Download App

Naa Peru Surya - Naa Illu India Review

స్టైలిష్ స్టార్ బ‌న్ని సినిమా వ‌స్తుంద‌న‌గానే యూత్ లో ఒక విధ‌మైన క్రేజ్ ఉంటుంది. వ‌రుస హిట్ల‌తో జాగ్ర‌త్త‌గా క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటున్నారు బ‌న్ని. ఆ వ‌రుస క్ర‌మంలో ఆయ‌న తాజాగా న‌టించిన సినిమా `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`. క‌థా ర‌చ‌యిత‌గా ఎన్నో సినిమాల‌కు ప‌నిచేసిన వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా ఇది. ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌, నాగ‌బాబు క‌లిసి నిర్మించారు. సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కి కూడా మంచి స్పంద‌న వ‌చ్చింది. లేటెస్ట్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందా?  లెట్స్ సీ..

క‌థ‌:

సూర్య ( అల్లు అర్జున్‌) ఆర్మీ అధికారి. బేస్ క్యాంప్ నుంచి బోర్డ‌ర్‌కి షిఫ్ట్ కావాల‌ని క‌ల‌లు కంటాడు. అందుకు త‌గ్గట్టు క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తాడు. అయితే అత‌నికి ఉన్న లోపం కోపం. ఆ కోపం కార‌ణంగానే అత‌ను అధికారుల ద‌గ్గ‌ర త‌ల‌వంచుకోవాల్సి వ‌స్తుంది. ఓ సంద‌ర్భంలో ఓ టెర్ర‌రిస్ట్ ను కాల్చి చంపేస్తాడు. అది అత‌నికి మైన‌స్ అవుతుంది. దాన్నే కార‌ణంగా చూపుతూ అత‌ని అధికారి క‌ల్న‌ల్ (బొమ్మ‌న్ ఇరాని) అత‌న్ని విధుల నుంచి స‌స్పెండ్ చేయాల‌నుకుంటారు. ఆ స‌మ‌యంలో సూర్య గాడ్‌ఫాద‌ర్ (రావు ర‌మేష్‌) రంగంలోకి దిగుతాడు. సూర్య‌ని వైజాగ్‌లోని ర‌ఘురామ‌కృష్ణంరాజు (అర్జున్) ద‌గ్గ‌ర‌కు పంపిస్తాడు. ర‌ఘు రామ‌కృష్ణంరాజుకు, సూర్య‌కు అంత‌కు ముందే ప‌రిచ‌యం ఉందా? ఉంటే అది కేవ‌లం ప‌రిచ‌య‌మేనా? బ‌ంధ‌మా?  సూర్య‌కి వ‌ర్ష (అను ఇమ్మాన్యుయేల్‌) ఎక్క‌డ ప‌రిచ‌య‌మ‌వుతుంది? ఆర్ట్స్ కాలేజీలో చ‌దివే వ‌ర్ష‌కి, సూర్య‌కి ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిందా?  త‌న‌కున్న ఏకైక లోపం కోపాన్ని 21 రోజుల్లో సూర్య అధిగమించ‌గ‌లిగాడా?  లేడా? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు.

ప్లస్‌ పాయింట్స్‌:

సినిమాకు ప్రధాన బలం హీరో అల్లు అర్జున్‌. బన్ని అంటే సగటు ప్రేక్షకుడికి చటుక్కున గుర్తుకు వచ్చేది డాన్సులు, ఫైట్స్‌. ఈ సినిమా విషయానికి వస్తే డాన్సులు, ఫైట్సే కాదు. నటన పరంగా సరికొత్త బన్ని ప్రేక్షకులకు దర్శనమిస్తాడు. యాంగ్రీ యంగ్‌మేన్‌ పాత్రలో బన్ని నటన సింప్లీ సూపర్బ్‌. ఫస్ట్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ నుండి సినిమా ముగిసే వరకు బన్ని తన క్యారెక్టర్‌లో టెంపోను మిస్‌ కానీయలేదు. ఇక సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో క్యారెక్టర్‌ అర్జున్‌ది. బన్ని తండ్రి పాత్రలో, ప్రముఖ సైక్రియాటిస్ట్‌గా అర్జున్‌ హుందాగా నటించాడు. పాత్ర పరిధి మేర చక్కగా నటించాడు. ఇంటర్వెల్‌ ముందు, ప్రీ క్లైమాక్స్‌ ముందు సీన్స్‌లో అర్జున్‌ నటన.. ఆయన అనుభవాన్ని మనకు గుర్తుకు తెస్తుంది. ఇక హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్‌, రావు రమేశ్‌, బోమన్‌ ఇరానీ, రవి కాలే, పోసాని కృష్ణమురళి, నదియా, వెన్నెలకిశోర్‌, అనూప్‌ సింగ్‌, మెయిన్‌ విలన్‌గా నటించిన శరత్‌కుమార్‌, ప్రదీప్‌ రావత్‌, హరీశ్‌ ఉత్తమన్‌ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక దర్శకుడు వక్కంతం వంశీ బలమైన హీరో క్యారెక్టర్‌ను డిజైన్‌ చేయడమే కాదు..దాని చుట్టూ మిగిలిన పాత్రలను కూడా ఇన్‌టెన్స్‌తో ఉండేలా డిజైన్‌ చేసుకున్నాడు. కొత్త దర్శకుడనే భావన కనపడదు. సినిమాను చక్కగా హ్యాండిల్‌ చేశాడు. సినిమాలో లవర్‌ అల్‌సో... ఫైటర్‌ ఆల్‌ సో సాంగ్‌తో పాటు పిలగా నువ్‌ ఇరగ ఇరగ సాంగ్స్‌ పిక్చరైజేషన్‌... వాటిలో బన్ని స్టెప్స్‌ అదరగొట్టాడు. రాజీవ్‌ రవి సినిమాటోగ్రఫీ బావుంది. విశాల్‌ శేఖర్‌ కంపోజ్‌ చేసిన సాంగ్స్‌లో మూడు సాంగ్స్‌ బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంది.

