిల‌ను సైట్ కొడుతుంటాడు. కానీ ఎవ‌రూ శీనుని ప‌ట్టించుకోరు. అదే స‌మయంలో శీను ప‌క్కింట్లోకి సింధు(నిఖిలా విమ‌ల్‌) కుటుంబం అద్దెకు దిగుతుంది. సింధు కూడా శ్రీనును ప‌ట్టించుకోదు. కానీ శ్రీను మాత్రం సింధుకి, త‌న‌కు మ‌ధ్య ప్రేమ ఉంద‌ని స్నేహితుల ద‌గ్గ‌ర అబ‌ద్ధం చెబుతాడు. త‌ను 24 స‌బ్జెక్ట్స్‌లో ఫెయిలైన సంగ‌తి తండ్రికి తెలిస్తే త‌న‌ను కిరాణా షాపులో ప‌నికే ప‌రిమితం చేస్తాడ‌ని భావించిన శీను ఎవ‌రికీ చెప్ప‌కుండా హైద‌రాబాద్ ట్రెయిన్ ఎక్కేస్తాడు. అదే ట్రెయిన్‌లో సింధు కూడా ఉంటుంది. హైద‌రాబాద్ చేరిన శీను సినిమా డైరెక్ష‌న్ ఛాన్సుల కోసం  ఆఫీసుల చుట్టూ తిరిగి చివ‌రికి ఊరు చేరుకుంటాడు. అయితే ఊర్లో అందరూ అత‌న్ని అనుమానంగా చూస్తారు. అందుకు కార‌ణం సింధు క‌న‌ప‌డ‌క‌పోవ‌డ‌మే. సింధుని శీను లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాడ‌ని అంద‌రూ అనుకుంటారు?  శీను నిజం చెప్పినా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. దాంతో శీను సింధుని వెతుక్కుంటూ హైద‌రాబాద్‌కి వెళతాడు. అస‌లు సింధు ఏమౌతుంది? హ‌రి నారాయ‌ణ్ ఎవ‌రు? హ‌రికి, ధ‌నుంజ‌య్‌, సింధుకు ఉన్న రిలేష‌న్ ఏంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

స‌మీక్ష:

అల్ల‌రి న‌రేష్ పంథా మార్చి సినిమా చేశాన‌ని చెప్పాడు. ఓ ర‌కంగా చెప్పాలంటే న‌రేష్ పాత్ర ప‌రంగా చూస్తే డిఫ‌రెంట్‌గానే ఉంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు న‌రేష్‌ను కామెడీ యాంగిల్‌లో చూసిన ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌ని యాంగిల్ ఇది. ఫ‌స్టాఫ్‌లో న‌రేష్ పాత్ర‌కు ఉన్న ప్రాముఖ్య‌త సెకండాఫ్‌లో క‌న‌ప‌డ‌దు. ప్రాత స్పూఫ్‌ల ద్వారా కామెడీ చేయకున్నా, స‌న్నివేశాల ప‌రంగా కామెడీ జ‌న‌రేట్ కావాలి, కానీ న‌రేష్ పాత్ర‌, దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాల్లో కామెడీ ఏ కోశానా క‌న‌ప‌డ‌లేదు. నిఖిలా విమ‌ల్  పాత్ర డీసెంట్‌గా ఉంది. గ్లామ‌ర్‌కు ఎక్క‌డా స్కోప్ క‌న‌ప‌డ‌దు. పెర్ఫామెన్స్ ప‌రంగా నిఖిల రెండు, మూడు స‌న్నివేశాల్లో చ‌క్క‌గానే న‌టించింది. ఇక సినిమాలో చెప్పుకోవాల్సిన పాత్ర హైప‌ర్ ఆది. జ‌బ‌ర్‌ద‌స్త్ షో కామెడీతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించే హైప‌ర్ ఆది ఈ సినిమ‌లో పూర్తి స్థాయి పాత్ర‌లో క‌న‌ప‌డ్డాడు. జ‌బ‌ర్‌ద‌స్త్ త‌ర‌హాలో కామెడీ పంచ్‌లు, ప్రాస‌లతో ఆక‌ట్టుకున్నాడు. హైపర్ ఆది పాత్ర కార‌ణంగానే సినిమాలో కాస్తా ఎంటర్‌టైన్‌మెంట్ అయినా క‌న‌ప‌డుతుంది. ఇక అవ‌స‌రాల శ్రీనివాస్ పాత్ర క‌థ‌లో కీల‌కంగా ఉంటుంది. ప్రైవేట్ డిటెక్టివ్ పాత్ర‌. అవ‌స‌రాల శ్రీనివాస్ త‌న పాత్ర‌కు న్యాయం చేశారు. ఇక జ‌య‌ప్ర‌కాష్‌, తుల‌సి, జోగి నాయుడు, దువ్వాసి మోహ‌న్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే ద‌ర్శ‌కుడు ప్ర‌జిత్ మ‌ల‌యాళ మాతృక‌లోని సోల్‌ను తెలుగు రీమేక్‌లో తీసుకురాలేక‌పోయాడు. సినిమా చూస్తున్నంత సేపు చ‌ప్ప‌గా సాగుతుంటుంది. చివ‌రి ప‌ది నుండి ప‌దిహేను నిమిషాలు ఓకే. షాన్ రెహమాన్ ట్యూన్స్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అస్స‌లు బాలేదు. ఉన్ని ఎస్‌.కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్ జ‌స్ట్ యావ‌రేజ్‌. సినిమాలో కామెడి, మ్యూజిక్‌, సినిమాటోగ్ర‌పీ ఇలా కీల‌కాంశాలేవీ ఆక‌ట్టుకోలేదు.

బోట‌మ్ లైన్: మేడ మీద అబ్బాయి... హైప‌ర్ అల్ల‌రి న‌రేష్ మూవీలా కాకుండా హైప‌ర్ ఆది జ‌బ‌ర్ ద‌స్త్ ఎక్స్‌ట్రా కంటే కాస్తా పెద్ద‌ది.. అంటే  డ‌బుల్ ఎక్స్‌ట్రా షోలా అనిపించింది.

Rating: 2.25 / 5.0

Watched Meda Meeda Abbayi? Post your rating and comments below.