మైనస్‌ పాయింట్స్‌:

సినిమాలో సెకండాఫ్‌లో ఇన్‌టెన్స్‌ ఫ్లో మిస్‌ అయ్యింది. ముఖ్యంగా క్లైమాక్స్‌ను ప్రేక్షకుడు ఊహించేదానికి భిన్నంగా చేయడం.. అది సాగదీతగా అనిపించింది. ఇక ప్రీ క్లైమాక్స్‌ వరకు సాలిడ్‌గా అనిపించిన విలన్‌ రోల్‌ తర్వాత వీక్‌ అయ్యింది.

విశ్లేషణ:

బోర్డర్‌లో దేశం కోసం ప్రాణాలు విడవాలి.. అనుకునే బలమైన లక్ష్యంతో ఉండే కుర్రాడు. కానీ ఈ కుర్రాడికి కోపం ఎక్కువ. తన కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే చూడలేడు. అందుకే ఇతనిపై కంప్లైంట్స్‌ వస్తుంటాయి. అనుకోని పరిస్థితుల్లో సైన్యం నుండి బయటకు రావడం.. బోర్డర్‌కు రావాలంటే దేశంలోనే పేరు మోసిన సైక్రియాటిస్ట్‌ సంతకం అవసరం.. సదరు సైక్రియాటిస్ట్‌ తను వద్దనుకున్న తండ్రి.. తనను వద్దనుకున్న తండ్రి కావడం ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్యం కోసం సైనికుడు తన క్యారెక్టర్‌ను పక్కన పెడతాడు. 21 రోజులు ఏ గొడవలకు పోకుండా దూరంగా ఉంటాడు. ఆ పరిస్థితుల్లో తన కళ్ల ముందు అన్యాయం జరిగిన పట్టించుకోడు. కానీ తన తప్పును తెలుసుకుంటాడు. ఏం చేశాడనే పాయింట్‌లో ఎంత ఇన్‌టెన్సిటీ కనపడుతుంది. దాన్ని మోయాలంటే హీరో కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆ స్ట్రెంగ్త్‌ తనకు ఉందని బన్ని మరోసారి రుజువు చేసుకున్నాడు. ఇప్పటి వరకు బన్ని చేసిన పాత్రలకు ఈ పాత్రకు చాలా వేరియేషన్‌ కనపడుతుంది. అలాగే సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కించిన విధానం.. అందులో బన్ని చేసిన తీరు క్లాప్స్‌ కొట్టిస్తాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌ ఫైట్‌లో విలన్స్‌ ఊపిరి బిగపట్టి పారిపోయేలా హీరో ఫైట్‌ చేయడం చాలా బాగా డిజైన్‌ చేశారు. ఇంత బలమైన హీరో క్యారెక్టర్‌, ధీటైన విలన్‌ క్యారెక్టర్‌ చివర్లో బలహీనమైంది. క్లైమాక్స్‌లో ప్రేక్షకుడు భారీ ఫైట్‌ సీక్వెన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తాడు. అవేవీ సినిమాలో ఉండకపోవడం..అసలు విలనిజం కనపడదు. ప్రీ క్లైమాక్స్‌ వరకు సినిమాలో సన్నివేశాలను ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్‌ చేస్తాడు.

బోటమ్‌ లైన్‌: నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా... ఇన్‌టెన్స్‌ యాక్షన్‌ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌

Naa Peru Surya Movie Review in English

Rating : 3.0 / 5.0